చెన్నై: ప్రముఖ గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన కోలుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఇతర ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో గురువారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయాన్ని ఎంజిఎం ఆసుపత్రి వైద్యులు ధ్రువీకరించారు. గత 24 గంటలుగా ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిందని తెలిపారు. బాలు ఆరోగ్యాన్ని నిపుణులైన వైద్య బృందం పర్యవేక్షిస్తోందన్నారు. కాగా, కరోనా వైరస్ సోకడంతో ఆగస్టు 5న బాల సుబ్రహ్మణ్యం చెన్నైలోని ఎంజిఎం ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో వైద్యులు వెంటిలేటర్, ఎక్మో సాయంతో చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు, అభిమానులు, శ్రేయోభిలాషులు బాలు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఇటీవల ఆయనకు కరోనా నెగెటివ్ అని తేలడంతో అందరూ సంతోషం వ్యక్తంచేశారు. బాలు త్వరగా కోలుకొని క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు. ఇటీవల ఆయన తనయుడు ఎస్పి చరణ్ మాట్లాడుతూ ఎక్మో/వెంటిలేటర్ సాయంతో తన తండ్రికి చికిత్స కొనసాగుతోందని చెప్పారు. వైద్యులు ఫిజియోథెరపీ చేస్తున్నారన్నారు. ప్రస్తుతం ఆయన ఆహారంగా ద్రవ పదార్థాలు తీసుకుంటున్నారని, ఆస్పత్రి నుంచి సాధ్యమైనంత త్వరగా ఇంటికి వెళ్లాలన్న ఆసక్తితో ఉన్నారంటూ చరణ్ ట్విటర్లో పేర్కొన్నారు. తాజాగా ఆయన ఆరోగ్యంపై వస్తున్న వార్తలతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
ఎస్పి బాలు ఆరోగ్యం విషమం
RELATED ARTICLES