ఎవరిది బాధ్యత?

ప్లాన్‌లు ఉల్లంఘించి ఆసుపత్రి భవనాలు నిర్మించడం సరికాదు
అధికారులను నిలదీసిన హైకోర్టు
హైదరాబాద్‌ లీగల్‌ : మంజూరు చేసిన ప్లాన్‌ను ఉల్లంఘించి ఆసుపత్రి భవనాలు నిర్మిస్తే జరగకూడనిది ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని అధికారులను హైకోర్టు నిలదీసింది. సెట్‌బ్యాక్‌ లేకుం డా బహుళ అంతస్థుల భవనాన్ని నిర్మించి అందులో ప్రైవేట్‌ ఆసుపత్రి నిర్వహించడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. చట్ట ప్రకా రం చర్య లు తీసుకోవాలని సింగిల్‌ జడ్జి ఆదేశిస్తే అధికారులు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటారా అని డివిజన్‌ బెం చ్‌ మండిపడింది. సెట్‌బ్యాక్‌ లేకుండా, ఫైర్‌సేఫ్టీ లేకుండా ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ పొందకుండా కరీంనగర్‌లో వెంకటేశ్వర కిడ్నీ సెంటర్‌ ఆసుపత్రి నిర్వహిస్తుంటే అధికారులు ప్రేక్షకపాత్ర పోషిస్తూ కళ్లప్పగించి చూస్తూ ఉంటారా.. అని ప్రశ్నించింది. ప్లాన్‌కు భిన్నంగా నిర్మించిన భవంతిలో ఆసుపత్రి కొనసాగిస్తున్నారని సిహెచ్‌ లక్ష్మీ నర్సింహారావు ఇతరులు దాఖలు చేసిన కేసులో సింగిల్‌ జడ్జి గతంలో చట్ట ప్రకారం అన్నీ ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించి రిట్‌ను క్లోజ్‌ చేశారు. అయితే అధికారులు ఆ భవన యజమానులకు, ఆసుపత్రి యాజమాన్యానికి నోటీసులు ఇచ్చి వదిలేశారు. దాంతో పిటిషనర్‌ అప్పీల్‌ దాఖలు చేయగా, దీనిని సోమవారం చీఫ్‌ జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌, జస్టిస్‌ అభిషేక్‌రెడ్డి డివిజన్‌ బెంచ్‌ విచారించింది. ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోకుండా ఏళ్ల తరబడి ఆస్పత్రిని ఎలా కొనసాగిస్తారని, ఆ వ్యవహారాన్ని అధికారులు చూసీ చూడనట్లుగా ఎందుకు వ్యవహరిస్తున్నారని బెంచ్‌ ప్రశ్నించింది. చట్ట ప్రకారం అన్ని చర్యలు తీసుకుని తీరాలని, లేని పక్షంలో ప్రతివాదులైన మున్సిపల్‌, ఫైర్‌, మెడికల్‌, విపత్తు నిర్వహణ శాఖల అధికారులపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాల్సి వస్తుందని డివిజన్‌ బెంచ్‌ హెచ్చరించింది. వీరందరినీ కోర్టు విచారణకు స్వయంగా హాజరుకావాలని ఉత్తర్వులు ఇవ్వాల్సివస్తుందని హెచ్చరించింది. ఆసుపత్రిని తనిఖీ చేసి తక్షణమే నివేదిక ఇవ్వాలని ఉత్తర్వులిచ్చింది. ఇప్పటి వరకూ ఎందుకు స్పందించలేదో చెప్పాలని కోరింది. ప్రాణాలు కాపాడాల్సిన వైద్యుడే ప్రమాదం జరిగితే రక్షించలేని పరిస్థితుల్లో ఉన్న ఆసుపత్రిలో వైద్యం అందించడం సిగ్గుచేటని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇదే విధంగా ఆసుపత్రిని కొనసాగిస్తే దాని గుర్తింపును రద్దు చేయాలని మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాకు ఉత్తర్వులు ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరించింది. అనుమతులకు విరుద్ధంగా నిర్మించిన భవనంలో ఆసుపత్రిని ఎలా నిర్వహిస్తారని నిలదీసింది. ఫైర్‌ సేఫ్టీ పరికరాలు,సెట్‌బ్యాక్‌ వదలకుండా ఏడేళ్ల నుంచి ఆసుపత్రిని ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించింది. సెట్‌బ్యాక్‌ లేని భవనంలో జరగకూడని అగ్నిప్రమాదం జరిగితే అమాయక రోగులు బలి కావాలా..ఢిల్లీ, కోల్‌కతా తర హా భారీ అగ్ని ప్రమాదాలు జరిగితే ఎవురు బాధ్యత వహిస్తార ని నిలదీసింది. రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడతారా.. ప్రాణాల్ని కాపాడాల్సిన ఆసుపత్రిలు చట్టప్రకారం లేకపోతే ఎలాగని ప్రశ్నించింది. రెండువారాల్లోగా నిబంధనలను అమ లు చేయాల్సిందేనని తేల్చి చెప్పింది. ప్రతివాదులు స్పందించకపోతే కోర్టు ధిక్కార చర్యలు తప్పవని హెచ్చరించింది. సమగ్ర నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన డివిజన్‌ బెంచ్‌ విచారణను 30కి వాయిదా వేసింది.

DO YOU LIKE THIS ARTICLE?