ఎపి స్థానిక ఎన్నికలకు కరోనా దెబ్బ!

ప్రజాపక్షం / విజయవాడ : కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక ఎన్నికల ప్రక్రియను వాయిదా వేసింది. ఎన్నికల ప్రక్రి యను 6 వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్ని కల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ ప్రకటించారు. విజయ వాడలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘కరోనా ప్రభావంతో దేశవ్యాప్తంగా ఊహించని మార్పు లు వచ్చాయి. మారిన పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పేపర్‌ బ్యాలెట్‌వల్ల కరోనా విస్తరించే ప్రమాదం ఉంది. విధిలేని పరిస్థితుల్లోనే స్థానిక ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తున్నాం. పార్టీలు, ఉద్యోగులు, అన్ని వర్గాలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆరు వారాల తర్వాత సమీక్ష చేపడతాం. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాకే ఎన్నికలు నిర్వహిస్తాం. ఆరు వారాల తర్వాత ఎన్నికల ప్రక్రియ మళ్లీ ప్రారంభమవుతుంది. ఆరు వారాల తర్వాత కొత్త షెడ్యూల్‌ విడుదల చేస్తాం’ అని ఆయన ప్రకటించారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో చోటుచేసుకున్న హింసాత్మక చర్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామని రమేశ్‌కుమార్‌ పేర్కొన్నారు. కొన్ని చోట్ల బెదిరింపులకు దిగడం దారుణమని అన్నారు. కొందరు అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. తిరుపతి, మాచర్ల, పుంగనూరు ఘటనలను నిశితంగా పరిశీలిస్తున్నామన్నారు. గుంటూరు, చిత్తూరు జిల్లా కలెక్టర్లు, ఎస్‌పిలను తప్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక్కడ వేరే అధికారులను నియమించాలని ఆదేశించామన్నారు. మాచర్ల సిఐపై సస్పెన్షన్‌ వేటు వేసినట్లు వెల్లడించారు.

DO YOU LIKE THIS ARTICLE?