అమరావతి : ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఫ్యాన్ గాలికి టిడిపి, బిజెపి, జనసేన పార్టీలు కొట్టుకుపోయాయి. మొత్తం 11 కార్పొరేషన్లు, విశాఖపట్నం, విజయవాడ, మచిలీపట్నం, గుం టూరు, విజయనగరం, ఒంగోలు, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, వైఎస్సార్ కడప, అనంతపురం ఆ పార్టీ ఖాతాలోకి వెళ్లాయి. మున్సిపాలిటీల్లోనూ వైఎస్‌ఆర్ సిపి ప్రభజనం సృష్టించింది. 75 మున్సిపాలిటీలకుగాను 74 మున్సిపాలిటీలను కైవసం చేసుకొని సరికొత్త రికార్డు సృష్టించింది. పలు మున్సిపాలిటీల్లో టిడిపి ఖాతా తెరవలేకపోవడం గమనార్హం. బిజెపి, జనసేన ప్రజలను ఆకట్టుకోలేకపోయాయి. కృష్ణా జిల్లాలో వైఎస్‌ఆర్ సిపి క్లీన్‌స్వీప్ సాధించింది. విజయవాడ, మచిలీపట్నం కార్పొరేషన్లను కైవసం చేసుకుంది. ఉయ్యూరులో 20 స్థానాలకుగాను వైఎస్‌ఆర్‌సిపి 16 గెల్చుకోగా, టిడిపి నాలుగు చోట్ల గెలిచింది. నందిగామ మున్సిపాలిటీలో వైఎస్‌ఆర్‌సిపి 13, టిడిపి 6, జనసేన ఒకటి చొప్పున సీట్లు గెల్చుకున్నాయి. నూజివీడులో వైఎస్‌ఆర్సిపి 21, టిడిపి ఒకటి, బిజెపి ఒకటి చొప్పున గెల్చుకున్నాయి. విశాఖ కార్పొరేషన్‌ను కూడా సొంతం చేసుకుంది. ఇక్కడ 98 స్థానాలకుగాను వైఎస్‌ఆర్ సిపి 58, టిడిపి 30, జనసేన 3, బిజెపి ఒకటి, సిపిఐ ఒకటి, సిపిఎం ఒకటి, ఇతరులు 4 చొప్పున సీట్లు సంపాదించాయి. యలమంచలిలో 25కు గాను 23, నర్సీపట్నంలో 28కి గాను 14 స్థానాలు వైఎస్‌ఆర్ సిపి దక్కించుకుంది. అనంతపురం కార్పొరేషన్‌లో వైఎస్‌ఆర్ సిపి 50కిగాను 48 స్థానాల్లో విజయభేరి మోగించింది. ఇతరులకు రెండు సీట్లు దక్కాయి. రాయదుర్శంలో 32కుగాను 30, మడకశిరలో 20కి గాను 15, కల్యాణదుర్గంలో 24కుగాను 20, గుత్తిలో 25కుగాను 24, పుట్టపర్తిలో 20కిగాను 14, హిందూపురంలో 38కి గాను 29. కదిరిలో 36కి గాను 30. గుంతల్లులో 37కు గాను 28, తాడిపత్రిలో 37కు గాను 16 చొప్పున సీట్లను గెల్చుకొని వైఎస్‌ఆర్ సిపి తనకు తిరుగులేదని నిరూపించింది. ధర్మవరంలో క్లీన్‌స్వీప్ సేసింది. 40కి 40 సీట్లను దక్కించుకొని విజయఢంగా మోగించింది. గుంటూరు జిల్లాలోనూ అధికార వైఎస్‌ఆర్ సిపి హవా స్పష్టంగా కనిపించింది. గుంటూరు కార్పొరేషన్‌లో 57కుగాను 45, తెనాలిలో 40కి గాను 32, చిలకలూరిపేటలో 38కిగాను 30, రేపల్లెలో 28కి గాను 26, సత్తెనపల్లిలో 31కి గాను 24, వినుకొండలో 32కు గాను 28 చొప్పున స్థానాలను గెల్చుకుంది. మాచర్ల (31), పిడుగురాళ్ల (33)లో అన్ని సీట్లను సొంతం చేసుకొని, టిడిపి, బిజెపి, జనసేనకు చోటు లేకుండా చేసింది. ప్రకాశం జిల్లాలోని ఒంగోలు కార్పొరేన్‌లో 50 సీట్లకుగాను 41 సీట్లను గెల్చుకొని వైఎస్‌ఆర్ సిపి తన సత్తా చాటింది. టిడిపి 6 స్థానాలు గెల్చుకోగా, జనసేనకు ఒకటి, ఇతరులకు రెండు సీట్లు దక్కాయి. మున్సిపాలిటీల విషయానికి వస్తే, గిద్దలూరులో 20కి గాను 16, చీమకుర్తిలో 20కి గాను18, మార్కాపురంలో 35కు గాను 30, అద్దంకిలో 19కి గాను 13, చీరాలలో 33కు గాను 19 చొప్పున సీట్లను వైఎస్‌ఆర్ సిపి గెల్చుకుంది. కనిగిరిలో మొత్తం 20 స్థానాలు ఉండగా, అన్నిటినీ ఆ పార్టీ తన ఖాతాలో వేసుకుంది. నెల్లూరు జిల్లాలోనూ ఫ్యాన్ జోరుకు తిరుగులేకపోయింది. నాయుడుపేట మున్సిపాలిటీలో 25కు గాను 23, సూళ్లూరుపేటలో 25కు గాను 24, ఆత్మకూరు (ఎం)లో 23కు గాను 19 స్థానాల్లో విజయభేరి మోగించింది. వెంకటగిరిలోని మొత్తం 25 సీట్లనూ ఆ పార్టీ గెల్చుకోవడంతో, మిగతా పార్టీలు ఊసులోకి లేకుండా పోయాయి. చిత్తూరు కార్పోరేషన్‌లో 50కి గాను 46, తిరుపతి కార్పొరేషన్‌లో 49కి గాను 48 చొప్పున సీట్లను సంపాదించి, తనకు తిరుగులేదని నిరూపించింది. చిత్తూరు జిల్లా మున్సిపాలిటీల విషయానికి వస్తే, మదనపల్లెలో 35కు గాను 33, పలమనేరులో 26కుగాను 24, నగిరిలో 29కి గాను 24, పుత్తూరులో 27కుగాను 22 చొప్పున సీట్లను వైఎస్‌ఆర్ సిపి గెల్చుకుంది. పుంగనూరు 31 స్థానాలు ఉండగా, అన్నింటిలోనూ ఆ పార్టీ విజయం సాధించి, క్లీన్‌స్వీప్ చేసింది. కర్నూలు జిల్లాలోనూ వైఎస్‌ఆర్ పార్టీ ధాటికి ప్రతిపక్ష పార్టీలు నిలువలేకపోయాయి. కర్నూలు కార్పొరేషన్‌లో 52 స్థానాలు ఉండగా, ఆ పార్టీ 44 స్థానాల్లో గెలిచింది. గూడూరు మున్సిపాలిటీలో 20కి గాను 12, డోన్‌లో 32కు గాను 31, ఆత్మకూరులో 24కు గాను 21, ఎమ్మిగనూరులో 34కు గాను 31, ఆదోనిలో 42కు గాను 41, నందికొట్కూరులో 29కి గాను 21, ఆళ్లగడ్డలో 27కు గాను 22, నంద్యాలలో 42కు గాను 37 చొప్పున స్థానాలను కైవసం చేసుకుంది. వైఎస్‌ఆర్ జిల్లాలోని కడప మున్సిపల్ కార్పొరేన్‌లో 50 స్థానాలకు పోటీ జరగ్గా, వైఎస్‌ఆర్ సిపి 48 స్థానాలు సంపాదించింది. మున్సిపాలిటీల్లో, ప్రొద్దుటూరులో 41కి గాను 40, జమ్మలమడుగులో 20కి గాను 18, బద్వేల్‌లో 35కు గాను 28 చొప్పున సీట్లను గెల్చుకుంది. రాయచోటిలో మొత్తం 34, పులివెందులలో మొత్తం 33, ఎర్రగుంట్లలో మొత్తం 20 సీట్లనూ గెలిచి, క్లీన్‌స్వీప్ నమోదు చేసింది. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం మున్సిపాలిటీలో 23కు గాను 15, పలాసలో 31కి గాను 28, పాలకొండలో 20కి గాను 17 చొప్పున సీట్లను వైఎస్‌ఆర్ సిపి దక్కించుకుంది. విజయనగరంలో జిల్లాలోని బొబ్బిలిలో 31కి గాను 19, పార్వతీపురంలో 30కి గాను 22, సాలూరులో 29కి గాను 20, నెల్లిమర్లలో 20కి గాను 11 చొప్పున సీట్లను వైఎస్‌ఆర్ సిపి కైవసం చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురం మున్సిపాలిటీలో 29కి గాను 21, అమలాపురంలో 30కి గాను 19, గొల్లప్రోలులో 20కి గాను 18, ముమ్మిడివరంలో 20కిగాను 14, ఏలేశ్వరంలో 20కి గాను 16, మండపేటలో 30కి గాను 22 చొప్పున సీట్లను వైఎస్‌ఆర్ సిపి సొంతం చేసుకుంది.
–
ఎపి మున్సిపల్ ఎన్నికల్లో ఫ్యాన్ హవా
RELATED ARTICLES