HomeNewsAndhra pradeshఎపిలో టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు రద్దు

ఎపిలో టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు రద్దు

పరీక్షల నిర్వహిస్తే ఏ ఒక్కరు మరణించినా కోటి రూపాయలు పరిహారం ఇవాల్సిందేనని సుప్రీంకోర్టు హెచ్చరిక
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలు రద్దయ్యాయి. ఎపిలో ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందిస్తూ, ఏ ఒక్క విద్యార్థి మృతి చెందినా, కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని పేర్కొన్న కొన్ని గంటల్లోనే జగన్‌ సర్కారు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. జులై 31 లోపు ఇంటర్‌ ఫలితాలు వెల్లడించాలని సుప్రీం కోర్టు తెలిపిందని, కానీ, పరీక్షల నిర్వహణ, మూల్యాంకనానికి కనీసం 45 రోజుల సమ యం పడుతుందని ఎపి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ గురువారం ఇక్కడ ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో చెప్పారు. కోర్టు నిర్ణయాన్ని అనుసరించి, నిర్ణీత సమయానికి ముందే పరీక్షలను నిర్వహించి, మూల్యాంకనను పూర్తి చేయడం అసాధ్యమని స్పష్టం చేశారు. ఈ ప్రత్యేక పరిస్థితుల్లో టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలను రద్దు చేసినట్టు ప్రకటించారు. మార్కులను ఏ విధానంలో ఇవ్వాలనే విషయంపై త్వరలోనే వివరాలను తెలియచేస్తామని అన్నారు. ఇలావుంటే, ఇంటర్మీడియట్‌ పరీక్షల నిర్వహణ అంశంపై సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కొవిడ్‌ కొనసాగుతున్న సమయంలో పరీక్షలను నిర్వహించడంవల్ల ఏ ఒక్కరు మరణించినా కోటి రూపాయలు పరిహారం ఇవాల్సిందేనని హెచ్చరించింది. పరీక్షలు నిర్వహణకు ప్రభుత్వం సూచించిన ముందు జాగ్రత్త చర్యలతో తాను ఏకీభవించడం లేదని ఆంధ్రప్రదేశ్‌కు స్పష్టంచేసింది. కొవిడ్‌ కారణంగా ఒక్క మరణం కూడా సంభవించదని తాను సంతృప్తి చెందితే తప్ప పరీక్షలకు అనుమతించేది లేదని తేల్చిచెప్పింది. ఇతర రాష్ట్రాల్లానే కొవిడ్‌ కారణంగా మరణించినవారికి కోటి రూపాయల పరిహారం అంశాన్ని కూడా తాము పరిశీలిస్తున్నామని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. దీంతో పరీక్షల విషయంలో ముందుకు వెళ్లాలన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి సుప్రీం వ్యాఖ్యలు చెంపపెట్టుగా పరిణమించాయి. కాగా, 12వ తరగతి పరీక్షలు నిర్వహించాలన్న నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై న్యాయమూర్తులు ఎఎం ఖన్విల్కర్‌, దినేశ్‌ మహేశ్వరి ఆధ్వర్యంలోని ప్రత్యేక ధర్మాసనం ఎన్నో కఠినమైన ప్రశ్నలు సంధించింది. పరీక్షలు పెట్టడానికి గల కారణాలను వివరిస్తూ నివేదికను న్యాయస్థానం ముందుంచాలని ఆదేశించింది. కొవిడ్‌ 19 దృష్ట్యా బోర్డు పరీక్షలు నిర్వహించకూడదని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించాలని దాఖలైన ఒక వ్యాజ్యాన్ని విచారణ చేస్తూ ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. 5,19,510 మంది విద్యార్థులకు పరీక్షల కోసం గదులను ఎలా అందుబాటులోకి తెస్తారని కోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. ఒక్క గదికి 15 మంది చొప్పున కూర్చోబెట్టాలంటే 34,644 గదులు, 18 మంది చొప్పున అయితే 28,862 గదులు అవసరమవుతాయని, ఇన్ని గదులు ఎక్కడినుంచి వస్తాయని ధర్మాసనం ప్రశ్నించింది. ఏదో నామమాత్రంగా పరీక్షలు నిర్వహించకూడదని పేర్కొంది. ఇది కేవలం 5 లక్షల విద్యార్థుల వ్యవహారం మాత్రమే కాదు, పరీక్షల నిర్వహణలో మరో లక్షమంది సిబ్బంది కూడా పాల్గొంటారని, వారి ఆరోగ్యం, భద్రత గురించి కూడా ఆలోచించాలని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. కొవిడ్‌ రెండో దశ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకోవాలని, మూడో దశను ఎలా ఎదుర్కొంటారన్న విషయాన్ని కూడా ఆలోచించాలని హితవు పలికింది. మూడో దశ వస్తే మీ దగ్గర ఎలాంటి వ్యూహాలు ఉన్నాయని, ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే దానిని ఎలా ఎదుర్కొంటారని ధర్మాసనం ప్రశ్నించింది. వీటికి సంబంధించి ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్‌లో ఎలాంటి వివరాలూ లేవని పేర్కొంది. కాబట్టి విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్యం, భద్రత గురించి కొంచెం ఆలోచించి ఉండాల్సిందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఆంధ్రప్రదేశ్‌లో 10వ తరగతికి కేవలం గ్రేడ్‌లే ఇస్తున్నారని, విద్యార్థులను మూల్యాంకనం చేసే యంత్రాంగం ఏదీ లేదని ప్రభుత్వం తరఫు న్యాయవాది మహ్ఫూజ్‌ ఎ నజ్కీ ధర్మాసనానికి వెల్లడించారు. అయితే ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంటుందని, ఈ విషయంలో యుజిసి, సిబిఎస్‌ఇ, సిఐఎస్‌సిఇ తదితర బోర్డులు, నిపుణులను సంప్రదించాలని న్యాయస్థానం సూచించింది. సమస్యలు ఉన్న కారణంగా చాలా రాష్ట్రాలు పరీక్షలు రద్దుచేసిన విషయాన్ని ధర్మాసనం గుర్తుచేసింది. పరీక్షలు, ఫలితాల ప్రకటన విషయంలో విద్యార్థుల మనసులలో అనిశ్చితిని తొలగించాలని సూచించింది. ఒకవేళ పరీక్షలు నిర్వహించాలనుకుంటే శుక్రవారం (25వ తేదీ) నాడు స్పష్టమైన ప్రణాళికతో రావాలని ఆదేశించింది. ఇలా ఉంటే 12వ తరగతి ఫలితాలను జులై 31 నాటికి ప్రకటించాలని సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాల బోర్డులను గురువారం ఆదేశించింది. విద్యార్థుల మార్కుల మూల్యాంకనం విషయంలో బోర్డులు తమకు నచ్చిన విధానాన్ని అనుసరించవచ్చని స్పష్టంచేసింది. పది రోజుల్లోగా మూల్యాంకనానికి అనుసరించే విధానం గురించి న్యాయస్థానానికి తెలియజేయాలని సూచించింది. కాగా, మొత్తం 28 రాష్ట్రాల్లో 6 రాష్ట్రాలు ఇప్పటికే బోర్డు పరీక్షలు నిర్వహించగా, 18 రద్దుచేశాయని, అస్సాం, పంజాబ్‌, త్రిపుర, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు ఇప్పటివరకు రద్దుచేయలేదని 17వ తేదీనాడు సుప్రీంకోర్టు తెలిపింది. కాగా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ కూడా పరీక్షలను రద్దు చేయడంతో, మూడు రాష్ట్రాలు మాత్రమే ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments