నిప్పులు చెరిగిన సోనియాగాంధీ
ఢిల్లీలో సిడబ్ల్యుసి సమావేశం
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ) వివక్షపూరిత, విభజనకర చట్టం అని, దాని ఉద్దేశం ప్రజలను మతపరంగా విభజించడమేనని, ఇక జాతీయ జనాభా పట్టిక(ఎన్పిఆర్) అనేది జాతీయ పౌరసత్వ నమోదు జాబితా(ఎన్ఆర్సి)కి మారు వేషం అని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ శనివారం అన్నారు. న్యూఢిల్లీలో నిర్వహించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సిడబ్ల్యుసి)లో ఆమె ప్రసంగిస్తూ పౌరసత్వ చట్టంపై ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాపై నిప్పులు చెరిగారు. వారు రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారన్నారు. సిఎఎకు వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళనలు, తదితర అంశాలను విచారించేందుకు సమగ్ర ఉన్నతాధికార సంఘాన్ని ఏర్పాటుచేయాలని కూడా కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందని ఆమె చెప్పారు. కొత్త పౌరసత్వ చట్టం అమలు ద్వారా పెద్దహాని జరగబోతుందని గుర్తించి వేలాది యువతీ యువకులు… ప్రధానంగా విద్యార్థులు ఆందోళనలు చేపట్టారన్నారు. వారు వీధుల్లోకి వచ్చి నిరసన ర్యాలీలు నిర్వహించడమేకాక, పోలీసుల క్రూరత్వాన్ని కూడా ఎదుర్కొన్నారన్నారు. విద్యార్థుల ఆందోళన ఊపందుకునే సరికి ప్రభుత్వం కూడా కాస్త దిగొచ్చిందని ఆమె పేర్కొన్నారు. ‘ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా రెచ్చగొట్టే ప్రకటనలు చేయకుండా ఒక్క రోజు కూడా గడవడంలేదు’ అని విమర్శించారు. ‘కొన్ని రాష్ట్రాలైతే పోలీసు రాజ్యాలుగా తయారయ్యాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, కేంద్ర పాలిత ప్రాంతం ఢిల్లీ’ అని ఆమె పేర్కొన్నారు. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కేంద్రంలో జరిగిన సిడబ్ల్యుసి సమావేశానికి సోనియా గాంధీతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు పి చిదంబరం, ఆనంద్ శర్మ, ఎకె ఆంటోని, కెసి వేణుగోపాల్, ప్రియాంక గాంధీ, జ్యోతిరాదిత్య సింధియా తదితరులు హాజరయ్యారు. అయితే కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాత్రం హాజరుకాలేదు. రాబోతున్న జాతీయ జనాభా జాబితా(ఎన్పిఆర్) మేలైనదిగా భ్రమించరాదని సోనియా గాంధీ కాంగ్రెస్ నేతలకు తెలిపారు. దేశవ్యాప్తంగా జాతీయ పౌరసత్వ జాబితాను అమలుచేయాలని ప్రభుత్వం మొదట్లో భావించింది. కానీ అసోంలో దారుణ ఫలితాలు రావడంతో ఇప్పుడు ఎన్పిఆర్ను భావంతో ముందుకొచ్చిందన్నారు. ‘రూపరీత్యా ఎన్పిఆర్ 2020, ఎన్ఆర్సికి మారువేషం. అనేక రాష్ట్రాల్లో మన పార్టీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నందున ఒకే రకమైన నిర్ణయాన్ని మనం తీసుకోవాలి’ అని సోనియా గాంధీ చెప్పారు. కొత్త సంవత్సరం ఇప్పుడిప్పుడే మొదలైంది. కానీ ఘర్షణ, నిరంకుశాధికారిత, ఆర్థిక కష్టాలు, నేరం, తెగిపోతున్న అనుబంధాలు వంటి కలచివేసే వార్తలే ఎక్కువగా వస్తున్నాయి’ అన్నారు.
ఎన్పిఆర్ మోడీ మాయోపాయం
RELATED ARTICLES