రాజ్యసభలో ‘వ్యవసాయ బిల్లుల’ ఆమోదం కష్టసాధ్యమే
నేటి సమావేశాలపై పెరిగిన ఆసక్తి
25న 250 రైతు సంఘాల ఆధ్వర్యంలో భారత్‌బంద్
న్యూఢిల్లీ : మోడీ ప్రభుత్వానికి మరో అగ్ని పరీక్ష ఎదురైం ది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తం కావడంతో రాజ్యసభలో వీటి ఆమో దం సర్కారుకు తలనొప్పి గా మారనున్నది. ఈ బిల్లు లు ఆదివారం రాజ్యసభ ముం దుకు రానున్నాయి. వ్యవసాయ రంగం లో సంస్కరణల పేరుతో మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ల స్థానంలో మూడు బిల్లులను ఇటీవలనే లోక్‌సభలో ప్రవేశపెట్టగా, ఎన్‌డిఎ తన మెజారిటీతో వాటికి ఆమోదముద్ర వేయించుకున్నది. ఈ మూడు బిల్లులపై ఆదివారం రాజ్యసభలో ఓటింగ్ ప్రక్రియ జరుగనుంది. అయితే రాజ్యసభలో బిల్లు గట్టెక్కడం అధికార పార్టీకి అంత సులువు కాదు. గత మిత్రపక్షం శివసేనతో పాటు.. తాజాగా శిరోమణీ అకాలీదళ్ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయనుంది. ఈ నేపథ్యంలో కీలకమైన బిల్లును రాజ్యసభలో గట్టేక్కిచ్చుకునేందుకు బిజెపి తెరవెనుక ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇదిలావుండగా, ఈ వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతుల భారీఎత్తున ఆందోళనకు సమాయత్తమవుతున్నారు. ఈనెల 25వ తేదీన ‘భారత్ బంద్’ నిర్వహించాలని అఖిల భారత రైతుల సంఘాల సమాఖ్య ‘ఆలిండియా కిసాన్ సంఘర్ష్ కో ఆర్డినేషన్ కమిటీ (ఎఐకెఎస్సిసి) పిలుపునిచ్చింది. ఈ ఆందోళనలో పంజాబ్, హర్యానా రాష్ట్రాల రైతులు ప్రధాన పాత్ర పోషించబోతున్నారు. మహారాష్ట్రలో కూడా భారత్‌బంద్ విజయవంతం చేయాలని రైతు సంఘాలు కోరాయి. మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులు రైతులకు పూర్తి వ్యతిరేకమైనవని, కార్పొరేట్లకు అనుకూలమని, వీటిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపసంహరించాలని ఎఐకెఎస్సిసిలో భాగమైన భారతీయ కిసాన్ యూనియన్ ప్రధాన కార్యదర్శి జగ్మోహన్సింగ్ అన్నారు. ఒక రోజు ముందుగానే అంటే సెప్టెంబరు 24న రైల్‌రోకో నిర్వహిస్తున్నట్లు కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ సమితికి చెందిన శర్వన్ సింగ్ పాంధర్ తెలిపారు. రైతులంతా ఈ ఆందోళనలో పాల్గొనాలని ఎఐకెఎస్ పిలుపునిచ్చింది. కాగా, రాజ్యసభలో ఈ బిల్లులకు ఆమోదముద్ర వేయించుకోవాలని బిజెపి నానా తంటాలు పడుతోంది. మొత్తం 245 సభ్యుల గల పెద్దల సభలో ప్రస్తుతం బిజెపికి 86 సభ్యుల మద్దతు ఉంది. ప్రతిపక్ష కాంగ్రెస్‌కు 40 మంది సభ్యులు ఉండగా.. మిగతా స్థానాల్లో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. అయితే మిత్రపక్షాలతో కలుపుకుని తమకు 130 మంది సభ్యులు మద్దతు లభిస్తుందని బిజెపి ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, అకలీదళ్ (3) వ్యతిరేకంగా ఓటు వేసినా.. మిగతా పార్టీల మద్దతును కూడగట్టుకుంటామని లెక్కలు చెబుతోంది. టిఆర్ఎస్ ఈ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వీటిని వ్యతిరేకించాలని కెసిఆర్ ఇప్పటికే తన ఎంపీలను ఆదేశించారు. అయితే బిజెపి మరోవైపు జెడియూతో పాటు అన్నాడీఎంకే, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నేతృత్వంలోనే బీజూ జనతాదళ్ మద్దతుపై ఆశలు పెట్టుకుంది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ, బిఎస్పిల ఓటింగ్‌పై స్పష్టత లేదు.
ఎన్‌డిఎకు పరీక్ష!
RELATED ARTICLES