మంత్రి పదవికీ రాజీనామా
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ బిజెపికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటి వరకు ఎన్డిఎలో కీలక భాగస్వామిగా ఉన్న ఆర్ఎల్ఎస్పి(రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ) ఆ కూటమి నుంచి వైదొలింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత, కేంద్ర మంత్రి ఉపేంద్ర కుష్వాహ సోమవారం ఎన్డిఎ సర్కార్కు మద్దతును ఉపసహరించుకొని తన మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా కుష్వాహ బిజెపి, తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్లపై మండిపడ్డారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి,జెడియూలు తమ పార్టీకి 2 లోక్సభ సీట్లనే కేటాయించడంపై అసహనం వ్యక్తం చేశారు. బిహార్లో మొత్తం లోక్సభ స్థానాల సంఖ్య 40గా ఉంది. ఇందులో జెడియూ, బిజెపిలు సమానంగా లోక్సభ సీట్లను పంచుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నాయి. వీరిద్దరూ పంచుకోగా మిగిలిన సీట్లను రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ కేటాయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆర్ఎల్ఎస్పికి 2 సీట్లు మాత్రమే దక్కినట్లు సమాచారం. దీంతో అప్పటి నుంచి బిజెపి,జెడియూల వైఖరిపై ఆర్ఎల్ఎస్పి అధినేత ఉపేంద్ర కుష్వాహ రగిలిపోతున్నారు. బిజెపి,జెడియూ పార్టీల మాదిరిగానే తమ పార్టీకి సమానంగా సీట్లను పంచాలని కోరారు. అయితే ఆయన ప్రాతిపాదన పట్ల ఇరు పార్టీలు విముఖత చూపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి కుష్వాహ విపక్షాలతో చేతులు కలిపి వచ్చే ఎన్నికల్లో బరిలో దిగేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. అందులో భాగంగానే కాంగ్రెస్, ఆర్జెడిలతో కలిసి ముందుకు వెళ్లేందుకు ఉపేంద్ర కుష్వాహ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.