-బ్యాంకుల్లో సామాన్యులు ఇక కానరారు
ఖాతాదారులపై అర్థికభారం
జిఎస్టీ పరిధిలోకి పలు బ్యాంకులు
-నోటీసులు కూడా జారీ
ప్రజాపక్షం/అశ్వారావుపేట : భారత దేశంలోని బ్యాంకు ఖాతాదారులపై బ్యాంకులన్నీ మరో ఆర్ధిక భారాన్ని మోపేందుకు సన్నద్ధ్దమవుతున్నాయి. ఇప్పటికే సర్ చార్జ్‌ల పేరుతో వినియోగదారులకు భారం మోపుతున్న జాతీయ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు ఇకపై బ్యాంకింగ్ సేవలపై జిఎస్టీ పేరుతో మరింత భారాన్ని మోపాలని భావిస్తున్నాయి. ఖాతాల్లో కనీస నిల్వలను నిర్వహిస్తున్న వారికి అందించే ఉచిత సర్వీసుల మీద కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో తెచ్చిన జిఎస్టీ భారాన్ని త్వరలో ఖాతాదారులపై మోపేందుకు బ్యాంకులు వ్యూహాన్ని రచిస్తున్నట్టుగా సమాచారం. కేంద్ర ప్రభుత్వ చర్యలకు అనుగుణంగా ఇప్పటి వరకు బ్యాంకులు అందిస్తున్న ఉచిత సేవలను ఈ పన్ను పరిధిలోకి తేవాలని బ్యాంకు యాజమాన్యాలు భావిస్తున్నట్టు తెలుస్తుంది. దీంతో ఇప్పటి వరకు బ్యాంకులు వినియోగదారులకు అందించే పలు ఉచిత సేవలు రానున్న రోజుల్లో భారంగా మారనున్నాయి. ముఖ్యంగా చెక్ పుస్తకాల జారీ, క్రెడిట్ కార్డుల మంజూరి, ఎటిఎంలలో డెబిట్ కార్డుల వాడకం, వ్యూయల్ సర్ సార్ట్ రిఫండ్స్ వంటి సేవలపై జిఎస్టీ మోత మోగిస్తుందని సమాచారం. తద్వారా దాదాపు రూ.40,000 కోట్ల పన్నులు, పెనాల్టీలను బ్యాంకుల నుండి రాబట్టేందుకు ప్రభుత్వం లెక్క సిద్ధం చేసి ఉంచినట్టుగా సమాచారం. బ్యాంకులు ఇస్తున్న ఉచిత సర్వీసులపై జిఎస్టీని విధిస్తూ బ్యాంకులకు రెండు నెలల క్రితమే పన్నుల శాఖ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే లాభాలు లేక ఆర్థిక కష్టాల్ల ఉన్న బ్యాంకులు ప్రభుత్వం జిఎస్టీ పేరుతో విధించే మరో భారాన్ని మోయలేమని చేతులెత్తేస్తున్నాయి. విధిలేని పరిస్థితిలో బ్యాంకులు ఆ పన్ను భారాన్ని నేరుగా ఖాతాదారులపై వేయాలని ఆయా బ్యాంకులు భావిస్తున్నాయి. ఎస్‌బిఐ, ఐసిఐసిఐ, ఎచ్‌డిఎఫ్‌సి, ఆంధ్రాబ్యాంక్ వంటి బ్యాంకులు జిఎస్టీ బాదుడుకి సిద్ధం కానున్నాయని ఎకనామిక్స్ ఒక రిపోర్టులో వెల్లడించింది. నేరుగా ప్రభుత్వ ఖజానాకే పన్ను ఆదాయం వచ్చే విధంగా దేశంలోని అన్ని ప్రధాన బ్యాంకులు తమ ఉచిత సేవలకు 18 శాతం జీఎస్టీ విధించేందుకు సూత్రప్రాయంగా తమ సమ్మతిని తెలియజేసినట్టుగా కొన్ని బ్యాంకులు తెలిపాయి. ఎంత మొత్తంలో ఏ రూపంలో జీఎస్టీ విధించాలన్న దానిపై ఆయా బ్యాంకులు తుది ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయని బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి. ఇందులో చాలా బ్యాంకులు మరి కొద్ది రోజుల నుండే జీఎస్టీ విధించేందుకు సిద్ధ్దమవుతున్నాయని ఇండియన్ బ్యాంకు అసోసియేషన్ సిఇఒ కెజి కన్నన్ పేర్కొన్నట్టు కొన్ని పత్రికలు ప్రచురించాయి. ఈ విధానం అమలు అయితే వినియోగదారుల పన్ను, చెల్లింపులు నేరుగా ప్రభుత్వానికి వెళ్లిపోతాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. జీఎస్టీ చట్టంలోని షెడ్యూల్- 2 ప్రకారం ఇతర నాన్ బ్యాంకింగ్ సంస్ధ సేవలపై కూడ జీఎస్టీ పేరుతో సొమ్ములు రాబట్టేందుకు పన్నుల శాఖ కసరత్తు చేస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. పన్నుల శాఖ నుండి నోటీసులు అందుకున్న బ్యాంకుల్లో మల్టీనేషన్ బ్యాంకులు, డిబిఎస్, సిటీ బ్యాంకులు కూడా ఉన్నాయి. ఇప్పటికే బ్యాంకుల బాదుడుకు దిమ్మతిరిగి బ్యాంకుల వైపు వెళ్ళాలంటే జంకుతున్న సామాన్య మానవుడు ఎటిఎంతో సహా పలు బ్యాంకు సేవలను జీఎస్టీ పరిధిలోకి తేవాలని అలోచిస్తుండటంతో విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తాజా నిర్ణయంతో బ్యాంకులు ప్రజలకు మరింత దూరమయ్యే అవకాశం లేకపోలేదు. జీఎస్టీ భారాన్ని ప్రజలపై ఎలా మోపాలనే విషయంపై పెద్ద ఎత్తున ప్రభుత్వం కార్యాచరణ చేపడుతుండటంతో ప్రజలు అయోమయంలో పడే అవకాశాలు ఉన్నాయి.
ఎటిఎంకు వెళ్ళితే జిఎస్‌టి!
RELATED ARTICLES