అమల్లోకి కొత్త పంచాయతీరాజ్ చట్టం
ఓటింగ్ చేతులెత్తడమే
ప్రజాపక్షం / హైదరాబాద్ : జిల్లా పరిషత్‌లలో ఎక్స్ అఫీషియో సభ్యులుగా వ్యవహరించే ఎంపి, ఎంఎల్‌ఎ, ఎం ఎల్‌సిలకు ఈ సారి జెడ్‌పి చైర్మన్ ఎన్నికల్లో ఓటు హక్కు ఉండబోవడం లేదు. గతంలో వీరికి ఓటు హక్కు ఉండేది. కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం వారికి ఉన్న ఓటు హక్కును తొలగించారు. అలాగే ఎంపిపి, జెడ్‌పి చైర్మన్ ఎన్నికల్లో విప్ జారీ చేసే అధికారం కల్పించారు. దీని ప్రకారం విప్ ధిక్కరించే సభ్యుల సభ్యత్వం రద్దవుతుంది. అయితే, విప్‌కు భిన్నంగా గైర్హాజరయినా, వ్యతిరేకంగా ఓటు వేసినా దానిని పరిగణలో కి తీసుకుంటారు. ఇక ఎంపిపి, జెడ్‌పి చైర్మన్ ఎన్నిక కోసం నిర్దేశించిన సమయం లో సభ్యుల కోరం లేకపోతే గంట పాటు వేచి చూస్తారు. అయినప్పటికీ సరిపడ సభ్యు లు రాకపోతే ఎన్నికను మరుసటి రోజుకు వాయిదా వేస్తారు. మరుసటి రోజు ఆదివారం లేదా సెలవు దినం ఉన్నప్పటికీ ఎన్నికను నిర్వహిస్తారు. ఆ రోజు కూడా కోరం లేనట్లయితే విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘానికి అధికారులు నివేదిస్తారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక రోజే కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికల ఉంటుంది. వారికి ఎన్నికల్లో ఓటు హక్కు ఉండదు. ఈ ఎన్నికలన్నీ రహస్య బ్యాలెట్ కాకుండా, చేతులు ఎత్తే పద్దతి ద్వారా నిర్వహిస్తారు.