ఒకచోట వ్యతిరేకత.. మరోచోట హోరాహోరీ
బిజెపి అభ్యర్థులకు ఎదురుగాలి
నల్లగొండ, వరంగల్, ఖమ్మం నియోజకవర్గంలో జయసారథిరెడ్డికి సానుకూలత
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ స్థానంలో నాగేశ్వర్ వైపు సంఘటిత రంగం
ప్రజాపక్షం / హైదరాబాద్ ఎన్నికలు జరుగుతున్న రెండు పట్టభద్రుల ఎంఎల్‌సి నియోజకవర్గాల్లో అధికార పార్టీకి వ్యతిరేకత కనిపిస్తోంది. రెండు నియోజకవర్గాల్లో కూడా ఉద్యోగులు, నిరుద్యోగ ఓటర్ల లో టిఆర్ఎస్కు వ్యతిరేక వాతావరణమే నెలకొంది. హైదరాబాద్ నియోజకవర్గంలో రంగంలో ఉన్న సిట్టింగ్ బిజెపి ఎంఎల్‌సి రామచంద్రరావుకు కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి ఎలాంటి లబ్ధి చేకూర్చలేద నే అంశంపై ఎదురుగాలి వీస్తుండగా, టిఆర్ఎస్ అభ్యర్థిగా పి.వి.నరసింహారావు కుమార్తె వాణీదేవి పట్ల సైతం అంతగా సానుకూలత కనిపించడం లేదు. ఇక్కడ వామపక్షాలు మద్దతిస్తున్న ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ పట్ల కొంత సానుకూలత వాతావరణం కనిపిస్తున్నది, ఈ నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఉండే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, బ్యాంక్, ఎల్ఐసి వంటి ప్రభు త్వరంగ ఉద్యోగులు, ఉపాధ్యాయులు నాగేశ్వర్ పట్ల మొగ్గు చూపిస్తున్నారని అంటున్నారు. గతంలో రెండు సార్లు ఇదే స్థానం నుండి ఆయన ఎంఎల్‌సిగా ఎన్నికావడంతో ఆయన మారుమూల గ్రామంలో కూడా చిరపరిచితులుగా ఉన్నారు. నాగేశ్వర్ విజయం కోసం సంఘటిత రంగంలోని కార్మిక, ఉద్యోగ సంఘాలు కష్టపడి పని చేయడం కలిసొస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. మేధావిగా, విశ్లేషకునిగా, అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను గట్టిగా ఎండగట్టే వ్యక్తిగా పట్టణ మధ్య తరగతివర్గాలతో పాటు సామాన్యులు సైతం ఆయన పట్ల ఆకర్షితులవుతున్నారు. మరోవైపు బిజెపి, టిఆర్ఎస్లతో పాటు, ఇతర ప్రధాన పార్టీల అభ్యర్థులకు పడే ఓట్లలో ద్వితీయ ప్రాధాన్యత ఓటు నాగేశ్వర్‌కు మళ్ళీ అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి జి.చిన్నారెడ్డి ప్రధానంగా ఆయన ప్రాతినిధ్యం వహిసుస్తున్న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాపైనే ఎక్కువ ఆశలు పెట్టుకోగా, టిడిపి తరుపున పోటీ చేస్తున్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్.రమణ బిసి వర్గాలపై ఎక్కువగా ఆధారపడ్డారు.
అక్కడ హోరాహోరీ: నల్లగొండ నియోజకవర్గంలో ఎన్నిక హోరా హోరీగా సాగుతోంది. ఇక్కడ సిట్టింగ్ టిఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సిపిఐ అభ్యర్థి జయసారథిరెడ్డి, టిజెఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్, తెలంగాణ ఇంటి పార్టీ అభ్యర్థి చెరుకు సుధాకర్‌గౌడ్ తీవ్రంగా పోటీ పడుతున్నారు. రాణి రుద్రమదేవి, తీన్మార్ మల్లన్నలు కూడా బలంగా ప్రచారం చేసుకుంటున్నారు. పల్లాపై ప్రజల్లోనూ, సొంత పార్టీలోనూ వ్యతిరేకత నెలకొంది. వామపక్షాలు బలపరిచిన సిపిఐ అభ్యర్థి విజయసారథిరెడ్డి ఎన్నికల షెడ్యూల్‌కు ముందు నుండే ప్రచారంలో ఉండడంతో పాటు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల మద్దతు కలిసొస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే రెండు, మూడు మార్లు నియోజకవర్గాన్ని చుట్టి రావడం, సిపిఐ, సిపిఐ(ఎం)కు ఈ నియోజకవర్గంలో గ్రామ గ్రామాన క్యాడర్ ఉండడం ప్లస్ పాయింట్‌గా మారింది. నామినేషన్ రోజు భారీ ఊరేగింపు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రచారంతో పాటు, చివరి రెండు రోజుల్లో ప్రతి చోట ద్విచక్రవాహనాల ర్యాలీలు కూడా ఓటర్ల దృష్టిని ఆకర్షించింది. మరోవైపు ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు కోదండరామ్‌కు ఎక్కువగా పడే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. టిజెఎసి చైర్మన్‌గా ప్రజల్లో సానుభూతి ఉన్నప్పటికీ, యంత్రాంగం లేకపోవడంతో ఓట్లుగా మలుచుకోవడంలో ఎంత వరకు సఫలమవుతారోననే చర్చ సాగుతోంది. చెరుకు సుధాకర్‌కు ఉద్యమకారుడు, బిసి అనే ప్రచారంతో పాటు ఎంఆర్పిఎస్ మద్దతు ఇవ్వడంతో రంగంలో ఉన్నారు. తీన్మార్ మల్లన్న ఎక్కువగా సోషల్ మీడియా ద్వారానే ఓటర్లను రీచ్ అయ్యారు. రాణి రుద్రమదేవికి అధికంగా ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ యువ తెలంగాణ అధ్యక్షులు జిట్టా బాలకృష్ణారెడ్డి సొంత నియోజకవర్గం భువనగిరితో పాటు, తన సొంత జిల్లా వరంగల్‌లో ఓట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్ స్థానికేతరుడు కావడంతో పూర్తిగా జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలపై ఆధారపడ్డారు. మొత్తానికి రెండు నియోజవర్గాల్లో తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పటికీ, ప్రత్యర్థులు ఎక్కువ మంది ఉండడంతో ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తి నెలకొంది. చివరి నిమిషంలో ఉద్యోగులకు 29 శాతం పిఆర్సి ఇస్తామని సిఎం కెసిఆర్ తమతో చెప్పినట్లు టిజిఒ, టిఎన్‌జిఒ నాయకులు చేసిన ప్రకటనను ఉద్యోగులు, ఉపాధ్యాయులు విశ్వాసంలోకి తీసుకోవడం లేదు.
ఎంఎల్‌సి ఎన్నికల్లో టిఆర్ఎస్కు కష్టకాలం!
RELATED ARTICLES