HomeNewsBreaking Newsఉమ్మడి ప్రతిపక్ష అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా

ఉమ్మడి ప్రతిపక్ష అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా

27న నామినేషన్‌
న్యూఢిల్లీ :
రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్హా (84) పోటీ చేస్తారు. రాష్ట్రపతి పదవికి ఆయన ఈనెల 27వ తేదీన నామినేషన్‌ దాఖలు చేస్తారు. పార్లమెంటు అనుబంధ భవనంలో మంగళవారంనాడు ఎన్‌సిపి నాయకుడు శరద్‌ పవార్‌ చొరవతో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిని ఖరారు చేసేందుకే ఈ సమావేశం జరిగింది. ప్రతిపక్షాలు యశ్వంత్‌ సిన్హా పేరును ఏకగ్రీవంగా ఆమోదించాయి. కాంగ్రెస్‌పార్టీ, తృణమూల్‌ కాంగ్రెస్‌పార్టీ, సమాజ్‌వాదీపార్టీలతో సహా ప్రతిపక్షాలన్నీ ఆయన అభ్యర్థిత్వానికి అంగీకారం తెలియజేశాయి. అయితే టిఆర్‌ఎస్‌, బిజెడి, ఆమ్‌ఆద్మీపార్టీ, శిరోమణి అకాలీదళ్‌, వైఎస్‌ఆర్‌సిపి పార్టీలు ఈ సమావేశానికి హాజరుకాకుండా దూరంగా ఉండిపోయాయి. “ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రభుత్వం ఏకాభిప్రాయంతో రాష్ట్రపతిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి ఏ మాత్రం చిత్తశుద్ధితో కృషి చేయకపోవడం ఎంతో దురదృష్టకరం, అందుకే రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్హాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం, ఈ విధంగా ఒక ఉమ్మడి అభ్యర్థిని ఏకాభిప్రాయంతో ఎన్నుకునే చొరవను కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాలి ఈ పరిస్థితుల్లో ఉమ్మడి అభ్యర్థిగా సిన్హా పేరు ప్రకటించడానికి ప్రతిపక్షాలుగా మేం ఎంతో సంతోషిస్తున్నాం” అని కాంగ్రెస్‌పార్టీ నాయకుడు జైరామ్‌ రమేశ్‌ ప్రకటించారు. సమావేశం అనంతరం ప్రతిపక్షాల ఉమ్మడి ప్రకటనను ఆయన పత్రికాగోష్టిలో చదివారు.“సుదీర్ఘమైన, ఘనమైన ఆయన ప్రజా జీవితంలో యశ్వంత్‌ సిన్హా దేశానికి ఒక సమర్థుడైన పాలకుడుగా వివిధ పదవుల్లో గొప్ప సేవలు అందించారు. కేంద్ర ఆర్థికశాఖామంత్రిగా, విదేశాంగమంత్రిగా ఆయన గొప్ప సేవలు అందించారు. భారతదేశ గణతంత్ర వ్యవస్థకు ఉన్న లౌకిక, ప్రజాస్వామ్య సహజ స్వభావాన్ని, రాజ్యాంగ విలువలను సమున్నతస్థానంలో నిలబెట్టగల సమర్థత, అర్హతలు అన్నీ ఆయనకు ఉన్నాయి” అని ప్రతిపక్షాల ఉమ్మడి ప్రకటన స్పష్టం చేసింది. యశ్వంత్‌ సిన్హా లాంటి సమర్థుడైన అభ్యర్థిని ఎలాంటి పోటీ లేకుండా రాష్ట్రపతి ఎన్నికల్లో గెలిపించేందుకు సహకరించాలని దేశంలోని అన్ని రాజకీయపార్టీలకు ప్రతిపక్షాలు విజ్ఞప్తి చేస్తున్నాయని జైరామ్‌ రమేశ్‌ అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల నిమిత్తం ఒక్కచోట చేరిన ప్రతిపక్షాల ఐక్యత రానున్న నెలల్లో తదుపరి మరింత పటిష్టంగా రూపుదిద్దుకుంటుందని జైరామ్‌ రమేశ్‌ అన్నారు. క్రియాశీల రాజకీయాలలోనే తను కొనసాగుతానని శరద్‌పవార్‌ రాష్ట్రపతి పదవి అభ్యర్థిత్వాన్ని తిరస్కరించారు. నేషనల్‌ కాన్ఫరెన్స్‌పార్టీ నాయకుడు ఫారూక్‌ అబ్దుల్లా కూడా అదే కారణంలో రాష్ట్రపతి పదవిని తిరస్కరించారు. మహత్మాగాంధీ వంశీకుడు గోపాల్‌కృష్ణ గాంధీ కూడా ఆ పదవికి పోటీ చేసేందుకు తిరస్కరించడంతో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్హా పేరు ఖరారైంది. మంగళవారంనాడు పార్లమెంటు అనుబంధ భవనంలో జరిగిన ప్రతిపక్షాల సమావేశానికి కాంగ్రెస్‌పార్టీ, ఎన్‌సిపి, తృణమూల్‌ కాంగ్రెస్‌, సిపిఐ, సిపిఐ(ఎం), సమాజ్‌వాదీపార్టీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, ఎఐఎంఐఎం, రాష్ట్రీయ జనతాదళ్‌, ఎఐయుడిఎఫ్‌ పార్టీల ప్రతినిధులు హజరయ్యారు. కాంగ్రెస్‌పార్టీ నుండి మల్లికార్జునఖర్గే, జైరామ్‌ రమేశ్‌, అభిషేక్‌ బెనర్జీ (టిఎంసి), తిరుచ్చి శివ (టిఎంసి), సీతారామ్‌ ఏచూరి (సిపిఐ(ఎం), డి.రాజా (సిపిఐ) తదితర ప్రముఖులు హాజరైనవారిలో ఉనారు. కాగా టిఆర్‌ఎస్‌, బిజూ జనతాదళ్‌, ఆప్‌పార్టీ, శిరోమణి అకాలీదళ్‌ పార్టీ, వైఎస్‌ఆర్‌సిపిలు ఈ సమావేశానికి దూరంగా ఉన్నాయి. జూన్‌ 15వ తేదీన తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతాబెనర్జీ ఆధ్వర్యంలో జరిగిన ప్రతిపక్షాల సన్నాహక సమావేశానికి కూడా ఈ ప్రాంతీయపార్టీలు హాజరుకాలేదు. ఈ సందర్భంగా శరద్‌ పవార్‌ మాట్లాడుతూ, తాను అన్ని పార్టీలతో మాట్లాడాననీ, వారి మద్దతు కోరాననీ చెప్పారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌, కె.చంద్రశేఖరరావులతో వ్యక్తిగతంగా తాను మాట్లాడానన్నారు.
టిఎంసి ఉపాధ్యక్షపదవికి
యశ్వంత్‌ సిన్హా రాజీనామా

అటల్‌ బిహారీ వాజ్‌పాయ్‌ ప్రధానమంత్రిగా ఉండగా విదేశాంగమంత్రిగా పనిచేసిన యశ్వంత్‌ సిన్హా అంతకుముందు చంద్రశేఖర్‌ ప్రధానమంత్రిగా ఉండగా ఏడాదికాలంపాటు కేంద్ర ఆర్థికమంత్రిగా పనిచేశారు. జార్ఖండ్‌ నుండి మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. బిజెపికి రాజీనామా చేశాక తృణమూల్‌ కాంగ్రెస్‌పార్టీలో చేశారు. ఆ పార్టీ ఉపాధ్యక్షుడుగా ఇప్పటివరకూ పనిచేశారు. రాష్ట్రపతి పదవికి ఆయన పేరు ఖరారు కావడంతో తృణమూల్‌ కాంగ్రెస్‌లో పార్టీ ఉపాధ్యక్ష పదవికి మంగళవారంనాడు రాజీనామా చేశారు. తృణమూల్‌ కాంగ్రెస్‌పార్టీ నుండి తాను వైదొలగుతున్నాననీ,విస్తారమైన జాతీయ ప్రయోజనాలకోసం పనిచేసేందుకే ఆ పార్టీకి రాజీనామా చేశానని యశ్వంత్‌ సిన్హా మంగళవారంనాడు న్యూఢిల్లీలో ప్రకటించారు. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ యశంత్‌ సిన్హా పేరును రాష్ట్రపతి అభ్యర్థిత్వాకి ప్రతిపాదించారు.“తృణమూల్‌ కాంగ్రెస్‌పార్టీలో నాకు ఇంత గొప్ప గౌరవాన్ని ఇచ్చిన మమతాజీకి ఎంతో రుణపడి ఉంటాను, ఒక గొప్ప జాతీయ ప్రయోజనాన్ని సాధించే దిశగా, ప్రతిపక్షాల ఐక్యతకోసం పాటుపడేందుకు నేను తృణమూల్‌ కాంగ్రెస్‌పార్టీ నుండి అనివార్యంగా వైదొలగవలసిని తరుణం ఆసన్నమైంది” అని యశ్వంత్‌ సిన్హా ట్వీట్‌ చేశారు. జులై 18న రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతాయి. జులై 21న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అదేరోజు ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు.
ఇదీ యశ్వంత్‌ సిన్హా రాజకీయ ప్రస్థానం..
ఐఏఎస్‌ అధికారి నుంచి కేంద్రమంత్రిగా, బీజేపీ రెబల్‌గా బయటకు వచ్చి టిఎంసి ఉపాధ్యక్షుడుగా పనిచేస్తూ, రాష్ట్రపతి పదవికి ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి స్థాయికి చేరుకున్న యశ్వంత్‌ సిన్హా ది 38 ఏళ్ళ క్రియాశీల రాజకీయాలలో సుదీర్ఘమైన ప్రయాణం చేశారు. ఐఏఎస్‌ అధికారిగా సేవలందించిన యశ్వంత్‌ సిన్హా 1984లో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అనంతరం జనతా పార్టీలో చేరారు. 1988లో రాజ్యసభకు ఎంపికయ్యారు. 1993లో యశ్వంత్‌ సిన్హా బీజేపీలో చేరినప్పుడు పార్టీ అగ్రనేత ఎల్‌.కె.అద్వాని ఆయనను ప్రశంసిస్తూ, పార్టీలో ఆయన చేరిక ఒక ’దీపావళి బహుమతి’ అని ప్రకటించారు. 1996లో బీజేపీ అధికార ప్రతినిధిగా పనిచేశారు. అద్వానీ ప్రోత్సహంతో అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో 1999 నుంచి 2004 వరకూ ఆర్థిక, విదేశాంగ మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. 2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి పగ్గాలు చేపట్టిన తర్వాత యశ్వంత్‌ సిన్హాకు పార్టీకి మధ్య దూరం పెరగడంతో ఆయన బీజేపీకి ఉద్వాసన చెప్పి బయోగ్రఫీ రచనలో మునిగిపోయారు. ప్రస్తుతరూపంలో ఉన్న ఆ పార్టీ (బీజేపీ) ప్రజాస్వామ్యానికే ముప్పు అంటూ వ్యాఖ్యలు చేసిన సిన్హా 2018లో తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరి ఉపాధ్యక్షుడుగా పనిచేస్తూ వచ్చారు.
మమతా బెనర్జీ చొరవతో సిన్హా ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా తెరమీదకు వచ్చారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments