‘ఒక దేశం…ఒకే ఎన్నికలు’ దిశగా మోడీ సర్కారు మరో అడుగు
రెండువారాల క్రితమే భేటీ అయిన పిఎంఓ
న్యూఢిల్లీ : ‘ఒక దేశం…ఒకే ఎన్నికలు’ దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. నట్టు సమాచారం. లోక్సభ, రాష్ట్ర, స్థానిక సంస్థల ఎన్నికలన్నిటికీ కలిపి ఉమ్మడి ఓటరు జాబితా రూపొందించేందుకు ప్రయత్నం మొదలుపెట్టింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ అధికారులు ధృవీకరించారు. ‘ఒక దేశం…ఒకే ఎన్నికలు’ వెనుక ఉద్దేశాన్ని బిజెపి ప్రభుత్వం బయటపెట్టకుపోయినప్పటికీ, ఈ దిశగా కొన్ని జనాంతిక సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఆగస్టు 13న ప్రధానమంత్రి కార్యాలయం (పిఎంఓ) ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగినట్టు తెలిసింది. అయితే ఇప్పటివరకు ఈ విషయాన్ని ఎవరూ బయటపెట్టలేదు. ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ఓటర్ల జాబితా వేర్వేరుగా వస్తున్న విషయం తెల్సిందే. అయితే ఉమ్మడి ఓటరు జాబితాను తీసుకురావడం వెనుక మోడీ ప్రభుత్వ ‘ఒక దేశం…ఒకే ఎన్నికలు’ వ్యూహం విస్పష్టంగా గోచస్తున్నదని ఓ అధికారి తెలిపారు. అయితే ‘ఒక దేశం…ఒకే ఎన్నికలు’ విషయంలో ఇప్పటివరకు ప్రతిపక్షాలను పరిగణనలోకి తీసుకోకపోవడం విచిత్రం. ఎలక్షన్ కమిషన్ జాబితానే మున్సిపల్, పంచాయతీ ఎన్నికలకు కూడా వినియోగించుకోవాలని రాష్ట్రాలకు సూచించే విషయమై పిఎంఓ సమావేశంలో విస్తృత చర్చ జరిగిందని అధికార వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా.. ఉమ్మడి ఓటర్ల జాబితాను తప్పనిసరి చేస్తూ రాజ్యాంగ అధికరణలు 243కె, 243జెడ్ఎలకు మార్పులు చేయాలనే అంశం కూడా అధికారులు చర్చించారని సమాచారం. ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రిన్సిపల్ సెక్రెటరీ పికె మిశ్రా అధ్యక్షత వహించారు. ఇదిలావుండగా, 2019 ఎన్నికల సందర్భంగా బిజెపి చేసిన వాగ్దానాల్లో ఉమ్మడి ఓటర్ల జాబితా కూడా ఉన్న విషయం తెలిసిందే. ‘ఒక దేశం…ఒకే ఎన్నికలు’ పేరిట జరుగుతున్న ప్రయత్నాలకు ఉమ్మడి ఓటర్ల జాబితా ముడిపడి ఉండటంతో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ విషయాన్ని అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన కమిటీలన్నీ కేంద్ర, రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరగడం లాభదాయకమేనని తేల్చి చెప్పాయి. దీని వల్ల సమయం, ధనం ఎంతో ఎంతా అవుతుందని అభిప్రాయపడ్డాయి. కాకపోతే ప్రభుత్వం ఇప్పటివరకు ఈ విషయంలో ప్రతిపక్షాలను అభిప్రాయం కోరలేదు. 1999 నవంబరులో ఎన్నికల సంఘం ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది. భారత ఎన్నికల సంఘం, రాష్ట్రాల ఎన్నికల సంఘాలు విడివిడిగా ఓటర్ల జాబితాలను తయారు చేయడం వల్ల గందరగోళం నెలకొంటున్నదని, వ్యయం ఎక్కువవుతున్నదని, రెండేసి సార్లు పేర్లు వస్తున్నాయని పేర్కొంది. ఒకే ఓటర్ల జాబితా కోసం నిర్ణయం తీసుకోవాలని కోరింది. అలాగే న్యాయశాఖకు చెందిన పద్దుల నివేదికలో స్థాయీసంఘం కూడా వేర్వేరు ఓటర్ల జాబితా అంశాన్ని ప్రస్తావించింది. వేర్వేరు ఓటర్ల జాబితాల వల్ల గందరగోళమే తప్ప ఇంకేమీ వుండదని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే కీలక నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతున్నట్లు ఒక అధికారి తెలిపారు.