HomeNewsBreaking Newsఉపసంహరించుకోకుంటే నిరవధిక సమ్మె!

ఉపసంహరించుకోకుంటే నిరవధిక సమ్మె!

ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ బిల్లుపై కేంద్రానికి ఎఐబిఇఎ జాతీయ కార్యదర్శి రాంబాబు హెచ్చరిక
ఈనెల 16,17న రెండు రోజులు సమ్మె
ప్రజాపక్షం/హైదరాబాద్‌
ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోకపోతే, నిరవధిక సమ్మె చేపడుతామని యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ కన్వీనర్‌, ఎఐబిఇఎ జాతీయ కార్యదర్శి బి.ఎస్‌.రాంబాబు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లోనే బ్యాంకుల ప్రైవేటీకరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 16,17న రెండు రోజుల పాటు సమ్మె చేపడుతున్నట్టు వెల్లడించారు. బ్యాంకులను దొంగల చేతిలో పెట్టడం దుర్మార్గమన్నా రు. సోజిగూడలోని హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బ్యాంకు ల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రైతు ఉద్య మ స్ఫూర్తితో అన్ని ఉద్యోగ సంఘాలు, రాజకీయ పార్టీలతో కలిసి పోరాటం కొనసాగిస్తామ ని స్పష్టం చేశారు. బ్యాంకులను రక్షించుకునే క్రమంలో రాజకీయ పోరాటానికైనా తాము సిద్ధమేనన్నారు. బ్యాంకులను మోసం చేసినవారిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుందని, ఎగవేతదారులను ఎందుకు జైల్లో పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. ప్రజా సొమ్మును కొందరు లీగల్‌ లూటీ చేస్తున్నారని విమర్శించారు. బ్యాంక్‌ మోసగాళ్లపై చర్యలు తీసుకునేందుకు న్యాయవ్యవస్థ, చట్ట సభల సహాయం ఎంతైనా అవసరమన్నారు. ప్రజలను సమీకరించే వ్యవస్థలలో కొన్ని లోపాలు ఉన్నాయని, అందుకే నల్లధనం నుంచి మొదలు పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు వరకు ఆశించిన స్థాయిలో ప్రజా నిరసనలు జరగడం లేదన్నారు. ఎంపి సుజనాచౌదరి, మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్‌ వంటి ప్రజాప్రతినిధులు కూడా బ్యాంకులకు డబ్బులు చెల్లించాల్సి ఉన్నదని తెలిపారు. మొత్తం 13 బ్యాంక్‌ ఖాతాదారులు రూ.4,46,800 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, ఇందులో రూ.1,61,820 కోట్లు సెటిల్‌మెంట్‌ చేసుకున్నారని, మిగిలిన రూ.2,84,980 కోట్లు బ్యాంకులు నష్టపోయాయయని వివరించారు. ఇలాంటి డిఫాల్టర్లపైన క్రిమినల్‌ చర్యలు తీసుకోవాల్సిన అసవరం ఉందన్నారు. అదానీ, అంబానీ చేతిలోకి బ్యాంకులు పోతే పరిస్థితి ఏమిటని, అత్యంత ధనవంతులలో మొదటి ఐదుగురికి ప్రభుత్వ రంగ బ్యాంక్‌లలో కనీసం ఒక్క రూపాయి కూడా లేదన్నారు. బిజెపి ప్రభుత్వం మొదటి నుంచి ప్రభుత్వరంగ బ్యాంక్‌లను ధ్వంసం చేయాలని ప్రయత్నిస్తోందని, ఇలాంటి చర్యలు దేశానికి హానికరమని ఆరోపించారు. బ్యాంకులలో కార్పొరేట్‌ రంగాలే డిఫాల్టర్‌గా ఉంటున్నాయన్నారు. బ్యాంకుల ప్రైవేటీకరణను ఎపిలోని వైసిపి, టిడిపి, తెలంగాణలోని టిఆర్‌ఎస్‌తో పాటు అన్ని రాష్ట్రాల ప్రాంతీయ రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని, తమ ఉద్యమానికి మద్దతు ప్రకటించాయన్నారు. తమ పోరాటానికి మద్దతుగా జాతీయ రైతు సంఘం నేత రాకేష్‌ టికాయత్‌ను హైదరాబాద్‌కు ఆహ్వానిస్తామన్నారు. ప్రజల సొమ్మును, ప్రభుత్వ రంగ బ్యాంకులను కాపాడుకోవడం తమ బాధ్యత అని అన్నారు.
బ్యాంక్‌ల్లోని ప్రజా సొమ్ముకు ఎవరు గ్యారంటీ..?
ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రైవేటు చేతుల్లోకి వెళ్లిన తర్వాత ఆ బ్యాంక్‌లను ఎత్తివేస్తే అందుకు ఎవరు బాధ్యత వహిస్తారని, ప్రజా సొమ్ముకు ఎవరు గ్యారంటీగా ఉంటారని బి.ఎస్‌.రాంబాబు ప్రశ్నించారు. బ్యాంకులు ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళ్తే చార్జీలు, వడ్డీలు పెరుగుతాయని, వారు కేవలం లాభర్జనను దృష్టిలో పెట్టుకుని బ్యాంక్‌ కార్యాకలాపాలను నిర్వహిస్తారని, తద్వారా సామాన్యులకు తీవ్ర నష్టం జరుగుతుందని రాంబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఎఐబిఒఎ ప్రధాన కార్యదర్శి అనిల్‌ కుమార్‌ మాట్లాడుతూ ప్రభుత్వ పాలసీల వల్లనే బ్యాంక్‌లకు నష్టాలు జరుగుతున్నాయన్నారు. ఈ సమావేశంలో ఎఐబిఒఎ కార్యదర్శి హర్‌నాథ్‌, ఐఎన్‌బిఒసి నాయకులు మోహన్‌, ఎఐబిఇఎ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ జనరల్‌ సెక్రెటరీ పివి.కృష్ణారావు, ఎఐబిఒఎ తెలంగాణ, ఎపి కార్యదర్శి ఫణికుమార్‌, కోటక్‌ మహేంద్రా బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌, సిబిఇయు తెలంగాణ, ఎపి ప్రధాన కార్యదర్శి ఉదయ్‌కుమార్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అవార్డ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి సమద్‌ఖాన్‌, ఎఐబిఇఎ నాయకులు జానకి రామ్‌ తదితరులు పాల్గొన్నారు.

 

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments