ఉద్యోగ కల్పనలో విఫల్యం

సునీల్‌ నాయక్‌ ఆత్మహత్యకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం
సాగునీటి ప్రాజెక్టుల్లో నాణ్యతాలోపం, అవినీతి
కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ సాధనకై ఉద్యమించాలి : చాడ
ప్రజాపక్షం/వరంగల్‌ బ్యూరో సమైక్య రాష్ట్రంలో, మా ఉద్యోగాలు మాకే అని పోరాడి, తెలంగాణ తెచ్చుకున్నాక కూడా, తెలంగాణ ప్రాంత నిరుద్యోగులకు నిరాశే మిగిలిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి అన్నారు. ఆదివారం హన్మకొండ బాలసముద్రంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో సిఎం కె. చంద్రశేఖర రావు తన కుటుంబానికి ఉద్యోగాలు ఇచ్చుకున్నా రు తప్ప, ఏ ఒక్క నిరుద్యోగికి ఉద్యోగ అవకాశా లు కల్పించలేదని తీవ్రంగా విమర్శించారు. కేం ద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కెసిఆర్‌ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతూ పేద, బడుగు బలహీన వర్గాల హక్కులను హరిస్తున్నాయని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ఉద్యోగాలు పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. నిరుద్యోగుల భవిష్యత్‌ పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్‌ కమిషన్‌ చైర్మన్‌ను పెట్టింది తప్ప సభ్యులను నియమించకపోవడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. అతి గతి లేని విధంగా రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి తయారయినందునే వరంగల్‌లో నిరుద్యోగ యువకుడు సునీల్‌ నాయక్‌ ఆత్మహత్యకు పాల్పడిన పరిస్థితి నెలకొందన్నారు. నిరుద్యోగుల ఆత్మబలిదానాలకు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణమన్నారు. ఇటు నిరుద్యోగులను మోసం చేసినట్టే, ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ వర్గాలకు ఉపాధి అవకాశాలు లభించే పథకాలను సైతం కెసిఆర్‌ ప్రభుత్వం నీరు కారుస్తున్నదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా బోడ సునీల్‌ నాయక్‌ ఆత్మబలిదానాన్ని అర్థం చేసుకుని, ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవడంతో పాటు, ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు. కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు తప్ప, ఆ ప్రాజెక్టు వల్ల మెట్ట ప్రాంతంలోని రైతుల పంట పొలాలకు నీరు అందడం లేదని, పంటలు ఎండిపోతున్నాయన్నారు. ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు, అటు దేవాదుల ప్రాజెక్టు నిర్మాణం లో అంతులేని అవినీతి జరిగిందని, నాణ్యత లోపంతో నిర్మాణాలు కొనసాగుతున్నాయని అన్నారు. పొలాలు ఎండిపోతున్నా రైతుల బతుకులు మాడిపోతున్నా పట్టించుకోని ఈ రాష్ట్ర ప్రభుత్వంపై సిపిఐ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని హెచ్చరించారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్‌ పరం చేస్తూ అదాని, అంబానీలకు, అండగా నిలుస్తుందని ఆరోపించారు. కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ విషయంలో సిపిఐ ప్రత్యక్ష పోరాటాలకు శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిపారు. రాష్ట్రం విడిపోతున్నప్పుడు చట్టసభలో చేసుకున్న తీర్మానాలను అమలు పరచాల్సిన బాధ్యత కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై ఉందని ఆయన డిమాండ్‌ చేశారు. కోచ్‌ ఫ్యాక్టరీని కాజీపేట కు తీసుకురా లేనిపక్షంలో, రేపు రాబోయే వరంగల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఓట్లు అడిగే అర్హత బిజెపికి లేదని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కల్లపల్లి శ్రీనివాసరావు, వరంగల్‌ అర్బన్‌ జిల్లా కార్యదర్శి మేకల రవి, జిల్లా సహాయ కార్యదర్శి కర్రె బిక్షపతి, నగర కార్యదర్శి షేక్‌ బాష్‌ మియా, జిల్లా నాయకులు తోట బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
చాడ వెంకటరెడ్డి కి తృటిలో తప్పిన ప్రమాదం
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండలో ఆయన ప్రయాణిస్తున్న వాహనానికి యాక్సిడెంట్‌ కాగా ఎదురుగా వస్తున్న ఇద్దరికి స్వల్పంగా గాయాలయ్యాయి. హన్మకొండ సుబేదారి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. చాడ వెంకట్‌ రెడ్డికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రమాదానికి గురైన వారిని స్థానిక రోహిణి ఆసుపత్రిలో చేర్పించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. విషయం తెలియగానే స్థానిక సిపిఐ నాయకులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని చాడను పరామర్శించారు.

DO YOU LIKE THIS ARTICLE?