ఉద్దేశపూర్వకంగానే రుణాలను ఎగ్గొట్టారు!

న్యూఢిల్లీ: ఉద్దేశపూర్వకంగా బ్యాంకులకు రుణాలను ఎగ్గొట్టిన వారి జాబితాను ఆర్‌బిఐ గురువారం విడుదల చేసింది. ఆంగ్ల వార్తాసంస్థ‘ది వైర్‌’ ఈ ఏడాది మేలో ఆర్‌టిఐ చట్టం కింద దరఖాస్తు చేయగా 2019 ఏప్రిల్‌ 30వ తేదీ వరకు గడువు దాటిన 30 మంది అతిపెద్ద రుణ ఎగవేతదార్ల జాబితాను వెల్లడించింది. దాదాపు పదేళ్ల నుంచి ఆర్‌బిఐ ఈ జాబితాను వెల్లడించడానికి నిరాకరిస్తూ వస్తోంది. దేశ ఆర్థిక ప్రయోజనాలకు ఇది వ్యతిరేకంగా ఉంటుందని చెబుతూ నీరుగారుస్తూ వస్తోంది. కానీ, మరోపక్క బ్యాంకులు మాత్రం తమ డబ్బు వసూలు చేసుకోవాడానికి ఉద్దేశపూర్వక ఎగవేతదారులపై కేసులు నమోదు చేయడం, బ్యాంకులతో వివాదాల కారణంగా ఎగవేత దారుల సమాచారం తరచూ బయటకు వస్తూనే ఉంది. ఆర్‌బిఐ విడుదల చేసిన 30 కంపెనీల్లో వజ్రాల వ్యాపారి మెహుల్‌ చోక్సికి చెందిన 3 కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలకు ఇచ్చిన రుణాల విలువ మొత్తం (ఇప్పటి వరకు బ్యాం కులు రద్దు చేసినవి కూడా కలిపి) రూ.50,000 కోట్లు దాటింది. ఈ డేటాను కేంద్రీకృత బ్యాం కింగ్‌ సమాచారమైన ‘ది సెంట్రల్‌ రిపాజిటరీ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆన్‌ లార్జ్‌ క్రెడిట్‌’ నుంచి తీసుకొని విడుదల చేసింది. దీనిలో రూ. 5కోట్లకు పైగా రుణం తీసుకొన్న వారి సమాచారం ఉంటుంది. 2018లో ట్రాన్స్‌యూనియన్‌ సిబిల్‌ లెక్కల ప్రకారం 2018లో 11,000 వేల కంపెనీలు కలిపి చెల్లించాల్సిన మొత్తం రూ.1.61 లక్షల కోట్లతో సమానం.
ఉద్దేశపూర్వక ఎగవేతదారులు అంటే…
ఆర్‌బిఐ నిర్వచనం ప్రకారం చెల్లించగలిగే స్థోమత ఉన్నా బకాయిలను చెల్లించని వారిని, ఏ అవసరానికైతే రుణాలను తీసుకున్నారో వాటికి కాకుండా ఇతరాలకు ఖర్చుపెట్టిన వారిని ఉద్దేశపూర్వగా ఎగవేతదారుగానే పరిగణిస్తారు.

DO YOU LIKE THIS ARTICLE?