డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామీ పగ్గాలు స్వీకరించనున్నారు. ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు ఆయన పదవీ ప్రమాణం చేయనున్నారు. కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అధ్యక్షతన జరిగిన బిజెపి శాసనసభా పక్ష సమావేశంలో ఆయన ఎన్నిక ప్రక్రియ పూర్తయింది. ఉత్తరాఖండ్‌లో 4 నెలల కాలంలో మూడోసారి ముఖ్యమంత్రి మారడం గమనార్హం. అంతకు ముందు కొత్త నాయకుడి ఎన్నికకు వీలుగా ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ రావత్ రాజీనామా చేశారు. ఆయన నాలుగు నెలలు మాత్రమే ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. కరోనా మహమ్మారి విజృంభణ సమయంలోనే జరిగిన కుంభమేళాకు వచ్చే భక్తులంతా కొవిడ్ నెగిటివ్ రిపోర్ట్ తప్పనిసరిగా సమర్పించాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ కొన్ని ల్యాబ్‌లు తప్పుడు, నకిలీ సర్టిఫికెట్లు జారీ చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. కుంభమేళా అనంతరమే దేశంలో కరోనా చాలా వేగంగా వ్యాపించింది. ఈ కుంభకోణంలో ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ హస్తం కూడా ఉందన్న ఆరోపణలు రావడంతో సమస్యలు తలెత్తాయి. అందుకే ఆయన తన పదవి నుంచి వైదొలినట్టు అనుమానాలు ఉన్నాయి. అయితే, రాజ్యాంగం ప్రకారం 6 నెలల్లో ఎమ్మెల్యేగా ఎన్నిక కావలసిన ఉన్న రావత్ ఆరు నెలల్లోపు ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేని పరిస్థితి ఉండడంతో పదవికి రాజీనామా చేశారని బిజెపి వర్గాలు అంటున్నాయి. కరోనా పరిస్థితుల కారణంగా రెండు అసెంబ్లీ స్థానాలు ఖాళీగా ఉన్నప్పటికీ, వాటికి ఉప ఎన్నికలను ఆరు నెలల్లోగా నిర్వహించడం సాధ్యం కాదని ఎన్నికల కమిషన్ ప్రకటించినట్టు సమాచారం. ఆరోపణల విషయం ఎలావున్నా, ఎన్నికల ప్రక్రియకు ఇసి సిద్ధంగా లేకపోవడానికి కరోనానే కారణమన్నది వాస్తవం. మొత్తం మీద కరోనా కారణంగా తీరథ్ సింగ్ రాజీనామా చేయాల్సి వచ్చింది. పార్టీలో త్రివేంద్రసింగ్ రావత్‌పై తీవ్ర వ్యతిరేక రావడంతో ఆయనను తప్పించి ముఖ్యమంత్రి పీఠంపై తీరథ్ సింగ్‌ను బిజెపి కూర్చోబెట్టింది. కానీ, ఆరు నెలల్లోగా ఆయన అసెంబ్లీకి ఎన్నిక కాలేకపోవడంతో ఆయన వైదొలగక డప్పలేదు. కాగా, ఆయన రాజీనామా చేసిన తర్వాత ముఖ్యమంత్రి పదవికి సత్పాల్ సింగ్, ధన్సింగ్ రావత్ పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే బిజెపి అధిష్టానం పుష్కర్ ధామివైపు మొగ్గుచూపింది. ఉత్తరాఖండ్‌లో యూత్ విభాగానికి అత్యుత్తమ సేవలు అందించిన ఆయన ఉద్ధమ్ సింగ్ నగర్ జిల్లాలోని ఖతిమా నియోజకవర్గం నుంచి ఎంఎల్ఎగా ఉన్నారు.
ఉత్తరాఖండ్ కొత్త సిఎం పుష్కర్ ధామి
RELATED ARTICLES