2.80 కోట్ల మందికి 3.34 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం
హైదరాబాద్ : రాష్ట్రంలో 12 కిలోల ఉచిత బియ్యం పంపిణీ బుధవారం ప్రారంభ మయ్యింది. ఖైరతాబాద్‌లోని రేషన్ షాపు నెంబర్ 702లో ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. కోవిడ్ – 19 వైరస్ వ్యాప్తి, లాక్‌డౌన్ నేపథ్యంలో నిరుపేద కుటుంబాలు ఆకలితో అలమటించకూడదన్న ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఈ సందర్భంగా మారెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పంపీణీ కార్యక్రమాన్ని, రేషన్ షాపుల్లో బియ్యం నిల్వలు, లబ్దిదారులకు పంపిణీ వంటి వివరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా తెలంగాణ ప్రభుత్వం మానవతా దృక్పథంతో రాష్ట్రంలోని 87.54 లక్షల ఆహార భద్రత కార్డుల్లోని 2.80 కోట్ల మంది పేదలకు ఉచితంగా బియ్యాన్ని అందిస్తోందన్నారు. బియ్యం గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్క లబ్దిదారుడికి 12 కిలోల బియ్యాన్ని ఉచితంగా అందిస్తామని ఆయన చెప్పారు. ఇందుకోసం రాష్ట వ్యాప్తంగా 17 వేల రేషన్ షాపుల్లో 3.34 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. లబ్దిదారులు రేషన్ షాపుల వద్ద బియ్యం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి రాకుండా ముందుగానే టోకెన్లను జారీ చేయడం జరుగుతుందని, టోకెన్ పద్దతిలో నిర్దేశించిన సమయానికి రేషన్ షాపుకు వచ్చి బియ్యాన్ని తీసుకోవాలన్నారు. ఉదయం, సాయంత్రం అని కాకుండా స్థానిక అవసరాలను బట్టి రేషన్ షాపుల సమయాన్ని కూడా పొడిగిస్తామన్నారు. ప్రతి ఒక్క లబ్దిదారుడికి బియ్యం అందించే వరకు షాపులు పనిచేస్తాయని తెలిపారు. లబ్దిదారులు షాపుల వద్ద ప్రభుత్వ సూచనలను ఖచ్చింతంగా పాటించాలని, రేషన్ దుకాణాల వద్ద సామాజిక దూరాన్ని ఖచ్చితంగా పాటించాలని, చేతులు శుభ్రం చేసుకునే విధంగా హ్యాండ్ వాష్, సానిటైజర్లు అందుబాటులో ఉంచుకోవాలని రేషన్ డీలర్లను ఆదేశించారు. ఫిర్యాదుల కోసం పౌరసరఫరాల కేంద్ర కార్యాలయంలో టోల్ ఫ్రీ నెంబన్ 1967, 1800 ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ నెంబర్‌కు రేషన్ ఫిర్యాదులు, ధరల నియంత్రణ, ఉచిత బియ్యం, వంటగ్యాస్ పంపిణీ సంబంధించి ప్రతి రోజు దాదాపు 300 వరకు కాల్స్ వస్తున్నాయని వీటిపై అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. వలస కార్మికులకు కూడా ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేయాలని, ముఖ్యమంత్రి ఆదేశించారని రాష్ట్రంలో గుర్తించిన 3.35 లక్షల మంది వలస కార్మికులకు ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున 13 కోట్ల రూపాయల విలువ చేసే 4,038 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పోరేటర్ విజయా రెడ్డి, హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ బాలామాయాదేవి, పౌరసరఫరాల అధికారి పద్మ, పౌరసరఫరాల సంస్థ మేనేజర్ తనూజ తదితరులు పాల్గొన్నారు.
ఉచిత బియ్యం పంపిణీ షురూ!
RELATED ARTICLES