HomeNewsTelangana‘ఉగ్ర’ భయం మధ్య నేడు పాకిస్థాన్‌లో పోలింగ్‌

‘ఉగ్ర’ భయం మధ్య నేడు పాకిస్థాన్‌లో పోలింగ్‌

ఇస్లామాబాద్‌ : పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ గురువారం జరుగుతుంది. ఒకవైపు బాంబు పేలుళ్ళు, మరోవైపు పేదరికపు ఆర్తనాదాల మధ్య 12వ సారి సార్వత్రిక ఎన్నికల్లో 12.80 కోట్లమంది అర్హులైన ఓటర్లు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు సిద్ధమయ్యారు. ఈసారి నవాజ్‌ షరీఫ్‌ ్ర(74) పధానమంత్రి పదవి అధిష్టించాలని గట్టి నిర్ణయంతో ఉన్నారు. ఆయనవైపే అన్నీ మొగ్గుచూపుతున్న వాతావరణం ఏర్పడింది. భారత్‌ తరహాలో ఆర్థికంగా దేశాన్ని అభివృద్ధి చేస్తానని నవాజ్‌ షరీఫ్‌ ప్రజలకు హామీ ఇచ్చారు. మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌, ఆయన భార్య జైలులో ఉన్నారు. దీంతో నవాజ్‌ షరీఫ్‌కు చెందిన పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ షరీఫ్‌ (పిఎంఎల్‌ పార్టీ అతిపెద్ద పార్టీగా దేశంలో అందరికీ కనిపిస్తున్నది. ఆయన కుమార్తె, కుమారుడు, సోదరుడు, బంధువులు అందరూ ఈసారిఎన్నికల్లో పోటీలో ఉన్నారు. వాస్తవానికి గడచిన డిసెంబరులోనే ఎన్నికలు జరగాల్సి ఉంది. భద్రతా కారణాల రీత్యా ఎన్నికలు వాయిదా పడ్డాయి.
ఉగ్రవాదుల ప్రమాదం, భయాందోళనమధ్య ప్రభుత్వం భారీ ఎత్తున సైన్యాన్ని మోహరించింది. కఠిన భద్రతా నిబంధనలు అమలులోకి తెచ్చింది. 65వేలమంద భద్రతా సిబ్బందిని మోహరించారు. 90 వేలకుపైగా పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటటు చేశారు. దేశవ్యాప్తంగా ఈసారి పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీలో మొత్తం 336 స్థానాలు ఉండగా 266 మంది ప్రజా ప్రతినిధులను ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. మిగిలిన 70 స్థానాల్లో 60 స్థానాలు మహిళలకు రిజర్వు చేయగా, మరో 10 స్థానాలు మైనారిటీలకు కేటాయించారు. నిర్ణీత ప్రకారం గురువారం ఉదయం 8 గంటలకు పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. సాయంత్రం 5 గంటలకు ఈ ప్రక్రియ ముగుస్తుంది. ఇస్లామాబాద్‌ క్యాపిటల్‌ టెరిటరీలో 16 స్థానాలు, దేశ వాయువ్య ప్రాంతంలోని ఖైబర్‌ ఫఖ్తుంఖ్వాలో 44 స్థానాలు, కెపికె ప్రాంతంలో ఒకస్థానం, పంజాబ్‌ రాష్ట్రంలో అత్యధికంగా 141, సింధ్‌ రాష్ట్రంలో 61స్థానాలకు పోలింగ్‌ జరుగుతాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 5,112 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా, వీరిలో 313 మహిళలు, ఇద్దరు ట్రాన్స్‌ జెండర్లు ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. ఇదిలా ఉండగా నాలుగు రాష్ట్రాలలో 12,695 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. మొత్తం నాలుగు రాష్ట్రాలలోనూ 593 అసెంబ్లీ స్థానాలకు కూడా గురువారంనాడే ఎన్నికలు జరుగుతున్నాయి. నాలుగు రాష్ట్రాలలో 132 సీట్లు మహిళలకు కేటాయించారు. మరో 24 సీట్లు మైనారిటీలకు కేటాయించారు. కాగా ఈ ఎన్నికల్లో మహిళలకు ఐదూశాతం కూడా సీట్లు కేటాయించడంలో రాజకీయపార్టీలు విఫలమయ్యాయని హక్కుల సంఘాలు తీవ్ర నిరాశా నిస్పృహలు వ్యక్తం చేశాయి. 2017 పాకిస్థాన్‌ ఎన్నికల చట్టం206వ సెక్షన్‌ ప్రకారం నిబంధనలు పాటించలేదని పాకిస్థాన్‌ మానవ హక్కుల కమిషన్‌ ఎక్స్‌ వేదికగా విమర్శించింది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments