పాకిస్తాన్, ఇరాక్ దేశాల్లో ఆత్మాహుతి దాడులు
18 మంది మృతి.. పలువురికి గాయాలు
కరాచీ/ బాగ్దాద్ : ఉగ్రవాదులు పంజా విసిరారు. అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత మరింతగా రెచ్చిపోతున్న ఉగ్రవాదులు పాకిస్తాన్, ఇరాక్ దేశాల్లో ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో 18 మంది మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. వరుస దాడులతో వణికిపోతున్న పాకిస్తాన్‌లో జరిగిన మరో దాడి ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నది. క్వెట్టాల్లో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఘటనలో ఐదుగురు పాక్ సైనికులు జరిపోయారు. కనీసం పాతిక మంది గాయపడ్డారు. పాక్ ఆర్మీ చెక్‌పోస్టును లక్ష్యంగా చేసుకొని తెహ్రిక్ తాలిబన్ ఆఫ్ పాకిస్తాన్ (టిపిటి)కి చెందిన ఓ ఆత్మాహుతి దళ సభ్యుడు బైక్‌పై వచ్చి తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ ఘటనతో పాక్ ఆర్మీ అప్రమత్తమైంది. గాలింపు చర్యలను ముమ్మరం చేసింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక దళాన్ని లక్ష్యం చేసుకొని టిపిటి దాడులకు పాల్పడుతున్నదని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ఇలావుంటే, ఇరాక్ ఉత్తర ప్రాంతంలో ఆదివారం తెల్లవారు జామున జరిగిన బాంబు దాడిలో 13 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఐసిస్ తీవ్రవాద సంస్థ ఈ దాడులకు పాల్పడిందని అధికారులు అనుమానిస్తున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం కిర్కుక్ నగరానికి సుమారు 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్ రషద్ ప్రాంతంలో ఈ దాడి జరిగింది. ఫెడరల్ పోలీస్ చెక్ పోస్టును పేల్చేయడానికి ఉగ్రవాదులు ప్రయత్నించారు. ఘటన అనంతరం సైన్యం ఉగ్రవాదులను వెతికి పట్టుకునేందుకు వేట మొదలుపెట్టింది. ఇటీవల అఫ్గానిస్థాన్ రాజధాని కబూల్‌లోని హమీద్ కర్జయ్ విమానాశ్రయంలో బాంబు పేలుడు సంఘటనకు తామే బాధ్యత వహిస్తున్నట్టు ఐసిస్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఉగ్ర పంజా..
RELATED ARTICLES