ఉగ్రస్థావరాలపై భారత సైన్యం దాడి

మూడు స్థావరాలు పూర్తిగా, మరొకటి పాక్షికంగా ధ్వంసం
పాకిస్థాన్‌ మిలిటరీ పోస్టులపై కూడా దాడులు
6 నుంచి 10 మంది పాక్‌ జవాన్లు హతం
10 నుంచి 15 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టిన భారత జవాన్లు

న్యూఢిల్లీ/జమ్ము : భారత్‌ వైపు నుంచి ఎటువంటి క వ్వింపు చర్యలు లేనప్పటికీ పాకిస్థాన్‌ సైన్యం కాల్పులు జరిపింది. ఈ కాల్పులను భారత సైన్యం తిప్పికొట్టింది. జమ్మూకశ్మీర్‌లోని నియంత్రణరేఖ వెంబడి ఉన్న తంగ్ధా ర్‌ సెక్టార్‌కు ఎదురుగా ఉన్న పాకిస్థాన్‌ సైన్యానికి చెందిన అనేక పోస్టులను భారత బలగాలు ధ్వంసం చేశాయి. అదే విధంగా నాలుగు ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు జరిపాయి. ఈ ఘటనలో 6నుంచి పాకిస్థాన్‌ సైనికులు హతమైనట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. భారత ఆర్మీ జరిపిన దాడుల్లో 10 మంది ఉగ్రవాదులు కూడా హతమైనట్లు, పాకిస్థాన్‌ వైపు తీవ్ర నష్టం వాటిల్లినట్లు సమాచారం. శనివారం సాయంత్రం పాకిస్థాన్‌ జరిపిన కాల్పుల్లో ఓ పౌరు డు, ఇద్దరు భారత ఆర్మీ సిబ్బంది మృత్యువాత పడిన నేపథ్యంలో భారత సైన్యం వెంటనే ప్రతీకారం తీర్చుకుంది. తంగ్ధార్‌ సెక్టార్‌లోని భారత భూభాగంలోకి ఉగ్రవాదుల చొరబాటుకు సాయం చేసేందుకు పాకిస్థాన్‌ ఆర్మీ కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడిందని భారత ఆర్మీ అధికారి ఒకరు చెప్పారు. అప్రమత్తమైన భారత సైన్యం సరైన సమయంలో పాక్‌ సైన్యంపై ఎదురు దాడులు జరిపిందన్నారు. ఇదిలా ఉండగా, నియంత్ర రేఖ వ్యాప్తంగా భారత్‌, పాక్‌ సైన్యాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో దాదాపు తొమ్మిది మంది భారత జవాన్లు మృతి చెందారని పాకిస్థాన్‌ ఆర్మీ చెబుతోంది. అయితే ఆ వ్యాఖ్యలను భారత ఆర్మీ వర్గాలు త్రోసిపుచ్చాయి. కాల్పుల్లో పాకిస్థాన్‌ ఒక సైనికుడిని, ముగ్గురు పౌరులను కోల్పోయినట్లు పాకిస్థాన్‌ మిలిటరీ అధికార ప్రతినిధి మేజర్‌ జనరల్‌ ఆసిఫ్‌ ఘఫూర్‌ ట్వీట్‌ చేశారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ముజప్ఫరాబాద్‌ జిల్లాలోని నౌసేరి సెక్టార్‌, దాని పొరుగున ఉన్న నీలమ్‌ లోయలోని జురా సెక్టార్‌లో కాల్పులు జరిగినట్లు ముజప్ఫరాబాద్‌ డిప్యూటీ కమిషనర్‌ బాదర్‌ మునీర్‌ మీడియాకు తెలిపారు.
మరో ఘటనలో పౌరుడికి గాయాలు
అంతర్జాతీయ సరిహద్దు వెంబడి జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లాలో పాకిస్థాన్‌ జరిపిన కాల్పుల్లో ఒక పౌరుడికి గాయాలయ్యాయి. దీంతో స్థానికులు పాకిస్థాన్‌ తరుచూ కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనలకు పాల్పడడాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగారు. హిరానగర్‌ సెక్టార్‌లో కొన్ని నిర్మాణ పనులను అడ్డుకోవడమే లక్ష్యంగా శనివారం రాత్రంతా పాక్‌ కాల్పులు జరిపినట్లు అధికారులు చెప్పారు. మోర్టార్‌ షెల్స్‌తో దాడులు చేయడంతో ఓ ఇళ్లు ధ్వంసం కాగా, మంటలు చెలరేగాయి. మంటల నుంచి తప్పించుకునే క్రమంలో ఇంటి యజమానికి కూడా గాయాలయ్యాయి.
కాల్పుల ఘటనపై ఆర్మీ చీఫ్‌తో మాట్లాడిన రాజ్‌నాథ్‌
కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లుపొడుస్తూ నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ బలగాలు ఆదివారంనాడు విరుచుకుపడిన నేపథ్యంలో తలెత్తిన ఉద్రిక్తతలపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అప్రమత్తమయ్యారు. స్వయంగా ఆయన పరిస్థితిని సమీక్షించారు. ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌కు ఫోను చేసి సరిహద్దుల్లో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు తనకు సమాచారం ఇవ్వాలని బిపిన్‌ రావత్‌కు సూచించారు.

DO YOU LIKE THIS ARTICLE?