ఉగ్రవాదుల ఏరివేత ఆగదు
కాల్పుల విరమణ ఒప్పందంపై సైన్యం స్పష్టీకరణ
ఉధంపుర్: భారత్, పాక్ దేశాలు ఇటీవల అం గీకరించిన కాల్పుల విరమణ ఒప్పందం కారణంగా జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత చర్యలు ఆగిపోవని భారత సైన్యం ఉత్తర కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ వైకె జోషీ స్పష్టంచేశారు. సరిహద్దుల్లో సవాళ్లను ఎదుర్కొనే విషయంలో ఉత్తర కమాండ్ అత్యంత అప్రమత్తం గా ఉంటుందని ఆయన అన్నారు. వాస్తవాధీన రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని కచ్చితంగా పాటించనున్నట్లు ఫిబ్రవరి 24 25 అర్ధరాత్రివేళ భారత్, పాక్ సైనిక కార్యకలాపాల డైరక్టర్ జనరళ్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దీని కారణంగా జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కార్యకలాపాలు నిలిచిపోవని జోషీ పేర్కొన్నారు. కశ్మీర్లోని ఉధంపుర్లో జరిగిన ఒక సైనిక కార్యక్రమంలో ఆయన నిస్వార్థంగా దేశ సేవ చేసిన సైనికుల కు పతకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తూ దేశంలో అలజడి సృష్టించాలనుకున్న పొరుగుదేశాల ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఉత్తర కమాండ్ రక్షణ కవచంలా వ్యవహరించిందని జోషీ ప్రశంసించారు. ఇకముందు కూడా భారత్కు ఎవరైనా చెడు తలపెట్టాలనుకుంటే సైన్యం బలంగా బదులిస్తుందని ఆయన హెచ్చరించారు. పొరుగుదేశాలతో సరిహద్దుల్లో భారతీయ సైన్యం తన ఆధిపత్యాన్ని నిలుపుకొందని, అలా దేశంలో శాంతి నెలకొనేందుకు కారణమైందని జోషీ అన్నారు. అయితే చైనా, పాక్ దేశాలను పేర్కొనకుండా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తూర్పు లడఖ్ ప్రాంతంలో చైనాతో ప్రతిష్టంభన ఏర్పడిన సమయంలో, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సైన్యం ధైర్యంగా నిలబడిందని జోషీ పేర్కొన్నారు. అలా 2020 సంవత్సరం చాలా రకాలుగా చరిత్రలో నిలిచిపోతుందని గుర్తుచేశారు. భద్రతా దళాలు అలుపెరగకుండా చేసిన ప్రయత్నాల కారణంగా కశ్మీర్లో ఉగ్రవాద సంఘటనలు, రాళ్లదాడి చర్యలు, నిరసనలు గణనీయంగా తగ్గిపోయాయని ఆయన తెలిపారు. మొత్తానికి అక్కడ భద్రత పరిస్థితిలో గొప్ప మెరుగుదల కనిపిస్తోందని అన్నారు. ఇంకా కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా సైన్యం కీలకపాత్ర పోషించిందని జోషీ ప్రశంసించారు.