ఉగ్రవాదంపై పోరుకు ఏకం కండి

అది ఏ దేశానికి సవాల్‌ కాదు
ఐరాస సాధారణ సభలో మోడీ పిలుపు

న్యూయార్క్‌: ఉగ్రవాదంపై పోరులో ప్రపంచం అంతా ఏకాభిప్రాయం కలిగి ఉండాలని, ఐక్యంగా ఉండాలని భారత ప్రధాని శుక్రవారం ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో ప్రసంగిస్తూ చెప్పారు. ఉగ్రవాదం మానవాళికంతటికీ పెను ముప్పు అన్నారు. ‘ఉగ్రవాదం అన్నది ఏ ఒక్క దేశానికో సవాలుకాదని, అది అన్ని దేశాలకు, మానవాళికి ముప్పేనన్నది మా అభిప్రాయం. మానవాళి కోసం ప్రపంచం అంతా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏకమవ్వాల్సి ఉంది’ అన్నారు. పాకిస్థాన్‌ దేశం పేరెత్తకుండానే మానవాళికి హాని తలపెడుతున్న ఉగ్రవాదాన్ని అందరూ వ్యతిరేకించాలని, దానిపై ఆగ్రహాన్ని ప్రదర్శించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ‘మేము ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించిన బుద్ధుడు పుట్టిన దేశానికి చెందినవారం. యుద్ధం సందేశాన్ని మేము ప్రపంచానికి ఇవ్వలేదు. మేము ఉగ్రవాదానికి వ్యతిరేకంగా గళమెత్తినప్పుడల్లా తీవ్రంగా గళమెత్తాం’ అన్నారు. దాదాపు 20 నిమిషాలపాటు ప్రసంగించిన మోడీ గ్లోబల్‌ వార్మింగ్‌కు వ్యతిరేకంగానూ, అభివృద్ధి చర్యలపైన కూడా మాట్లాడారు. ప్రపంచం విభజన అన్నది ఎవరి హితంలోనూ ఉండ దు. ‘మేము కూడా మా సరిహద్దులను పరిమితం చేసుకునే ఐచ్ఛికాన్ని కలిగిలేము. బహుళతానికి ప్రపం చం కొత్త దిశను ఇవ్వడం చాలా ముఖ్యం’ అని చెప్పారు. ప్రపంచ మత సభలో స్వామి వివేకానంద శాంతి, సామరస్య సందేశాలే ఇచ్చారు. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశంగా ఉన్న భారత్‌ నేడు కూడా శాంతి, సామరస్యాల సందేశాన్నే ఇస్తోంది’ అని చెప్పారు. వారం రోజులుగా అమెరికాలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్థాన్‌ పేరును ప్రస్తావించకుండానే అది ఉగ్రవాదానికి కేంద్రంగా ఉన్న దేశమన్నారు.ఆ దేశ నేలపై నుంచి పనిచేస్తున్న ఉగ్రవాదులకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు.
భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తగ్గాలంటే సీమాంతర చొరబాట్లు, ఉగ్రవాదంపై పాకిస్థాన్‌ చర్య లు చేపట్టాలని అమెరికా గురువారం స్పష్టంచేసింది. ‘భారత్‌, పాకిస్థాన్‌ నిర్మాణాత్మకమైన చర్చలు చేపట్టాలని మేము కోరుకుంటున్నాం. రెండు అణ్వస్త్ర దేశాలుగా ఉన్న వాటి మధ్య సంబంధాలు మెరుగుపడాలని కోరుకుంటున్నాం’ అని దక్షిణ, మధ్య ఆసియాకు అమెరికా తాత్కాలికి విదేశాంగ మంత్రి అయిన ఆలిస్‌ వెల్స్‌ చెప్పారు. ‘పాకిస్థాన్‌ భూభాగాన్ని ఉపయోగించుకున్న హఫీజ్‌ సయీద్‌, జైషే మహ్మద్‌ నాయకుడు మసూద్‌ అజర్‌ వంటివారిపై తీవ్ర చర్యలు తీసుకోవాలని లేకుంటే ‘ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ ఫోర్స్‌ యాక్షన్‌ ప్లాన్‌’ను పాకిస్థాన్‌పై అమలుచేస్తామని ఆమె అన్నారు. ఐక్యరాజ్యసమితి సమావేశం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, జర్మనీ ఛాన్సలర్‌ ఏజెంలా మెర్కెల్‌ సహా వివిధ దేశ నాయకులతో భేటీ అయ్యారు. శుక్రవారం 74వ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో మోడీ ప్రసంగిస్తూ, ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం (భారత్‌) తన ప్రభుత్వానికి, తన కు పట్టం కట్టిందని, మరోసారి పెద్ద మెజారిటీతో అధికారంలోకి వచ్చామని, ప్రజాతీర్పు వల్లే తాను ఇవాళ ఇక్కడ ఉన్నానని అన్నారు. తాను ఇక్కడకు వచ్చేటప్పడు ఐక్యరాజ్యసమితి గోడలపై ‘నో మోర్‌ సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌’ అనే నినాదం చదివానని చెప్పారు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ నుంచి విముక్తి సాధించేందుకు భారత్‌లో చాలా పెద్ద ప్రచారం నడుపుతున్నామనే విషయాన్ని చెప్పడానికి తాను గర్విస్తున్నానని అన్నారు.
అభివృద్ధి చెందుతున్న దేశంగా అతిపెద్ద పరిశుభ్రతా డ్రైవ్‌ను తాము విజయవంతంగా చేపట్టామని, ఐదేళ్లలో 11 కోట్ల మరుగుదొడ్లు నిర్మించామని, ఇది ప్రపంచానికి స్ఫూర్తి సందేశమవుతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. ఆరోగ్య రంగంలోనూ భారత్‌ ఎన్నో విజయాలు సాధించిందని, టీబీ నిర్మూలనకు కట్టుబడి ఉందని అన్నారు. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా మహాత్మాగాంధీ 150వ జయంత్యుత్సవాలు జరుగనున్నాయని, మహాత్మాగాంధీ చాటిచెప్పిన శాంతి, అహింసా సిద్ధాంతాలు ఇవాళ ప్రపంచ శాంతి, ప్రగతి, అభివృద్ధికి అత్యంత ఆవశ్యకాలని అన్నారు. కాగా మోడీ ప్రసంగిస్తుండగా ఐక్యరాజ్య సమితిప్రధాన కార్యాలయం వద్ద ప్రవాస భారతీయులు పెద్ద ఎ్తతున సంబరాలు చేసుకున్నారు. మోడీ హిందీలోనే ప్రసంగించారు. మోడీ తన ప్రసంగంలో అభివృద్ధి, భద్రత, కౌంటర్‌ వాతావరణ మార్పు వంటి వివిధ అంశాలపై ప్రసంగించారు. భారత్‌ 1996లోనే ఐరాస సాధారణ సభలో ‘అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర ఒప్పందం’(సిసిఐటి) ముసాయిదా దస్తావేజును ప్రతిపాదించిందని, కానీ సభ్య దేశాలు దానిపై ఏకాభిప్రాయంకు రాకపోవడం వల్ల అది ఓ బ్లూప్రింట్‌గానే ఉండిపోయిందని గుర్తుచేశారు. అన్ని రూపాల ఉగ్రవాదాన్ని నేరంగా పరిగణించాలని, ఉగ్రవాదులు, వారి ఫైనాన్షియర్లు, మద్దతుదారులకు నిధులు, ఆయుధాలు, సురక్షిత స్థావరాలు లేకుండా చేయాలన్నదే సిసిఐటి ముఖ్యోద్దేశం.

DO YOU LIKE THIS ARTICLE?