HomeNewsBreaking Newsఈ దారుల్లో ప్రయాణించాలంటే… చుక్కలు చూడాల్సిందే

ఈ దారుల్లో ప్రయాణించాలంటే… చుక్కలు చూడాల్సిందే

అత్యవసర పరిస్థితులలో గాల్లో కలుస్తున్న ప్రాణాలు
చోద్యం చూస్తున్న ఎంఎల్‌ఎలు
ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు, స్థానిక ప్రజలు
ప్రజాపక్షం / కొడంగల్‌ / నవాబుపేట్‌
వికారాబాద్‌ జిల్లాలోని పలు దారుల్లో వెళ్లాలంటే పట్టపగలే చుక్కలు చూడాల్సిన దుస్థితి నెలకొంది. అత్యవసర పరిస్థితులలో పోవాలంటే ప్రాణాలు సైతం గాల్లో కలిసిపోతున్నాయి. ఇద్దరు ఎంఎల్‌ఎలు ఉండి కూడా రోడ్లను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కొడంగల్‌ నుంచి తాండూర్‌ వెళ్లే రహదారితో పాటు నవాబ్‌ పేట్‌ మండలం నుండి కొత్తగాడి మైసమ్మ టెంపుల్‌ వరకు వెళ్ళే మార్గంలో రోడ్లు సరిగ్గా లేకపోవడంస్థానిక ప్రజలు, వాహనదారులు నిత్యం ఇబ్బందులకు గురవుతున్నారు. గతంలో రేవంత్‌రెడ్డి కొడంగల్‌ ఎంఎల్‌ఎగా ఉన్న సమయంలో మహబుబ్‌నగర్‌ నుంచి తాండూర్‌ వరకు డబుల్‌ రోడ్డు మంజురు కాగా దాదాపు ఎనిమిదేళ్లు గడుస్తున్నా నేటికీ రోడ్డు మరమత్తులు చేయకపోవడంతో రోడ్డు పూర్తిగా ధ్వంసమై వాహనదారులు ప్రాణాలనుగుప్పిట్లో పెట్టుకుని వెళ్లాల్సిన దుర్భర పరిస్థితి ఏర్పడింది. కొడంగల్‌లో టిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఎ పట్నం నరేందర్‌రెడ్డి, తాండూర్‌లో పైలెట్‌ రోహిత్‌రెడ్డిలు ఉన్న రోడ్డును బాగుచేయించడంలో విఫలమయ్యారని స్థానికులు విమర్శిస్తున్నారు. కొడంగల్‌ నుంచి తాండూర్‌ వరకు నిత్యం వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయని, దుమ్ము దూళితో పాటు రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు పడటంతో వాహన దారులు ప్రమాదాలకు గురవుతున్నారు. అయినప్పటికీ అధికారులు రోడ్డు గుంతలను కనీసం పూడ్చటం చేయడం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా నవాబ్‌ పేట్‌ మండలం నుండి కొత్తగాడి మైసమ్మ టెంపుల్‌ వరకు వెళ్ళే మార్గంలో ఉన్న రోడ్డు దుస్థితి వల్ల ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపాటి వర్షం పడినా రోడ్డుపై ఉన్న గుంతల్లో నీళ్ళు నిలవడం, బురద వల్ల వాహన దారులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ రోడ్డు పరిస్థితి నాలుగేళ్లుగా ఇదే విధంగా ఉందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా నవాబ్‌పేట్‌ మండల కేంద్రంలో ఉన్న ఆదర్శ పాఠశాలకు వెళ్ళే దారి అధ్వాన్నంగా మారిందని, ఈ మార్గంలో విద్యార్థులు చెప్పులు చేతిలో పట్టుకుని వెళ్ళాల్సి వస్తుందంటున్నారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానిక ప్రజలు విమర్శిస్తున్నారు. మరోవైపు చిట్టిగిద్ద గ్రామం నుండి రైల్వే స్టేషన్‌కు వెళ్ళే దారిలో ఉన్న కల్వర్టు పనులు కూడా నెల రోజులైనా ఇంకా ప్రారంభం కాకపోవడం భాధాకరమంటున్నారు. స్థానిక ఎంఎల్‌ఎ, టిఆర్‌ఎస్‌ నాయకులు వచ్చి ఫోటోలు దిగడం, సమస్య పరిష్కారం అయిపోయిందని వెళ్లిపోవడం అలవాటుగా మారిందంటున్నారు. నాయకులకు ఫోటోలు దిగటంపై ఉన్న ధ్యాస పనులు పూర్తిచేయడంలో లేకపోవడం విడ్డూరంమంటున్నారు. జిల్లాలోని రోడ్లను బాగు చేయలేకపోతే వచ్చే ఎన్నికలలో టిఆర్‌ఎస్‌ పార్టీకి ఓటు వేయకూడదని ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments