పార్లమెంటు ఎన్నికల తర్వాతే పూర్తిస్థాయి బడ్జెట్
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచులు, ఉప సర్పంచులకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వాలి : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు
ప్రజాపక్షం / హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌కే పోతుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. ఏప్రిల్, మే నెలల్లో పార్లమెంటు ఎన్నికలు జరుగుతాయని, ఆ తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెడతామని ఆయన తెలిపారు. అప్పటివరకు గ్రామ పంచాయితీలకు విధులు, బాధ్యతలు అప్పగించే విషయంలో కొంత జాప్యం అనివార్యమవుతున్నదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే పూర్తి స్థాయి బడ్జెట్‌లోనే పంచాయితీలకు నిధులు కేటాయించడం సాధ్యమవుతుందన్నారు. ఆ లోగా సర్పంచులు, కార్యదర్శులకు పూర్థి స్థాయిలో శిక్షణ ఇచ్చి, గ్రామాభివృద్ధి కోసం పాటుపడే కార్యకర్తలుగా తీర్చిదిద్దాలని సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థ, ఆస్కి, ఎంసిఆర్‌హెచ్‌ఆర్‌డి తదితర సంస్థల ద్వారా శిక్షణ ఇప్పించాలని సిఎం సూచించారు. ప్రగ తిభవన్‌లో శుక్రవారం ముఖ్యమంత్రి కెసిఆర్ సర్పంచులు, పంచాయితీ కార్యదర్శులకు శిక్షణ ఇచ్చే అంశంపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ఎంఎల్‌ఎలు వేముల ప్రశాంత్ రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, కాలె యాదయ్య, సిఎంఒ ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ గ్రామాభివృద్ధిలో సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు ఇద్దరి పాత్ర చాలా కీలకమని, ప్రస్తుతం జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచులు, ఉప సర్పంచులకు ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. గ్రామాలను అద్బుతంగా తీర్చిదిద్దే విషయంలో వారికి సంపూర్ణ అవగాహన కల్పించాఆన్నారు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభత్ర పెంచడం లక్ష్యంగా కొత్తగా రూపొందిచిన చట్టంపై పంచాయితీలకు అవగాహన కల్పించాలని, ప్రతీ గామ పంచాయతీకి కొత్త చట్టం తెలుగు ప్రతులను పంపించాలని చెప్పారు. కొత్తగా నియామకమయ్యే పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు కలిసికట్టుగా పనిచేయడానికి అవసరమైన అవగాహన కల్పించాలని చెప్పారు. కొత్తగా ఎన్నికయ్యే సర్పంచులు మూస పద్ధతిలో కాకుండా, గ్రామాల సమగ్ర వికాసానికి పాటు పాడే ఉద్యమకారులుగా మారాలని సిఎం ఆకాంక్షించారు.