HomeNewsBreaking Newsఈనెలాఖరులో పోడు పట్టాలు

ఈనెలాఖరులో పోడు పట్టాలు

అడవులు నరకబోమని ఒప్పకున్నాకే…
సర్పంచ్‌, ఎంపిటిసిలతో పాటు అఖిలపక్ష నేతలు హామీ ఇవ్వాలి
షరతులకు ఒప్పుకోకుంటే పట్టాలివ్వబోం
11.5 లక్షల ఎకరాల పోడుభూములు పంపిణీ చేస్తాం
విద్యుత్‌, రైతుబంధు ఇస్తాం
ఒక్క గజం అటవీభూమి కబ్జాచేసినా పట్టాలు రద్దు
భూమిలేని గిరిజనబిడ్డలకు గిరిజన బంధు
అసెంబ్లీలో సిఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రకటన

ప్రజాపక్షం/హైదరాబాద్‌ ఈ నెలాఖరులో పోడు భూముల పట్టాలిస్తామని శుక్రవారం నాడు శాసనసభలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ప్రకటించారు. ఇకపై అడవులు నరికివేత ఉండదని అంతా ఒప్పుకున్నాకే పోడు భూములకు పట్టాలు ఇస్తామని స్పష్టం చేశారు. పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులకు, వాటిని ఇవ్వడానికి తమకేం అభ్యంతరం లేదని, 66 లక్షల ఎకరాల అటవీ భూ ముల్లో 11.5 లక్షల ఎకరాల పోడు భూములు ఉన్నాయన్నారు. పోడు భూములకు విద్యుత్‌, రైతుబంధు ఇస్తామన్నారు. గ్రామ స్థాయిలో సర్పంచ్‌, ఎంపిటిసిలతో పాటు అఖిలపక్ష నేతల నుంచి అడవుల నరికివేతపై తగిన హామీ వచ్చే దాకా పోడు భూముల పంపిణి చేపట్టబోమని తేల్చిచెప్పారు. అన్ని పార్టీల నేతలు ఒప్పుకుంటే 11.5 లక్షల ఎకరాలు పంపిణి చేస్తామన్నారు. ఈ షరతులకు ముందుకు రానివారికి పట్టాలు ఇవ్వబోమని ఖరాఖండిగా చెప్పారు. త్వరలోనే అఖిల పక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు. పోడు భూములకు పట్టాలు ఇచ్చిన తరువాత ఒక్క గజం కబ్జా చేసినా ఇచ్చిన పట్టాలు రద్దు చేస్తామన్నారు. పోడు భూములు రాని వారికి గిరిజన బంధు ఇస్తామని,
పోడు భూములకు రైతు బంధు, రైతు బీమా పథకాలు అమలు చేస్తామన్నారు. త్రీఫేస్‌ విద్యుత్‌ సౌకర్యం కూడా కల్పిస్తామని సిఎం స్పష్టం చేశారు. నెలాఖరుల నుంచి పోడు భూముల పంపిణి ఉంటుందని అసెంబ్లీ సమావేశాలలో భాగంగా శుక్రవారం వెల్లడించారు. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు పోడెం వీరయ్య, దనసరి అనసూయ(సీతక్క) మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కోయపోచగూడలో పోడు భూములు సాగు చేస్తున్న రైతులను కొట్టి, నిర్భందించి, అదిలాబాద్‌ జైలుకు పంపించిన అంశంపై పోడు భూముల సమస్యపై ప్రశ్నించారు. వారి ప్రశ్నలకు మంత్రి సత్యవతి రాథోడ్‌ సమాధానం ఇచ్చిన అనంతరం సిఎం మాట్లాడారు.
పోడు భూములు హక్కు కాదు దురాక్రమణ…
ప్రపంచ వ్యాప్తంగా గ్లోబల్‌ వార్మింగ్‌తో కర్భన వాయువులు పెరిగిపోతున్నాయన్నారు. వాతావరణ సమతుల్యంపై చర్చలు జరుగుతున్నాయని సిఎం కెసిఆర్‌ అన్నారు. పోడు భూముల హక్కులు అంటున్నారు. హక్కులు కాదని దురాక్రమణ అన్నారు. గతంలో ప్రభుత్వాలు సరిగ్గా చేయలేదన్నారు. గిరిజనులకు గత పాలకులు చేసిన మోసాలు అందరికీ తెలుసన్నారు. కొన్ని పార్టీలు జెండాలు పట్టుకొని, కలెక్టరేట్‌ల దగ్గర ధర్నాలు చేస్తున్నాయన్నారు. మొత్తం అడవులను కొట్టేద్దామా? అంటూ కెసిఆర్‌ ప్రశ్నించారు. పోడు భూములపై తమకు స్పష్టత ఉందన్నారు. సాగు చేసుకునేందుకు భూములను గిరిజనులకు ఇస్తామన్నారు. అడవులను నరికివేయడం సరైనదేనా?..పోడు భూముల వివాదానికి ముగింపు పలకాలా? వద్దా? మన కళ్ల ముందే అడవులు నాశనమైపోతున్నాయన్నారు. రాష్ట్రంలో అటవీ సంపద ఉండాలా? వద్దా? అనేదే ఇప్పుడు సమస్యగా మారిందని కెసిఆర్‌ అన్నారు. పోడు, అటవీ భూముల విషయంలో ఇప్పుడు లెక్కలు తేలాలన్నారు. చట్టం చేసి, మొక్కలు నాటడానికి ఎంతో కష్టపడ్డామన్నారు. కమ్యూనిస్టు మిత్రులు, భట్టి విక్రమార్కలు తనను కలిసి పోడు సమస్యలు చెప్పారని తెలిపారు. గిరిజనుల హక్కులను కచ్చితంగా కాపాడాల్సిందే అన్నారు. సర్వే కూడా పూర్తి చేసి అంతా సిద్ధం చేసి పెట్టామని చెప్పారు. పోడు భూముల పంపిణీ తర్వాత ఎవరికైనా భూములు రాకపోతే వారికి గిరిజన బంధు ఇస్తామని వెల్లడించారు. అడవులను కాపాడే బాధ్యత గిరిజన బిడ్డలే తీసుకోవాలన్నారు. అందరికీ న్యాయం చేస్తామన్నారు. పోడు భూముల సమస్యపై అఖిలపక్షం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ నెలాఖరు నుంచి పోడు భూముల పట్టాలు పంపిణీ ఉంటుందని సిఎం కెసిఆర్‌ సభకు వివరించారు.
అధికారులపై దాడులు చేస్తున్నారు
గుత్తికోయలను తీసుకువచ్చి అడవులను నరికివేయిస్తున్నారని సిఎం కెసిఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీనివాస్‌ అనే అటవీ అధికారిని పట్టపగలు నరికేశారన్నారు. అటవీ అధికారులపై దాడులు సరికాదన్నారు. గిరిజనులకు గత పాలకులు చేసిన మోసాలు అందరికీ తెలుసన్నారు. గిరిజనులపై దౌర్జన్యం జరుగకుండా చూస్తామన్నారు. ఖమ్మం జిల్లాలో కొందరు అగ్ర కులస్థులు గిరిజన యువతులను పెండ్లి చేసుకొని, అటవీ భూములను కబ్జాచేశారన్నారు. 10, 20 ఎకరాల పోడు భూములు ఎవరికైనా ఉంటాయా అని ప్రశ్నించారు. అటవీ ప్రాంతాల్లోని చెట్లను నరికేసి, భూమిని దున్నుకుంటూ పట్టాలు ఇవ్వాలని అడిగితే ఎలా ఇస్తారంటూ కెసిఆర్‌ ప్రశ్నించారు.
గిరిజనుల హక్కులు కాపాడాల్సిందే..
గిరిజనుల హక్కులు కాపాడాల్సిందేనని, అందులో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు. పోడుభూముల దురాక్రమణ జరుగుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అటవీ సంపద ఉండాలా, కనుమరుగు కావాలా అని ప్రశ్నించారు. నర్సాపూర్‌ అడవి ఎలా ఎడారైందో మనమంతా చూశామన్నారు. అడవుల పునరుజ్జీవనం చేసే ప్రక్రియ కొనసాగుతున్నదని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో 7.8 శాతం గ్రీన్‌ కవర్‌ పెరిగిందని ప్రశంసలు వస్తున్నాయని చెప్పారు. గిరిజనులపై పోలీసులు, అటవీ అధికారులు దాడిచేయవద్దని సూచించారు. అదేసమయంలో అధికారులపైనా గిరిజనుల దాడులు సహించబోమన్నారు. గుత్తికోయల గూండాగిరి మంచిది కాదని చెప్పారు. అడవిని నరికేసి భూములు ఇవ్వండని అడగడం సబబుకాదని వెల్లడించారు. ఇకనుంచి అటవీ ప్రాంతంలోని ఒక్క చెట్టును కూడా కొట్టనివ్వమని చెప్పారు. అడవుల నరికివేతకు ఎక్కడోచోట ఫులిస్టాప్‌ పడాలన్నారు. గజం అటవీ భూమి కూడా ఆక్రమణకు గురికావొద్దని, ఆక్రమణను సర్కార్‌ సహించదని తెలిపారు. అటవీ సరిహద్దులు పెట్టి సాయుధ దళాలతో పహారా ఏర్పాటుచేస్తామన్నారు. గిరిజనుల పేరుతో జరుగుతున్న దోపిడీని అరికట్టాలని సూచించారు.
దళితబంధు తరహాలోనే గిరిజన బంధు
పోడు భూముల విషయంలో తమకు స్పష్టత ఉందన్నారు. పోడు భూముల సర్వే పూర్తయిందని వెల్లడించారు. పంపిణీ చేశాక రైతుబంధు, విద్యుత్‌, సాగునీటి సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. అయితే భూములు తీసుకున్న గిరిజనులు ఇకనుంచి పోడు భూములను రక్షిస్తామని హామీ ఇవ్వాలన్నారు. చెట్లు నరకబోమని సంతకాలు పెడితేనే భూములు పంచుతామని చెప్పారు. తీర్మానానికి ముందుకురాని గ్రామాలకు పట్టాలిచ్చేది లేదన్నారు. భూముల పంపిణీ పూర్తయ్యాక అటవీ ప్రాంతాలను ఆక్రమిస్తే ఊరుకునేది లేదని, పట్టాలను రద్దుచేస్తామని స్పష్టం చేశారు. భూమిలేని గిరిజన బిడ్డలకు దళితబంధు తరహాలోనే గిరిజన బంధు ఇచ్చి సాయం చేస్తామన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments