HomeNewsBreaking Newsఇస్లామిక్‌ పాలనకు పిఎఫ్‌ఐ కుట్ర

ఇస్లామిక్‌ పాలనకు పిఎఫ్‌ఐ కుట్ర

భారత్‌ యువతను ఉగ్రవాదంవైపు ప్రేరేపణ
స్వాధీనపత్రాల్లో కీలక సమాచారం
10 మందిని కస్టడీకి ఇవ్వాలని కోర్టుకు ఎన్‌ఐఎ విజ్ఞప్తి
కోచి:
హింసాత్మకమైన జీహద్‌ ద్వారా దేశంలో ఇస్లామిక్‌ పరిపాలన స్థాపించేందుకు ఉగ్రవాద సంస్థ పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పిఎఫ్‌ఐ)పెద్ద కుట్ర చేసిందని నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజన్సీ (ఎన్‌ఐఎ) కోచిలోని ప్రత్యేక కోర్టుకు శనివారం తెలియజేసింది. దేశంలో అసంతృప్తి, అశాంతి వ్యాపింపజేసేందుకు కుట్ర చేసిందని తెలిపింది. ఒక వర్గానికి చెందిన నాయకులను లక్ష్యంగా చేసుకుందని తెలియజేసింది. బీహార్‌ రాజధాని పాట్నాలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ర్యాలీని భగ్నం చేసేందుకు, ఆయన హత్యకు విఫలయత్నం చేసిందని పేర్కొంది. పిఎఫ్‌ఐ కార్యాలయాలపైన, నాయకుల ఇళ్ళపైనా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టొరేట్‌తో కలిసి ఈనెల 22న సంయుక్త దాడులు చేసిన సందర్భంగా అనేక పత్రాలు స్వాధీనం చేసుకున్న ఎన్‌ఐఎ, అందులో ఉన్న కీలక సమాచారాన్ని ప్రత్యేక న్యాయస్థానాని కి తెలియజేసింది. వివిధ మతాలమధ్య చిచ్చే రేపేందుకు, అరాచకాలు చేసేందుకు పిఎఫ్‌ఐ పనిచేస్తున్నట్లు స్పష్టంగా వెల్లడవుతోందని పేర్కొంది. ఎన్‌ఐఎ అరెస్టు చేసిన 106 మంది పిఎఫ్‌ఐ నాయకులు, కార్యకర్తల్లో పదిమంది కీలక వ్యక్తులను న్యాయస్థానం ఎదుట ఎన్‌ఐఎ హాజరుపరిచింది. హింసాత్మకమైన జీహద్‌ ద్వారా భారతదేశంలో ఇస్లామిక్‌ పరిపాలన స్థాపించేందుకు వారు అతిపెద్ద కుట్ర చేశారని, ఈ కుట్రను కూలంకషంగా తెలుసుకోవాలంటే వారు కొద్దిరోజులపాటు తమ కస్టడీలో ఉండాలని, ఇంటరాగేషన్‌ నిమిత్తం వారిని తమ స్వాధీనానికి అనుమతించాలని ఎన్‌ఐఎ అధికారులు కోరారు. సమాజంలో కీలక వ్యక్తులు ఇందులో భాగస్వాములుగా ఉన్నారని, వారంతా చాలా పలుకుబడిగలవారని పేర్కొంది. దేశంలో యువతరాన్ని ఉగ్రవాద సంస్థల్లో చేరేలా పిఎఫ్‌ఐ ప్రేరేపిస్తోందని ఆ పత్రాల్లో కీలక సమాచారం లభించిందని, దేశంలో ఉన్న ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని వారిని హత్యమార్చడానికి కుట్రలు పన్నుతోందని, అందుకు వీలుగా శిక్షణలు ఇస్తోందని ఎన్‌ఐఎ న్యాయస్థానానికి తెలియజేసింది. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు తప్పుడు భాష్యాలు చెబుతూ ప్రజలో ఉన్న శాంతిని విచ్ఛిన్నచేసి విద్వేషం రగిల్చేందుకు యువతరాన్ని లష్కరే తోయిబా, అల్‌ఖైదా, ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ ఇరాక్‌, సిరియాలకు చెందిన ఐసిస్‌ వంటి ఉగ్రవాద సంస్ధలతో జట్టు కట్టించేందుకు కృషి చేస్తోందని ఎన్‌ఐఎ తెలిపింది. ఇదంతా పిఎఫ్‌ఐ హింసాత్మకజీహద్‌ కార్యకలాపాల లక్ష్యంలో భాగంగా చేస్తోందని తెలియజేసింది. గడచిన గురువారం ఎన్‌ఐఎ దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాలో జరిపిన దాడుల్లో కేరళలో 22మందిని, మహారాష్ట్ర (20), కర్ణాటక (20), తమిళనాడు (10), ఉత్తరప్రదేశ్‌ (8), అసోం (9), పుదుచ్చేరి (3), ఢిల్లీ (3), ఆంధప్రదేశ్‌ (5), మధ్యప్రదేశ్‌ (4), రాజస్థాన్‌లో మరో ఇద్దరిని అరెస్టు చేసింది.
పుణెలో ‘పాకిస్థాన్‌ జిందాబాద్‌’ నినాదాలు
వీడియో వైరల్‌ :60 మంది అరెస్టు
పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పిఎఫ్‌ఐ) కార్యకర్తలు పుణెలో పోలీసు అనుమతి లేకుండా నిరసన ప్రదర్శనలకు దిగారు. దీంతో పోలీసులు 60 మంది ప్రదర్శకులను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలోనే “పాకిస్థాన్‌ జిందాబాద్‌” నినాదాలతో ప్రదర్శనలుచేస్తున్న బృందం వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో కనిపించడంతో తీవ్ర ఆలజడి రేగింది. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణించి తక్షణ చర్యలు తీసుకుంది. ఈ నినాదాలు ఇచ్చినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే దీనిపై మాట్లాడుతూ ఈ విధమైన దేశ విద్రోహ చర్యలను సహించేది లేదని స్పష్టం చేశారు. ఉపముఖ్యమంత్రి,హోంమంత్రి దేవేంద్ర ఫడవీస్‌ కూడా ఒక ప్రకటనలో వారిని సహించేది లేదన్నారు. శుక్రవారం నిరసన ప్రదర్శన సందర్భంగా పిఎఫ్‌ఐ కార్యకర్తలు మూకుమ్మడిగా ఒక పోలీసు వాహనం మీదకు వచ్చారు. పుణె జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వెలుపల వారు నిరసన ప్రదర్శన జరిపారు. ఈ సందర్భంగా పోలీసులు 41 మందిని అరెస్టు చేశారు. పాక్‌ అనుకూల నినాదాలు చేసిన మొత్తం 60 మందిపై బండ్‌గార్డెన్‌ పోలీసులు వారిపై కేసు నమోదు చేసినట్లు డిసిపి సాగర్‌ పాటిల్‌ చెప్పారు. ఐపిసి 141,143,145,147,149,188, 341 సెక్షన్ల కింద వారిపై కేసులు నమోదు చేశామన్నారు. అనుమతి లేకుండా ప్రదర్శనలు, దేశ వ్యతిరేక నినాదాలు, ప్రభుత్వ అధికారుల ఉత్తర్వులు ఉల్లంఘించడం వంటి కారణాలపై వారిపై కేసులు నమోదయ్యాయి. ముఖ్యమంత్రి షిండే ఒక ట్వీట్‌ చేస్తూ, సంఘవ్యతిరేక శక్తుల పాకిస్థాన్‌ అనుకూల నినాదాలను ఖండించారు. పలువురు బిజెపి నాయకులు, శాసనసభ్యులు కూడా ఈ ఘటనను ఖండించారు. అణగారిన వర్గాలకు సాధికారత సాధించాలనే లక్ష్యం పేరుతో 2006లో పిఎఫ్‌ఐ సంస్థ దేశంలో ఆవిర్భవించింది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments