ఇస్రో ప్రైవేటీకరణ ఆత్మగౌరవ భంగం

ప్రభుత్వం నిర్ణయాన్ని విరమించుకోవాలి : సిపిఐ
న్యూఢిల్లీ : దేశానికి అత్యంత గర్వకారణమైన ప్రభుత్వరంగ సంస్థ అయిన ఇస్రో (భారత రోదసీ పరిశోధనా సంస్థ) కార్యకలాపాల్లోకి ప్రైవేటురంగాన్ని అనుమతిస్తున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ప్రధాన కార్యదర్శి డి. రాజా శనివా రం ఒక ప్రకటనలో ఖండించారు. ఇది మన దేశ స్వావలంబన, సార్వభౌమత్వ మనోభావాలకు విరుద్ధమని, భారత విజ్ఞాన శాస్త్ర ఆత్మగౌరవాన్ని గాయపరుస్తుందని ఆయన అన్నారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం పునరాలోచించాలని, ఇస్రో ప్రైవేటీకరణను ఆపుచేయాలని డిమాండ్‌ చేశారు. రాజా ప్రకటన ఇలా ఉంది… ప్రైవేటు పారిశ్రామికవేత్తలకు భారత రోదసీ పరిశోధనా సంస్థ (ఇస్రో) ద్వారాలు తెరవడంలో మరికొన్ని చర్యలను ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ఇస్రోకున్న ప్రాతిపదిక వసతులతో ప్రైవేటు సంస్థలకు సంబంధం నెలకొల్పేందుకు ‘నేషనల్‌ స్పేస్‌ ప్రమోషన్‌ అండ్‌ ఆథరైజేషన్‌ సెంటర్‌ (ఇన్‌ అనే పేరుతో కొత్త సంస్థను ఏర్పా టు చేసింది. ప్రైవేటు సంస్థలు తమ రోదసీ సంబంధ కార్యకలాపాలు నిర్వహించేందుకు గానూ ఇస్రోకున్న భూతల, అంతరిక్ష ఆధారిత, శాస్త్ర సాంకేతిక వనరులనేగాక, డేటాను సైతం ఉపయోగించుకునేందుకు ఈ సంస్థ వీలు కల్పిస్తుంది. ఇస్రో ప్రైవేటీకరణ, రోదసీ పరిశోధనను దాని అనువర్తింపులను అభివృద్ధి కొరకే వినియోగించాలన్న లక్ష్యాలకు విరుద్ధం. సుప్రసిద్ధ శాస్త్రవేత్త విక్రం సారాభాయి 1969లో వ్యవస్థాపించిన ఇస్రో పూర్వపు సోవియట్‌ యూనియన్‌ (యుఎస్‌ఎస్‌ఆర్‌) క్రియాశీల సహాయంతో కార్యకలాపాలు ఆరంభించింది. ఇస్రో అర్ధ శతాబ్దకాల అస్తిత్వంలో మన రోదసీ శాస్త్రవేత్తలు సాటిలేని శాస్త్రీయ విజయాలు సాధించారు. ప్రసిద్ధ పిఎస్‌ఎల్‌వి, జిఎస్‌ఎల్‌వి రాకెట్లు, చంద్రుడు, అంగారకుడు, ఇతర అంతర్‌ గ్రహాల పరిశోధనలకై ఉపగ్రహాల రూపకల్పన, ప్రయోగం ఆ సాఫల్యాల్లో ఉన్నాయి. ఆర్యభట్ట ఉపగ్రహ ప్రయోగంతో ఆరంభమైన ఇస్రో ప్రయాణం బహుళ వినియోగ ప్రయోగ వేదికలు (లాంచర్లు), క్రియోజనిక్‌ ఇంధనాలు, భారీ భూ అంతరిక్ష సంధాన రిమోట్‌ శాటిలైట్‌ డేటా, ఛాయాచిత్రాలు, రోదసీ టెక్నాలజీ అభివృద్ధి చేసే స్థాయికి చేరింది. ఈ టెక్నాలజీని ఇప్పుడు అనేక రంగాలు వినియోగించుకుంటున్నాయి. టెలీకమ్యూనికేషన్స్‌ (టివిలు, మొబైల్‌ ఫోన్‌ కమ్యూనికేషన్‌కు జియో శాటిలైట్‌ డేటా ఉపయోగిస్తున్నారు), రిమోట్‌ సెన్సింగ్‌ అప్లికేషన్స్‌ కొరకు రక్షణశాఖ, వాతావరణం, వ్యవసాయం, రవాణా నుంచి పట్టణాభివృద్ధి వరకు దాన్ని వినియోగించుకుంటున్న రంగాల్లో ఉన్నాయి. ఇస్రో 2016 ఆగస్టులో వాతావరణంలోని హైడ్రోజన్‌ (ఉదజని), ఆక్సిజన్‌ (ప్రాణవాయువు)లను ఇంధనంగా ఉపయోగించి సూపర్‌సానిక్‌ కంబస్టింగ్‌ రామ్‌జెట్‌ (స్క్రామ్‌జెట్‌) ఇంజిన్‌ను విజయవంతంగా పరీక్షించింది. ప్రపంచ విజ్ఞాన శాస్త్రంలో ఇటువంటి సాఫల్యం ఇదే ప్రథమం. అంగారకుడు, ఇతర గ్రహాలను తలపెట్టిన సుదీర్ఘమైన, మహావేగంతో కూడిన కార్యక్రమాల్లో ఈ ఇంధనం ఉపయోగించడం లక్ష్యం. ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన ధనం నుంచి పెట్టిన భారీ పెట్టుబడుల నుండి, వివిధ ప్రభుత్వరంగ జాతీయ పరిశోధనా సంస్థలు, ఐఐటిలు అభివృద్ధిలోకి తెచ్చిన అపారమైన జ్ఞాన సంపద నుండీ ఇవన్నీ సాధించబడినాయి.  రాకెట్లు పిఎస్‌ఎల్‌వి, జిఎస్‌ఎల్‌వి, శ్రీహరికోట ఉపగ్రహ ప్రయోగ వసతులు, భూమి సంబంధిత సమాచారమంతా (డేటా) ప్రైవేటు సంస్థలకు అందుబాటులో ఉంటుందని ఇస్రో చైర్మన్‌ శివన్‌ చెబుతున్నారు. జర్మనీ, జపాన్‌, స్వీడన్‌, యుకె (బిటన్‌) వంటి పశ్చిమ దేశాలకు వాణిజ్య ప్రాతిపదికపై ఉపగ్రహాలు ప్రయోగించడంలో భారత్‌ ఇప్పటికే క్రియాశీలంగా వ్యవహరిస్తోంది. ఇలోన్‌ మస్క్‌, రిఛర్డ్‌ బ్రాన్సన్‌ వంటి ప్రపంచ ప్రైవేటు సంస్థలవలే ఇస్రో కూడా ప్రైవేటు రంగంతో కలిసి లాభదాయకమైన వాణిజ్య ప్రాజెక్టులు, ఉపగ్రహ ప్రయోగాలు మొదలు పెట్టాలని కోరుకుంటున్నది. జాతీయ రోదసీ సంస్థలను కనీవినీ ఎరుగని రీతిలో, ఇంత ఉదారంగా ప్రైవేటీకరించడం నయా ఉదార ఆర్థిక సంస్కరణల్లో భాగం తప్ప మరొకటి కాదు. ఇది మన దేశ స్వావలంబన, సార్వభౌమత్వ మనోభావాలకు విరుద్ధం. భారత దేశ విజ్ఞాన శాస్త్ర ఆత్మగౌరవాన్ని గాయపరుస్తుంది.
అందువల్ల ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం సమీక్షించుకోవాలని, ఇస్రో ప్రైవేటీకరణను ఆపుచేయాలని సిపిఐ డిమాండ్‌ చేస్తున్నది.

DO YOU LIKE THIS ARTICLE?