ఆరోపణలపై రంజన్ గొగోయ్ ఖండన తక్షణ విచారణకు ఆదేశం
స్వతంత్ర న్యాయవ్యవస్థకు ముప్పు
న్యూఢిల్లీ: తనపై వచ్చిన లైంగికారోపణలను భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ఖండించారు. తాను లైంగిక వేధింపులకు పాల్పడ్డానన్న ఆరోపణలను నమ్మలేకపోతున్నానన్నా రు. భారత ప్రధాన న్యాయమూర్తి శనివారం సుప్రీంకోర్టు అసాధారణ విచారణను ఏర్పాటు చేశారు. దీని వెనుక చాలా పెద్ద కుట్ర దాగుంద ని, తాను ఆరోపణలను ఖండించడం మాత్రమే కాక దానికి తలొగ్గబోనని కూడా ఆయన స్పష్టంచేశారు. తనపై ఆరోపణలు వచ్చిన వెంటనే ఆయన విచారణకు వెంటనే ఆదేశాలిచ్చారు. స్వతంత్ర న్యాయవ్యవస్థ ప్రభావితం కాకుండా ఉండేందుకు నియంత్రణ, బాధ్యతలను ‘మీడి యా విచక్షణ’కే సుప్రీంకోర్టు వదిలేసింది. అత్యు న్నత న్యాయస్థానం శనివారం 30 నిమిషాలపాటు విచారణ జరిపి స్వతంత్ర న్యాయవ్యవస్థ ముప్పులో పడిందని పేర్కొంది. యోగ్యతలేని వ్యక్తులు భారత ప్రధాన న్యాయమూర్తిపైనే లైం గిక వేధింపుల ఆరోపణ చేశారని, దీని వెనుక భారత ప్రధాన న్యాయమూర్తి కార్యాలయాన్నే అస్థిరపరిచే కుట్రను కొన్ని ‘పెద్ద శక్తులు’ చేస్తున్నాయని అభిప్రాయపడింది. సుప్రీంకోర్టుకు చెందిన మాజీ ఉద్యోగిని భారత ప్రధాన న్యాయమూర్తిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసినట్లు కొన్ని న్యూస్ పోర్టళ్లలో కథనాలు ప్రచురించడంతో సుప్రీంకోర్టు శనివారం అసాధారణ విచారణ చేపట్టింది. ‘న్యాయవ్యవస్థను బలిపశువును చేయరాదని, మహిళ ఫిర్యాదులోని నిజానిజాలు పరిశీలించకుండానే మీడియా వార్తలను ప్రచురించరాదు’ అని సుప్రీంకోర్టు పేర్కొంది.
విచారణకు ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు : గొగోయ్ దగ్గర పనిచేసిన మాజీ జూ నియర్ అసిస్టెంట్ ఒకరు తనపై ఆయన లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదు చేసినట్లు కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వచ్చాయి. వీటిని సొలిసిటర్ జనరల్ తుషా ర్ మెహతా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో జస్టిస్ గొగోయ్ ఆధ్వర్యంలో ప్రత్యే క బెంచ్ ఏర్పాటై ఆరోపణలపై శనివారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా సిజెఐ గొగోయ్ మాట్లాడుతూ ‘నాపై వస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమైనవి. దీని వెనుక పెద్ద శక్తులే ఉన్నాయి. సిజెఐ కార్యాలయాన్ని అస్థిరపరిచేందుకు కుట్రలు చేస్తున్నారు. కానీ నేను ఎవరికీ భయపడను. ఈ కుర్చీలో కూర్చుని ఎలాంటి భయం లేకుండా విధులను నిర్వర్తిస్తాను. న్యాయమూర్తిగా 20ఏళ్ల పాటు నిస్వార్థమైన సేవ చేసిన తర్వాత నా బ్యాంకు ఖాతాలో రూ. 6.80లక్షలు ఉన్నాయి. ఇది నా ప్రావిడెంట్ ఫండ్‌లోని రూ. 40 లక్షలు కాక. నాపై అవినీతి ఆరోపణలు చేయలేకే ఇలాంటి చర్యలకు పాల్పడుతు న్నారు. ఇవి చాలా దూరం వెళ్లడంతో నేను ఈ రోజు ఇక్కడ కూర్చోవాల్సి వచ్చింది’ అని అన్నారు. ఈ చర్యలతో న్యాయవ్యవస్థ స్వతంత్రత పెను ప్రమాదంలో పడిందని, ఇలాంటి నిరాధార ఆరోపణలతో న్యాయవ్యవస్థపై ప్రజలకున్న విశ్వాసం తగ్గిపో తుందని అన్నారు.‘వచ్చే వారం అనేక సున్నిత కేసులను తన నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరుపనున్న నేపథ్యంలో ఈ లైంగిక వేధింపుల ఆరోపణ వచ్చిందని, ఇదే నెల దేశంలో లోక్‌సభ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి’ అని భారత ప్రధాన న్యాయ మూర్తి తెలిపారు. ధర్మాసనంలో భారత ప్రధాన న్యాయమూర్తితోపాటు న్యాయమూ ర్తులు అరుణ్ మిశ్రా, సంజీవ్ ఖన్నా కూడా ఉన్నారు. ధర్మాసనానికి ప్రధాన న్యాయ మూర్తి రంజన సారథ్యం వహించినప్పటికీ కోర్టు తీర్పును జారీ చేసే అధికా రాన్ని అరుణ్ మిశ్రాకు ఇచ్చారు. న్యాయమూర్తి తీర్పును వినిపిస్తూ ‘ ఈ విషయాన్ని పరిశీలించాక, ప్రస్తుతం కోర్టు ఉత్తర్వును మేము జారీచేయడంలేదు. నిగ్రహం చూపాల్సిన బాధ్యతను మీడియా విచక్షణకే వదిలేస్తున్నాం. ఏది ప్రచురించాలో, ఏది ప్రచురించకూడదో నిర్ణయించాల్సిన బాధ్యత వారికే వదిలేస్తున్నాం. ఘోరమైన, నిందా పూర్వక ఆరోపణలు స్వతంత్ర న్యాయవ్యవస్థ ప్రతిష్టకు తీరని నష్టం కలిగిస్తుంది’ అని పేర్కొన్నారు. తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణకు ఆయన చాలా బాధపడి ‘దేశ న్యాయవ్యవస్థ తీవ్రమైన ముప్పులో పడిందని, న్యాయవ్యవస్థకు ప్రమాదాన్ని తా ము అనుమతించబోము’ అని చెప్పారు. భారత ప్రధాన న్యాయమూర్తి కాకముందు ఆయన గౌహతి హైకోర్టు, పంజాబ్, హర్యాణా హైకోర్టులలో పనిచేశారు. మహిళ ప్ర మాణపూర్వక అఫిడవిట్‌ను దాఖలు చేయడంతో రంజన్ గొగోయ్ నేతృత్వంలో ముగ్గు రు న్యాయమూర్తులున్న ప్రత్యేక ధర్మాసనాన్ని విచారణ కోసం ఏర్పాటుచేశారు. రంజ న్ గొగోయ్ భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన కొన్ని రోజులకే…2018 అక్టోబర్‌లో తనపై లైంగిక వేధింపు జరిగిందంటూ మాజీ ఉద్యోగిని ఆరోపించింది. ఆ యన మరింత చొరవతీసుకుంటుండంతో తాను ఎదురుతిరగడంతో తనను ఉద్యోగం నుంచి తీసేశారని ఆమె పేర్కొంది. హెడ్ కానిస్టేబుళ్లయిన తన భర్త, మరిదిని 2012లో పరస్పరం రాజీతో ముగిసిన క్రిమినల్ కేసులో సస్పెండ్ చేశారని కూడా పేర్కొంది. ఆ తర్వాత ప్రధాన న్యాయమూర్తి ఇంటిలో గొగోయ్ భార్య ముందు సాష్టాంగపడి ము క్కును నేలకు రాసేలా చేశారంది. వికలాంగుడైన తన మరిదిని కూడా సుప్రీంకోర్టు విధుల నుంచి తొలగించారని పేర్కొంది. ఓ చీటింగ్ కేసులో తన భర్త, ఇతర బం ధువులతో సహా తనని పోలీస్ స్టేషన్లో నిర్బంధించి శారీరకంగా హింసించారని, దు ర్భాషలాడారని కూడా ఆ మహిళ ఆరోపించింది. ఆమె రాసిన ఉత్తరాలు అనేక మంది సిట్టింగ్ జడ్జీలకు అందాయి. ఇదిలా ఉండగా ఆ మహిళ చేసిన ఆరోపణలన్నీ దురు ద్దేశపూరితంగా చేసినవేనని, వాటికి ఆధారాలు లేవని సుప్రీంకోర్టు ప్రధాన కార్యదర్శి సంజీవ్ సుధాకర్ కల్గోంకర్ చెప్పారు. ‘నిస్సందేహంగా ఇది దురుద్దేశపూరిత ఆరోపణ’ అని చెప్పారు.