ఆరుగురు మృతి, డజన్ల మందికి పైగా గాయాలు
రోమ్ : ఇటలీ రాజధాని రోమ్‌లో తొక్కిసలాట చోటు చేసుకుంది. శనివారం తెల్లవారుజామున ఓ ఇటాలియన్ నైట్‌క్లబ్‌లో సంగీత కచేరి సాగుతుండగా అలజడి చెలరేగడంతో కచేరికి హాజరైన వారంతా భయాందోళనతో బయటకు పరుగులు పెట్టారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఆ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. డజన్ల మందికి పైగా గాయాలయ్యాయి. మృతుల్లో ఐదుగురు 18 ఏళ్ల లోపు ఉన్న వారు ఉన్నారు. అందులో ఇద్దరు బాలికలు, ఇద్దరు బాలురు కాగా, తన కూతురులతో కచేరీకి హాజరైన ఓ మహిళా కూడా ఉన్నారు. మధ్య ఇటలీలోని అంకోనా సమీపంలో ఉన్న కొరినాలడ్లో పట్టణంలో జరుగుతున్న కచేరీ కార్యక్రమంలో అనుమానితుడు పెప్పెర్ స్ప్రే వంటి పదార్థాన్ని వెదజల్లడంతో గందరగోళం జరిగినట్లుగా మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. కచేరీకి హాజరైన వారిని చెదలగొట్టేందుకు పెప్పెర్ స్ప్రే వంటి పదార్థాన్ని వెదజల్లడంతో అక్కడ ఉన్న యువత అంతా పరిపోయేందుకు ప్రయత్నంచారని అగ్నిమాపక శాఖ ట్విట్టర్ ద్వారా ఒక ప్రకటనను విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే ఒకరినొకరు తోసుకోవడంతో తొక్కిలాట జరిగిందని పేర్కొంది. క్షతగాత్రుల్లో 14 మంది పరిస్థితి విషమంగా ఉందని, మరో 40 మంది పరిస్థిథి నిలకడగా ఉన్నట్లు స్థానిక అగ్నిమాపక శాఖ చీఫ్ డినో పొగ్యాలి తెలిపారు. అత్యంత రద్దీగా ఉన్న నైట్‌క్లబ్‌లో గందరగోళం నెలకొడంతో ప్రజలంతా మూడు అత్యవసర మార్గాల ద్వారా బయటకు పరుగులు తీశారని, అయితే అందులో ఒకటి చిన్న వంతెనకు, కారు పార్కింక్ వద్దకు వెళ్తుందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కాగా, ఈ తొక్కిసలాట స్థానిక కాలమానం ప్రకారం రాత్రి ఒంటిగంటకు చోటు చేసుకుంది. కొరినాల్డో పట్టణంలోని బ్లూ లాంటర్న్ నైట్ క్లబ్‌లో ఇటాలియన్ రాప్ సింగర్ స్ఫెరా ఎబస్టా ప్రదర్శనకు దాదాపు వెయ్యి మందికి పైగా యువత హాజరయ్యారు. అంతా నృత్యాలతో కోలాహలంగా గడుపుతున్నామని, ఉన్నట్టుండి ఏదో గాఢమైన వాసన వచ్చిందని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 16 ఏళ్ల కుర్రాడు వెల్లడించాడు. అంతా ఎమర్జెన్సీ ద్వారం వైపు పరుగులు పెట్టామని, కానీ అక్కడి నుంచి వెళ్లడం సాధ్యం కాలేదని, బౌన్సర్లు వెనక్కి పంపారని చెప్పాడు. అంతా ఇష్టం వచ్చినట్లు పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగిందని అధికారులు వెల్లడించారు.