ఇక సకలజనుల సమరభేరి

ఆర్‌టిసి సమ్మె మరింత ఉధృతం ఈనెల 21 నుంచి 30 వరకు జెఎసి కార్యాచరణ

ప్రజాపక్షం/హైదరాబాద్‌ :  ఆర్‌టిసి సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం దిగిరాకపోవడంతో ఇక ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందు కు ఆర్‌టిసి కార్మికుల జెఎసి సన్నద్ధమైంది. “ప్రజా ప్రతినిధుల ములాఖత్‌” పేరుతో సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి కెసిఆర్‌పై ఒత్తిడి పెంచి తమ సమ్మెకు మద్దతు ఇవ్వాలని ప్రజాప్రతినిధులను కోరనున్నారు. ఈ నెల 30న “సకల జనుల సమరభేరి” మోగించనుంది. ఈ నెల 21 నుంచి 30 వర కు ఆర్‌టిసి జెఎసి కార్యాచరణను ప్రకటించింది. ఇప్పటి వరకు జరిగిన సమ్మెలో ఆర్‌టిసి కార్మికులు పాల్గొనగా ఇక నుంచి వారి కుటుంబ సభ్యులను కూడా ఉద్యమంలోనికి దింపాలని నిర్ణయించారు. ఈ కార్యాచరణకు అఖిలపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు కూడా మద్దతు ఇవ్వడంతో పాటు ప్రత్యక్షంగా పాల్గొనున్నట్లు ప్రకటించాయి. ఆర్‌టిసి జెఎసి అధ్వర్యంలో హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అఖిలపక్ష, ప్రజాసంఘాలతో సమావేశం జరిగింది. జెఎసి కన్వీనర్‌ ఇ.అశ్వద్ధామరెడ్డి, కో- కె.రాజిరెడ్డి అధ్యక్షత జరిగిన సమావేశంలో అఖిలపక్ష పార్టీల నేతలు చాడ వెంకట్‌రెడ్డి, ఎన్‌.బాలమల్లేశ్‌, డాక్టర్‌ డి.సుధాకర్‌ (సిపిఐ), తమ్మినేని వీరభద్రం, డి.జి.నర్సింహా (సిపిఐ(ఎం)), వి.హనుమంతరావు (కాంగ్రెస్‌), ప్రొఫెసర్‌ ఎం.కోదండరామ్‌, ప్రొఫెసర్‌ పి.ఎల్‌. విశ్వేశ్వర్‌రావు (టిజెఎస్‌), ఎ.పి.జితేందర్‌రెడ్డి (బిజెపి), ఎల్‌. రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి (టిడిపి), కె. రమ, (సిపిఐ(ఎంఎల్‌-న్యూడెమోక్రసీ)), డాక్టర్‌ చెరు కు సుధాకర్‌ (టిఇపి), కె వెంకటేశ్వర్‌రావు (సిపిఐ-ఎం.ఎల్‌న్యూడెమోక్రసీ), మంద కృష్ణమాదిగ (ఎంఆర్‌పిఎస్‌), మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తో పాటు జెఎసి కో- వి.ఎస్‌.రావు, సుధ తదితరులు పాల్గొన్నారు. ఆర్‌టిసి సమ్మెలో భాగం గా చేపట్టిన రాష్ట్రబంద్‌ను జయప్రదం చేసిన అన్ని వర్గాలకూ జెఎసి ధన్యవాదాలు తెలిపింది. అలాగే బంద్‌ సందర్భంగా పోలీసులు వ్యవహారించిన తీరును ఖండించింది. పోలీసుల తీరుతో న్యూడెమోక్రసీ నేత పోటు రంగారావు బొటనవేలు తెగిపోయిందని, దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని సమావేశం డిమాండ్‌ చేసింది. చర్చలకు ఆహ్వానించాలని హైకోర్టు సూచించినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా కార్యాచరణను రూపొందించారు.
అల్లకల్లోలం సృష్టించే ప్రయత్నం : అశ్వద్ధామ
ఉద్యమకారులను ప్రభుత్వం భయబ్రాంతులకు గురిచేసి, అల్లకల్లోలం సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆర్‌టిసి జెఎసి కన్వీనర్‌ ఇ.అశ్వద్ధామరెడ్డి విమర్శించారు. దమనకాండను వెంటనే ఆపాలన్నారు. పోరాటం చేయకపోతే సిఎంతో మిలాఖత్‌ అని అంటారని, అదే పోరాటం చేస్తే ప్రతిపక్షాలు చేపిస్తున్నాయని ప్రచారం చేస్తారని, తాము ఇలాంటి ప్రచారాలను పట్టించుకోబోమని, విజయం సాధించేవరకు తమ పోరాటం ఆగదన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?