14 రోజుల తర్వాతే విధులు
అప్పటి వరకు ఇంట్లోనే
రోజు వారీ సాధారణ విధుల దిశగా ఠాణాలు
ప్రజాపక్షం/హైదరాబాద్: ఇప్పటి వరకు ‘కరోనా” లాక్డౌన్ కాలంలో సేవలందించిన పోలీసులు ‘హోమ్ క్వారంటైన్’కు వెళ్లనున్నారు. సుమారు 14 రోజుల తర్వాతే వారు సాధారణంగా రోజువారీ విధులకు హాజరుకానున్నారు. ఇప్పటి వరకు కరోనా లక్షణాలు కలిగిన వారు మాత్రమే హోమ్ క్వారంటైన్లో ఉండగా, తాజాగా ఆ ప్రభావానికి అవకాశం ఉన్న పోలీసులు కూడా వెళ్తున్నారు. లాక్డౌన్ సడలిలపుల నేపథ్యంలో కంటైన్మెట్ జోన్లు మినహా రాష్ట్ర వ్యాప్తంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో లాక్డౌన్ సేవల కోసం పెద్ద ఎత్తున పోలీసులు ఉండాల్సిన అసవరం లేకుండా పోయింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు తమ రోజు వారి సాధారణ పనుల్లో నిమగ్నం కానున్నారు. అయితే కొందరు పోలీసులను మాత్రం హోమ్ క్యారంటైన్కు పంపించాలని పోలీసు శాఖ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా కంటైన్మెంట్ జోన్లు, సమస్యాత్మక ప్రాంతాలు, కరోనా వైరస్ చికిత్స అందించిన ఆస్పత్రులు, అలాగే కరోనా వైరస్ సోకిన వారిని ఆసత్ప్రికి తరలించిన పోలీసు సిబ్బందిని ‘హోమ్ క్యారంటైన్’కు పంపించనున్నారు. కొన్ని జిల్లాల సరిహద్దుల వద్ద ఉన్న వారిని కూడా హోమ్ క్యారంటైన్కు పంపిస్తున్నారు. వీరిలో కరోనా లక్షణాలు లేకపోయినప్పటికీ నేరుగా వారిని సాధారణ విధులకు హాజరుకాకుండా జాగ్రత్త పడుతోంది. కరోనా లక్షణాలు లేకపోయినా కొందరికి కరోనా పాసిటివ్ కేసులు నమోదు కాగా, మరి కొందరిలో జ్వరం, దగ్గు, జలుబు ఉన్నప్పటికీ కరోనా పాజిటివ్ రాలేదని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ‘కరోనా వైరస్’ సేవలు అందించిన వారిని ముందుగా హోమ్ క్యారంటైన్కు పంపించనున్నారు. తద్వారా ఎవరికైనా కరోనా వైరస్ సోకినా పెద్దగా వ్యాప్తి చెందే అవకాశాలు ఉండబోవని పోలీసు శాఖ భావిస్తుంది. కాగా కంటైన్మెంట్ జోన్, కరోనా వైరస్ ఆస్పత్రుల వద్ద విధులను నిర్వహిస్తున్న పోలీసులు పూర్తిగా వ్యక్తిగత రక్షణ చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ ముందస్తు చర్యల్లో భాగంగా కరోనా వైరస్ విధులను నిర్వహించిన పోలీసులు మరో 14 రోజుల తర్వాతనే సాధారణ విధులకు హాజరుకానున్నారు. మరోవైపు పోలీసు ఠాణాలు ఇక సాధారణ సేవలకు సన్నద్ధమయ్యాయి. ఇప్పటి వరకు కరోనా వైరస్ సేవలో నిమగ్నమైన పోలీసులు ఇక నుండి రోజువారీ సాధారణ విధులకు సిద్ధమయ్యారు.