ఇకపై చర్చల్లేవ్‌

ఆర్‌టిసి సమ్మె చట్ట విరుద్ధం
సమ్మెను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ గుర్తించం
స్టేజీ క్యారేజీ బస్సులకు రూట్‌ పర్మిట్లు ఇవ్వాలి
సమ్మెపై సమీక్షలో తెగేసి చెప్పిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు
హైదరాబాద్‌ : ఆర్‌టిసి సమ్మె చట్ట విరుద్ధంగా జరుగుతున్నదని, సమ్మెను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ గుర్తించదని, సమ్మె చేస్తున్న వారి తో చర్చలు కూడా జరపదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెగేసి చెప్పా రు. తమంతట తాముగా అనధికారికంగా విధులకు గైర్హాజరైన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి ఉద్యోగాల్లో చేర్చుకునే ప్రసక్తే లేదని ప్రకటించారు. సమ్మెలో పాల్గొనకుండా విధులు నిర్వర్తిస్తు న్న వారికి సంబంధించి సెప్టెంబర్‌ మాసం జీతా లు చెల్లించాలని అధికారులను ఆదేశించారు. ఆర్‌టిసి సమ్మె వల్ల ఉత్పన్నమైన పరిస్థితులపై ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రగతి భవన్‌లో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు పువ్వాడ అజయ్‌ కుమార్‌, పి.సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, సీనియర్‌ అధికారులు సునిల్‌ శర్మ, నర్సింగ్‌ రావు, సందీప్‌ సుల్తానియా, ట్రాన్స్‌పోర్టు జాయింట్‌ కమిషనర్లు జి. పాండురంగ నాయక్‌, సి. రమేశ్‌, మమతా ప్రసాద్‌, డిటిసిలు ప్రవీణ్‌ రావు, పాపారావు, ఆర్‌టిసి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు టి.వి. రావు, ఇ.యాదగిరి, వినోద్‌, వెంకటేశ్వర్లు, రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు. మూడు రోజుల్లో వందకు వంద శాతం ఆర్‌టిసి బస్సులు నడిచి తీరాలని, ఇందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్‌ అధికారులను ఆదేశించారు. 50 శాతం ఆర్‌టిసి బస్సులు నడపడానికి అవసరమైన సిబ్బందిని వెంటనే నియమించాలని, 30 శాతం బస్సులను అద్దె ప్రాతిపదికన, 20 శాతం ప్రైవేటు బస్సులకు స్టేజీ క్యారేజీలుగా రూట్‌ పర్మిట్లు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. బస్సులు వందకు వంద శాతం పునరుద్ధరించడానికి కొద్ది రోజులు పట్టే అవకాశం ఉండడంతో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు దసరా సెలవులను ఈ నెల 19 వరకు పొడిగిస్తున్నట్లు సిఎం ప్రకటించారు. ఆర్‌టిసిలో వందకు వందశాతం బస్సులను పునరుద్ధరించాలని, దీనికోసం అసవరమైన సిబ్బందిని వెంటనే తీసుకోవాలి. రిటైర్డ్‌ ఆర్‌టిసి డ్రైవర్లు, రిటైర్డ్‌ పోలీస్‌ డ్రైవర్లను ఉపయోగించుకోవాలని, బస్సులు, భారీ వాహనాలు నడిపిన అనుభవం కలిగిన వారిని పనిలోకి తీసుకోవాలని, అధికారులు రేయింబవళ్లు పనిచేసి, మూడు రోజుల్లో వందకు వంద శాతం బస్సులు నడిచేలా చూడాలని సిఎం అన్నారు.
యూనియన్‌ నేతల పిచ్చి మాటలు నమ్మి కార్మికులు ఉద్యోగాలు వదులుకున్నారు
ఆర్‌టిసి యూనియన్‌ నాయకుల పిచ్చిమాటలు నమ్మి కార్మికులు అనధికారికంగా గైర్హాజరై తమంతట తామే ఉద్యోగాలు వదులుకున్నారే తప్ప ఎవరినీ ఎవరూ డిస్మిస్‌ చేయలేదని ముఖ్యమంత్రి కెసిఆర్‌ అన్నారు.“గతంలో ఎన్న డూ లేని విధంగా సూపర్‌ వైజర్లను కూడా సమ్మెలోకి లాగారు. యూనియన్‌ నాయకులు అత్యంత బాధ్యతారహితంగా వ్యవహరించి 48 వేల మంది ఉద్యోగాలు పోయేలా చేశారు. విధులకు హాజరుకాని వారిని తిరిగి విధుల్లోకి తీసుకునే అవకాశమే లేదు. వారితో చర్చలు జరిపే ప్రసక్తే లేదు, ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు. పండుగ సమయంలో ప్రజలను ఇబ్బందులకు గురిచేసి, ఆర్‌టిసిని నష్ట పరిచిన కార్మికులను క్షమించే ప్రసక్తే లేదు. అసలు వారు చేస్తున్నది సమ్మె కానే కాదు. అది చట్ట విరుద్ధమైన ప్రజలకు అసౌకర్యం కల్పించే చర్య మాత్రమే. ఈ విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుంది. విధులకు హాజరైన ఉద్యోగులు, కార్మికుల సెప్టెంబర్‌ నెల జీతం వెంటనే విడుదల చేస్తాం” అని ముఖ్యమంత్రి ప్రకటించారు.
చట్టవిరుద్ధ సమ్మెకు రాజకీయ పక్షాలు మద్దతివ్వడం అనైతికం : అర్థరహిత డిమాండ్లతో, చట్ట విరుద్ధంగా కార్మికులు చేస్తున్న సమ్మెకు రాష్ట్రంలో కొన్ని రాజకీయ పక్షాలు మద్దతు ఇవ్వడం అనైతికమని సిఎం కెసిఆర్‌ అన్నారు. “ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ, న్యాయ సమ్మతం కాని కోర్కెలతో సమ్మె చేసే వారికి మద్దతిచ్చే రాజకీయ పక్షాలకు ప్రజల మద్దతు లేదు. అసలు రాష్ట్రంలో సరైన ప్రతిపక్షమే లేదు. రాష్ట్రంలో పరిస్థితి నాదాన్‌ దుష్మన్‌ అనే విధంగా ఉంది. రాజకీయ ప్రయోజనం కోసం గోతికాడి నక్కల్లా ఎదురు చూస్తున్నాయి. వారి ఆశ ఫలించదు. సమ్మెకు మద్దతు ఇస్తున్న పార్టీలకు ప్రజల నుంచి ఛీత్కారం తప్పదు. గతంలో అనేక విషయాల్లో తప్పుడు వైఖరి అవలంభించడం వల్లే వారు ప్రజల మద్దతు కోల్పోయారు. ఆర్‌టిసి విషయంలో కూడా అలాగే జరుగుతుంది. ఇక్కడ ఆర్‌టిసి కార్మికులు కోరుతున్న డిమాండ్లలో వేటిని కూడా ఆయా రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేయడం లేదు. ప్రజలు ఈ విషయాన్ని గమిస్తున్నా రు” అని ముఖ్యమంత్రి విమర్శించారు.
కేంద్రంలో బిజెపి ప్రైవేటీకరణ విధానాలు తెలియదా?
“బిజెపి నాయకులు ఇక్కడ బాగా మాట్లాడుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఇండియన్‌ రైల్వేను ప్రైవేటీకరిస్తున్నది. ఎయిర్‌ లైన్స్‌ను ప్రైవేటీకరించింది. చివరికి సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ను కూడా ప్రైవేటీకరించింది. రైళ్లను ప్రైవేటీకరిస్తున్నది. వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరించుకోవడం ద్వారా నిధులు సమకూర్చుకుంటామని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లోలోనే చెప్పింది. అక్కడి వారి ప్రభుత్వం ఇలా చేస్తుంటే, ఇక్కడి ఆ పార్టీ నాయకులు మాత్రం అందుకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు” అని కెసిఆర్‌ అన్నారు.
ప్రభుత్వం చలించదు,- భయపడదు
“ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని యూనియన్లుగా చెప్పుకునే వారు ప్రకటిస్తున్నారు. ఉధృతం చేసినా, పిల్లిమొగ్గలు వేసినా ప్రభుత్వం చలించదు. బెదిరింపులకు భయపడదు. బస్సులు నడిపి, ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుంది. బస్సులను ఆపి, బస్టాండ్లు, బస్‌డిపోల వద్ద అరాచకం చేద్దామని చూస్తే సహించేది లేదు. గూండాగిరి నడవదు. ఇప్పటి వరకు ప్రభుత్వం కాస్త ఉదాసీనంగా ఉంది. ఇకపై కఠినంగా వ్యవహరిస్తుంది. బస్‌ స్టాండ్లు, బస్‌డిపోల వద్ద ఎవరు బస్సులను ఆపినా, విధ్వంసం సృష్టించినా వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
కేసులు పెట్టి కోర్టుకు పంపాలి : సమీక్ష సమావేశం నుంచే ముఖ్యమంత్రి కెసిఆర్‌ డిజిపి మహేందర్‌ రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. “ప్రతీ ఆర్‌టిసి డిపో, బస్టాండ్ల వద్ద పోలీసు బందోబస్తును పెంచండి. అన్ని చోట్ల సిసి కెమెరాలు పెట్టండి. మహిళా పోలీసులను కూడా బందోబస్తు కోసం వినియోగించండి. నిఘా పోలీసులనూ ఉపయోగించండి. ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వారిని, బస్సులను ఆపేవారిని, ఇతర చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారిని గుర్తించి, కేసులు పెట్టి, కోర్టుకు పంపాలి. ఉద్యమం పేరిట విధ్వంసం చేస్తే ఉపేక్షించాల్సిన అవసరం లేదు” అని డిజిపిని సిఎం ఆదేశించారు.
కాగా “మూడు నాలుగు రోజుల్లోనే వందకు వంద శాతం ఆర్‌టిసి బస్సులు నడుస్తాయి. అప్పటి వరకు విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల సెలవులను ఈ నెల 19 వరకు పొడిగిస్తున్నాం. సిలబస్‌ నష్టపోకుండా భవిష్యత్తులో రెండో శనివారం విద్యా సంస్థలు నడపాలి. అవసరమైతే ఇతర సెలవులను తగ్గించుకోవాలి. 21వ తేదీ నుంచి అన్ని బస్సులు అందుబాటులోకి వస్తాయి. బస్‌ పాస్‌ విషయంలో ఒక్క విద్యార్థి కూడా బాధ పడొద్దు. కాబట్టి బస్‌ పాసులున్న విద్యార్థులు యధావిధిగా తమ విద్యాసంస్థలకు వెళ్లవచ్చు” అని సిఎం ప్రకటించారు.

DO YOU LIKE THIS ARTICLE?