ఇంధన ధరలపై స్పందనేదీ?

ఇదే వైఖరితో ఉంటే దేశ వ్యాప్తంగా ప్రజా ఆందోళన ఉధృతం
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి హెచ్చరిక
సిలిండర్ల శవ యాత్ర: ఆటోలను తాళ్లతో లాగుతూ వినూత్న నిరసన
సామాన్యులను దోచుకునేందుకు మోడీ ప్రభుత్వం కుట్ర
ప్రజాపక్షం/హైదరాబాద్‌ రాష్ర్టంలో రోజురోజుకూ ఇంధన ధరలు పెరుగుతుంటే ముఖ్యమంత్రి కెసిఆర్‌ స్పందించకుండా ఎందుకు మౌనం వహిస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. సామాన్య ప్రజలను దోచుకునేందకే మోడీ ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరలను నిరవధికంగా పెంచుతోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఇదే వైఖరితో ఉంటే దేశ వ్యాప్తంగా ప్రజా ఆందోళన ఉధృతమవుతుందని, మోడీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. తరచుగా పెంచుతున్న పెట్రోల్‌, డీజిల్‌, ఎల్‌పిజి సిలిండర్ల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ సిపిఐ హైదరాబాద్‌ జిల్లా సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్‌, హిమాయత్‌నగర్‌లో సిలిండర్ల శవయాత్ర, ఆటోలను తాళ్లతో లాగుతూ, బైకులను నెట్టుకుం టూ వినూత్నంగా నిరసన ప్రదర్శన నిర్వహించింది. చాడ వెంకట్‌రెడ్డి, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపి సయ్యద్‌ అజీజ్‌పాషా, సిపిఐ హైదరాబాద్‌ జిల్లా కార్యదర్శి ఇటి నరసింహ తదితరులు తాళ్లతో ఆటోను లాగారు. ఈ ప్రదర్శన ఎఐటియుసి కార్యాలయం నుంచి ప్రారంభమై మఖ్దూంభవన్‌ వరకు కొనసాగింది. ‘పెంచిన ఇంధన, వంట గ్యాస్‌ ధరలను తగ్గించాలని, పెట్రో ధరలు పెంచి పగటి దోపిడీ చేయడం ఆపాలని, బిజెపి పాలనలో అచ్చేదిన్‌ కాదు సచ్చేదిన్‌, కార్పొరేట్లకు వరాల జల్లు పేదలపై పన్నులమోత, సామాన్యులపై భారం తగ్గించండి” అంటూ పెద్దపెట్టున దారిపొడవునా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అడ్డూ అదుపు లేకుండా నిరంతరంగా ఇంధన చార్జీలను పెంచడంతో పేద ప్రజల నడ్డి విరుగుతోందన్నారు. ఆర్థిక మాంద్యం, కరోనా మహమ్మారి వల్ల ఉపాధిలేక ప్రజల జీవితాలు రోడ్డున పడ్డాయని, ఇలాంటి పరిస్థితుల్లో పెట్రోల్‌,వంట గ్యాస్‌ ధరల పెరుగుదల ప్రతి ఇంటినీ ప్రభావితం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్‌లకు అందించిన పన్ను రాయితీల వల్ల ప్రభుత్వ ఆదాయానికి కలిగే నష్టాలను పూడ్చడానికే ఇంధన ధరలు పెంచి కేంద్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజలపై పెనుభారం మోపుతుందని దుయ్యబట్టారు. ఇంధన ధరలను పెంచడంతో నిత్యావసర వస్తువుల ధరలు,రవాణా ఛార్జీలు, ఉత్పత్తి ఖర్చులు, నీటిపారుదల, రవాణా కోసం డీజిల్‌పై ఆధారపడే రైతులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ప్రజా వ్యతరేక విధానాలకు పాల్పడుతూ దేశవ్యాప్తంగా ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో మోడీ ప్రభుత్వం ఫుర్తిగా విఫలమైందన్నారు. విపరీతమైన భారం పడుతున్న ప్రజలకు కొంత ఉపశమనం కలిగించడానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఇంధన ధరలు తగ్గించి, ఎక్సైజ్‌ సుంకాన్ని వెనక్కి తీసుకోవాలని, పెట్రోల్‌ డీజిల్‌, వంట గ్యాస్‌లను జిఎస్‌టి పరిధిలోకి తీసుకరావాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం స్పందిచకుంటే అన్ని శక్తులను కలుపుకుని పెద్దఎత్తున ఆందోనళలు, పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సయ్యద్‌ అజీజ్‌ పాషా మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం తన పెట్టుబడిదారీ స్నేహితుల జేబులను నింపడానికే ప్రజల డబ్బును పిక్‌-పాకెట్‌ చేయడంపై ఆసక్తి చూపుతుందని ఎద్దేవా చేశారు. ఇంధన ధరలు పెంచడం వల్ల ప్రజలపై మోయలేని భారం పడుతుందని, ఇప్పటికైనా కేంద్రం నిర్లక్ష వైఖరి విడి వెంటనే పెంచిన పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను వెన్నక్కి తీసుకోవాలని అజీజ్‌ పాషా డిమాండ్‌ చేశారు. ఇ.టి.నరసింహ మాట్లాడుతూ రోజు భగ్గుమన్న పెట్రోలు, డీజిల్‌ ధరలు సెంచరీ కొట్టినా ఆశ్చర్యపడనక్కర లేదన్నారు. నిత్యావసర సరుకుల ధరలు, ఇంధన ధరలు పెరగడంతో సామాన్యులు విపరీతంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పెంచిన పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ఈ ప్రదర్శనలో సిపిఐ హైదరాబాద్‌ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్‌.ఎ.మన్నన్‌, టి.రాకేష్‌ సింగ్‌, నిర్లేకంటి శ్రీకాంత్‌, శంషుద్దీన్‌. ఎఐటియుసి రాష్ర్ట కార్యదర్శులు ఎం.నరసింహ, బి. వెంకటేశం, ఎఐఎస్‌ఎఫ్‌ నేతలు బి,స్టాలిన్‌,జి.నరేష్‌, సిపిఐ నేతలు కమతం యాదగిరి, ఆర్‌.బాల కష్ణ,మియా, మహమూద్‌, శక్రి బాయి, అమీనాతో పాటు వందలాంది మంది కార్యకర్తలు పాల్గొన్నారు.
పెట్రోలియం ఉత్పత్తుల ధరలు తగ్గించాలి
దేశ వ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తులు, వంట గ్యాస్‌ ధరలను విపరీతంగా పెంచడాన్ని సిపిఐ జాతీయ సమితి తీవ్రంగా ఖండించింది. పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ శ్రేణులు ఆందోళనలు నిర్వహించాలని సిపిఐ పిలుపునిచ్చింది. ఈ మేరకు సిపిఐ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెరుగుదల ఇతర నిత్యావసర వస్తువుల ధరలపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ఫలితంగా ప్రజల జీవనం మరింత దుర్భరంగా మారుతుందని సిపిఐ పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోలియం ఉత్పత్తుల ధరలను వెంటనే తగ్గించాలని, సామాన్య ప్రజలు నిత్యావసర వస్తువులను సరసమైన ధరలకు అందుబాటులో ఉందే విధంగా చర్యలు తీసుకోవాలని సిపిఐ డిమాండ్‌ చేసింది.

DO YOU LIKE THIS ARTICLE?