ఎన్నికల తర్వాతే ప్రధానమంత్రి పేరు ఖరారు
వర్చువల్ మీట్‌లో భాగస్వామ్య పార్టీల ఏకాభిప్రాయం
ఈనెలాఖరులో కూటమి ప్రత్యక్ష సమావేశం!
న్యూఢిల్లీ : ప్రతిపక్ష ‘ఇండియా’ (ఇండియన్ నేషనల్ డవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయెన్స్) కూటమి ఛైర్‌పర్సన్‌గా కాంగ్రెస్‌పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నియామకంపై కూటమిలోని భాగస్వామ్యపార్టీలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి. కూటమి వర్గాలు శనివారంనాడు ఈ విషయం వెల్లడించాయి. బీహార్ ముఖ్యమంత్రి, జెడి(యు) నాయకుడు నితీశ్ కుమార్‌ను కూటమి కన్వీనర్‌గా నియమించాలని కూడా భాగస్వామ్య పార్టీలు ప్రతిపాదించాయి. అయితే ఆయన నియామకంపై సమావేశానికి హాజరుకాని పార్టీల అభిప్రాయం సేకరించడంకోసం అధికారిక ప్రకటన చేయకుండా ఎదురుచూస్తున్నారు. కాగా ప్రధానమంత్రి అభ్యర్థి పేరు నిర్ణయం ఎన్నికల ప్రక్రియ అనంతరమే జరుగుతుందని కూటమి పార్టీలు స్పష్టం చేశాయి. భాగస్వామ్యపార్టీల నాయకులు దృశ్యమాధ్యమ పద్ధతిలో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. కూటమి ఛైర్‌పర్సన్‌గా ఖర్గే పేరుపై భాగస్వామ్యపార్టీలన్నీ ఏకాభిప్రాయం వ్యక్తం చేనట్లు సమావేశంలో పాల్గొన్న సిపిఐ జాతీ ప్రధాన కార్యదర్శి డి.రాజా పిటిఐ వార్తాసంస్థకు చెప్పారు. కాగా ఈనెలాఖరులోపే కూటమి నాయకులు ప్రత్యక్ష సమావేశం నిర్వహిస్తారని వర్గాలు తెలియజేశాయి. తృణమూల్ కాంగ్రెస్, ఉద్ధవ్‌థాక్రే నాయకత్వానగల శివసేన, సమాజ్‌వాదీపార్టీలు ఈ సమావేశానికి హాజరుకాలేదు. అయితే ఈ సమావేశానికి హాజరుకాని పార్టీలతో కూడా తుది విడతగా మాట్లాడిన తర్వాత నియామకాన్ని ఖరారు చేస్తారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలల్లో జరిగే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన సన్నాహాలు, సీట్ల సర్దుబాట్లు వంటి అంశాలను చర్చించారు. కూటమి వర్గాల సమాచారం ప్రకారం ‘ఇండియా’ ఛైర్‌పర్సన్‌గా ఖర్గే నియామకంపై భాగస్వామ్యపార్టీలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి. ‘ఇండియా’ కూటమి ఛత్రం కింద దేశంలోని 28 ప్రతిపక్షాలు ఏకమయ్యాయి. రాబోయే ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు నిర్ణయించాయి. కాగా ‘ఇండియా’ కూటమిలో కన్వీనర్‌గా నియమించేందుకు తన పేరు ప్రతిపాదనకు వచ్చిన విషయాన్ని నితీశ్ కుమార్ కూడా పాట్నాలో శనివారంనాడు ధృవీకరించారు. అయితే జెడి(యు) ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ ఝా మాత్రం దీనిపై మాట్లాడుతూ, తన నియామకంపై నితీశ్ కుమార్ ఇప్పటివరకూ తన ఆమోదం తెలియజేయలేదని వ్యాఖ్యానించారు. ఈ విషయంపై తమ పార్టీలో ఇంకా చర్చించవలసి ఉందని అన్నారు. అయితే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కూటమి నియమించడంపై నితీశ్ కుమార్ కూడా సానుకూలత వ్యక్తం చేశారన్నారు. “అవును, నితీశ్ పేరు ప్రతిపాదనకు వచ్చింది” అని ఝా అన్నారు. కూటమిలో జరిగే ప్రతీ సమావేశంలోనూ నితీశ్ కుమార్‌తోపాటు సంజయ్ కుమార్ కూడా పాల్గొంటూ ఉంటారు. మల్లికార్జున ఖర్గేను ఛైర్‌పర్సన్‌గా నియమించడంపై నితీశ్ కుమార్ అసంతృప్తి చెందారన్న మాటలను ఆయన తిరస్కరించారు. కాంగ్రెస్ నుండే ఎవరైనా ఈ కూటమి బాధ్యతలు తీసుకుంటూ బాగుంటుందని నితీశ్ కుమారే మొదట ప్రతిపాదన చేశారని సంజయ్ కుమార్ గుర్తుచేశారు.
బిజీ వల్ల రాలేదు ః ఉద్ధవ్‌థాక్రే
‘ఇండియా’ కూటమి శనివారంనాడు నిర్వహించిన దృశ్యమాధ్యమ సమావేశంలో ఉద్ధవ్ థాక్రే నాయకత్వం వహించే శివసేన పాల్గొనలేదు. ఊపిరిసలపని కార్యక్రమాల్లో ఉన్నందువల్ల ఈ సమావేశంలో పాల్గొనలేదని ఆయన స్వయంగా ముంబయిలో ప్రకటించారు. ఇటీవల మహారాష్ట్ర స్పీకర్ శివసేన గుర్తింపు విషయంపై ఇచ్చిన తీర్పు విషయంలో ఉద్ధవ్ థాక్రే సుప్రీంకోర్టుకు వెళ్ళే సన్నాహాల్లో ఉన్నారు. “ఈ సమావేశానికి నేను హాజరుకాలేదు. ఇందులో అపార్థం చేసుకోవడానికి ఏమీ లేదు, నేను ఊపిరి సలపని పనుల్లో ఉన్నాను, వీలు కాలేదు, సమావేశానికి హాజరు కావడానికి సమయం లేదు” అని ఉద్ధవ్ థాక్రే అన్నారు. శివసేన ఎంపి శ్రీకాంత్ షిండే ప్రాతినిధ్యం వహిస్తున్న కల్యాన్ నియోజకవర్గంలో థాక్రే ప్రస్తుతం పర్యటిస్తున్నారు.
ఖర్గే ఎంపిక దేశానికి గరకారణం
‘ఇండియా’ కూటమి ఛైర్‌పర్సన్‌గా ఖర్గే నియామకం కేవలం కర్ణాటకకు మాత్రమే గర్వకారణం కాదని, దేశానికే గర్వకారణమని పేర్కొంటూ కర్ణాటక రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డి.కె.శివకుమార్ శనివారం ఎక్స్ వేదికపై ఒక పోస్టింగ్ పెట్టారు. దేశంలో అందరికంటే అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు ఖర్గే అని ఆయన పేర్కొన్నారు. ఆయన నాయకత్వం, ఆయన మార్గదర్శకత్వం, ముందచూపుపై ‘ఇండియా’ కూటమి విశ్వాసం వ్యక్తం చేసిందని పోస్టింగ్ పెట్టారు. “ఆయనకు నా శుభాభినందనలు, నాకు బాగు తెలుసు, ‘ఇండియా’ కూటమిని ఆయన ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపించగలుగుతారు, ఎంతో చిత్తశుద్ధితో జవాబుదారీతో ఆయన పనిచేస్తారు, కాంగ్రెస్‌కు నాయకత్వం వహించినట్లే కూటమి బాధ్యతలు కూడా ఆయన నిర్వహిస్తారని పేర్కొన్నారు.
కేజ్రీవాల్ సీట్ల సర్దుబాటు చర్చ
కాగా శనివారం సాయత్రం కూటమి సమావేశం అనంతరం ఆమ్ ఆద్మీపార్టీ నాయకుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో మల్లిఖార్జున ఖర్గేను ఆయన నివాసంలో కలిసి చర్చలు జరిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌పార్టీ పూర్వాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా పాల్గొన్నారు. వారు ముగ్గురూ రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు విషయంపై చర్చించారు. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ మధ్య ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలలో సీట్ల సర్దుబాట్లపై ఒక విడత చర్చలు జరిగాయి. కేజ్రీవాల్‌తో పాటు ఈ చర్చల్లో ఆప్ నాయకుడు రాఘవ్ ఛద్దా కూడా పాల్గొన్నారు. అనంతరం ఖర్గే ఎక్స్ వేదికగా ఒక పోస్టింగ్ పెట్టారు. “కూటమి నాయకులు దృశ్యమాధ్యమంలో సమావేశమయ్యారు భాగస్వామ్యపార్టీలన్నీ సంతృప్తి వ్యక్తం చేశాయి, పలు విషయాలు చర్చించాం, అందరూ సానుకూలంగా స్పందించారు, సంతోషంగా ఉన్నారు, అదేవిధంగా నేనూ, నాతోపాటు రాహుల్ గాంధీ కూడా భారత్ జోడో న్యాయ యాత్ర ప్రారంభోత్సవానికి యాత్రకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం, దేశంలో సాంఘిక, రాజకీయ, ఆర్థిక సమస్యలను ప్రజలముందు ప్రస్తావించడానికి ఇదే సరైన తరుణం, ఇది ఒక గొప్ప అవకాశం” అని ఖర్గే తన పోస్టింగ్‌లో పేర్కొన్నారు. ఆదివారంనాడు ఇంఫాల్ నుండి రాహుల్ యాత్ర ప్రారంభం కానున్నది.
‘ఇండియా’ చైర్‌పర్సన్‌గా మల్లికార్జున ఖర్గే
RELATED ARTICLES