భూ నిర్వాసితుల డిమాండ్
వచ్చే ఖరీఫ్ నాటికి మల్లన్నసాగర్ సిద్ధం
13 లక్షల ఎకరాలకు గుండెకాయ
ప్రజాపక్షం / హైదరాబాద్ : ముఖ్యమంత్రి కెసిఆర్ కల కాళేశ్వరంలో మల్లన్నసాగర్ అత్యంత ప్రధానమైనది. వచ్చే ఖరీఫ్ నాటికి ఇది పూర్తయి రైతుల పొలాలకు సాగునీరు పారించాలన్న లక్ష్యాన్ని కెసిఆర్ అధికారుల ముందుంచారు. మల్లన్నసాగర్ నిర్మాణంలో నెలకొన్నన్ని అవాంతరాలు ఇప్పటి వరకు దేని విషయంలోనూ ఎదురు కాలేదు. అలాంటి అవాంతరాలన్నీ ఒక్కొక్కటి దూరమవుతుండడంతో మల్లన్నసాగర్ పనుల్లో పురోగతి మొదలయింది. కోటి ఎకరాలకు సాగునీరు లక్ష్యంలో కీలకపాత్ర పోషించే మల్లన్న సాగర్ దాదాపు 13లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు గుండెకాయలాంటింది. ఇటీవలే మల్లన్నసాగర్ నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలని కోర్టు కూడా ఆదేశించడం, ఎట్టి పరిస్తితుల్లోనూ ఎవరికి బకాయి ఉండవద్దని ముఖ్యమంత్రి కూడా ఆదేశించడంతో గత నెల రోజులుగా అధికారులు నిర్వాసితులకు పరిహారం చెల్లింపు, వారి సమస్యల పరిష్కారంలోనే నిమగ్నమయ్యారు. దీంతో అంతో ఇంతో ఉన్న అవాంతరాలు తొలుగుతున్న నేపథ్యంలో దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ 2020 జూన్ నాటికి పూర్తి చేయాలని సిఎం కెసిఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు పనులను వేగవంతం చేశారు. మల్లన్నసాగర్ ముఖ్యమంత్రికి ప్రతిష్టాత్మకమైనది. అందుకే దీని విషయంలో ఎందరు ఎన్ని కొర్రీలు పెట్టినప్పటికి వెనక్కు తగ్గలేదు. కారణం మల్లన్నసాగర్ ద్వారానే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి మెదక్ జిల్లాలో ఐదు లక్షల ఎకరాలకు సాగునీరందించాల్సి ఉంది. అంతే కాదు నల్లగొడ జిల్లాలోని గంధమల, బస్వాపూర్ రిజర్వాయర్లకు నీటిని ఫీడ్ చేసేందుకు లింకేడీ కూడా దీనితోనే ఉంది. వీటితో పాటు కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో నిర్మించనున్న ఏడు రిజర్వాయర్లకు మల్లన్నసాగర్ ద్వారానే నీటిని సరఫరా చేయాలని తాజాగా నిర్ణయించారు. అంటే మల్లన్నసాగర్ ద్వారా దాదాపు 13లక్షల ఎకరాలకు సాగునీరందించాల్సి ఉంది. అయితే దీని కోసం ఇంకా 13970 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉంది. ఇప్పటికే చేసిన భూసేకరణ సమస్యల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న సర్కారు ఈ భూసేకరణను కూడా వేగవంతం చేసింది. దాదాపు మూడున్నరేళ్లుగా భూసేకరణ చేపడుతున్నప్పటికీ నిర్వాసితుల నుంచి ఎదురవుతున్న అభ్యంతరాలు, సమస్యలు భూసేకరణను వేగంగా ముందుకు పోనీయడం లేదు. బోలెడన్ని కోర్టు కేసులు దీనిపై ఉండడం కూడా మల్లన్నసాగర్ నిర్మాణంలో జాప్యానికి ప్రధాన కారణం. అయితే కోర్టు కేసుల నుంచి కూడా ప్రభుత్వం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత నిర్వాసితులతో ప్రభుత్వం ప్రత్యేక చర్చలు జరిపి విజయం సాధించింది. ఈ చర్చల ఫలితంగా 910 ఎకరాలను ఎకరాకు రూ. 7.75లక్షల చొప్పున కొనుగోలు చేసింది ప్రభుత్వం. మరో 90ఎకరాల భూసేకరణ చేస్తే మల్లన్నసాగర్ నిర్మాణాన్ని పూర్తి చేయవచ్చు. ఇది కూడా దాదాపు పూర్తి కావస్తోంది. భూసేకరణ పూర్తయినప్పటికి నిర్వాసితుల సహాయ, పునరావాస పనుల్లో కొంత అవాంతరాలు ఎదురవుతున్నాయి. నిబంధనల ప్రకారం అర్హులైన నిర్వాసితులకు 250 గజాల భూమి, ఎకరానికి రూ.7.50లక్షలు, డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తున్నారు. ఇళ్లు వద్తనుకున్న వారికి రూ.5.04లక్షలు ప్రభుత్వం చెల్లిస్తోంది. అయితే నిర్వాసితులు ప్రభుత్వం ఇస్తున్న పరిహారాన్ని ఇంకా పెంచాలని, ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మిస్తున్న ముట్రాజ్‌పల్లిలో వసతుల కల్పన సరిగా లేదని ఆరోపిస్తున్నారు. భూసేకరణను నిరసిస్తూ ఏటిగడ్డ, కిష్టాపూర్, తొగుట, వేములఘాట్ గ్రామస్థులు కోర్టును ఆశ్రయించారు. ఇది క్లియర్ కావాల్సి ఉంది. రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా రూ.6.805 కోట్లతో నాలుగు రీచ్‌లలో చేపట్టిన పనులు మందకొడిగానే సాగుతున్నాయి. మొత్తం 13కోట్ల క్యూబిక్ మీటర్ల పని జరగాల్సి ఉండగా దాదాపు మూడు కోట్ల క్యూబిక్ మీటర్ల పనే జరిగింది. దీంతో పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టి జూన్ 2020 నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేసి ప్రారంభోత్సవం చేయాల్సిందేనని ముఖ్యమంత్రి అధికారులకు చాలా గట్టిగానే ఆదేశాలు ఇచ్చారు. దీంతో గత కొన్ని రోజులుగా పనుల్లో వేగం పెరిగింది.