9,10 తరగతులు, ఇంటర్, డిగ్రీ, పిజి విద్యార్థులకు 1వ తేదీ నుంచి ప్రత్యక్ష తరగతులు
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన
ప్రజాపక్షం / హైదరాబాద్ పాఠశాల స్థాయిలో 9,10వ తరగతులతో పాటు ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లోని విద్యుర్థులందరికీ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభమౌతాయని, ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించిన సిలబస్, పరీక్షల తేదీలు, ప్రాక్టికల్స్ విషయంలో వారం రోజుల్లోగా స్పష్టతనిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. కొవిడ్- నిబంధనల మేరకు విద్యార్థులకు తరగతులు జరుగుతాయని స్పష్టం చేశారు. ప్రత్యక్ష తరగతులు ప్రారంభమవుతున్న సందర్భంగా ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీ ప్రతినిధులతో మంగళవారం మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా తరగతుల నిర్వహణకు సంబంధించి ప్రతి విద్యా సంస్థ కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో జరిగే ప్రవేశ పరీక్షల సిలబస్‌కు అనుగుణంగా ఎంసెట్ పరీక్షకు సంబంధించిన సిలబస్ విషయంలో స్పష్టతనిస్తామని మంత్రి వివరించారు. పాఠశాలలు ప్రారంభించాలనే ప్రభుత్వ సంకల్పానికి ప్రైవేటు విద్యా సంస్థలు తమవంతు సహకారాన్ని అందించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం భవిష్యత్‌లో రూపొందించే విధానాల రూపకల్పనలో ప్రైవేటు విద్యా సంస్థలను కూడా భాగస్వామ్యం చేస్తామని మం త్రి హామీనిచ్చారు. విద్యార్థులు పాఠశాలకు తప్పనిసరిగా హాజరు కావాలని ఒత్తిడి చేయడం లేద ని, విద్యార్థుల తల్లితండ్రుల అనుమతి పత్రం ఉంటేనే ప్రత్యేక తరగతులకు అనుమతిస్తామని పేరెంట్స్ కమిటీకి తెలిపారు. ప్రైవేటు విద్యా సంస్థలకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వం సానుభూతితో పరిశీలించి పరిష్కరిస్తుందని మం త్రి హామీనిచ్చారు. అత్యున్నత విద్యను అందించే ప్రక్రియలో ప్రైవేటు భాగస్వామ్యం తప్పనిసరి అని, అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ తరగతులు నిర్వహించాలని మంత్రి ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, అధికారులు ఉమర్ జలీల్, దేవసేన తదితరులు పాల్గొన్నారు. ప్రమాణాలు పాటిస్తూ తరగతులు నిర్వహించాలని మంత్రి ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, అధికారులు ఉమర్ జలీల్, దేవసేన తదితరులు పాల్గొన్నారు.