రాష్ట్రాంలో కాంగ్రెస్, బిఆర్ఎస్, మజ్లిస్ వారసత్వ పార్టీలే
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా విమర్శ
ప్రజాపక్షం/ హైదరాబాద్ రాష్ర్టంలో కాంగ్రెస్, బిఆర్ఎస్, మజ్లిస్ మూడు వారసత్వ పార్టీలేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. తెలంగాణ ప్రజలు బిజెపికి 12కు తగ్గకుండా ఎంపి సీట్లు ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ పాలన అంతా కుంభకోణాలమయమేనన్నారు. హైదరాబాద్‌లోని ఎల్బి స్టేడియంలో మంగళవారం నిర్వహించిన బిజెపి పోలింగ్ బూత్ స్థాయి అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా అమిత్ షా ప్రసంగిస్తూ మోడీని మూడోసారి ప్రధానిగా చేద్దామని, 400 లోక్‌సభ స్థానాలను ఆయనకు కానుకగా ఇద్దామని అన్నారు. ప్రస్తుతం దేశంలో ఎక్కడికెళ్లినా, మోడీ నామస్మరణతో మార్మోగుతుందన్నా రు. మజ్లిస్ అజెండాతోనే హస్తం, గులాబీ పార్టీలు పనిచేస్తాయని విమర్శించారు. ఈ మూడు పార్టీలు కేవలం ఓటుబ్యాంకు రాజకీయాలు చేస్తాయని, తమ వారసుల సంక్షేమం గురించి మా త్రమే ఆలోచిస్తాయని అన్నారు. మోడీ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో ఏడాదికి రూ.6 వేల చొప్పున వేస్తూ, అండగా ఉంటోందని, వచ్చే ఐదేళ్లలో దేశమంతటా, ప్రతి ఇంటికి నల్లా ద్వారా మంచినీరు సరఫరా చేస్తుందన్నారు. ఇప్పటికే 14 కోట్ల ఇళ్ల కు మంచినీటి నల్లా కనెక్షన్లు ఇచ్చామని, కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మజ్లిస్‌కు భయపడుతోందన్నారు. పదేళ్ల యూపీఏ పాలనలో తెలంగాణకు రూ.1.17లక్షల కోట్లు మా త్రమే వస్తే, మోదీ పాలనలో మాత్రం ఇప్పటికే రాష్ట్రానికి రూ.5లక్షల కోట్లు వచ్చాయని తెలిపారు. బిజెపి ఎప్పుడూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయదన్నారు. మోడీ నేతృత్వంలోనే దేశం ఎంతో అభివృద్ధి చెందిందని బిజెపి రాష్ర్ట అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ అభిృద్ధికి మోడీ ప్రత్యేక నిధులు కేటాయించారని తెలిపారు. కెసిఆర్ కుటుంబం తెలంగాణను దోచుకున్నదని, కెసిఆర్ నియంతృత్వ పాలనతో రాష్ట్రాన్ని ఎదగనివ్వలేదని విమర్శించారు. ఈసారి రాష్ర్టంలోని 17 లోక్‌సభ సీట్లు బిజెపి గెలవాలని కోరారు. మజ్లీస్ పీడ తొలగాలని పాతబస్తీ వాసులు కోరుకుంటున్నారని అన్నారు. రాహుల్ గాంధీ, పార్లమెంట్ ఎన్నికల కోసం కాంగ్రెస్ నేతలు తెలంగాణలోని బిల్డర్లు, కాంట్రాక్టర్లు, వ్యాపారుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు.