ఆ ఆర్డినెన్స్‌లు వద్దు!

వ్యవసాయ సంస్కరణల పేరుతో కుట్ర
ఆర్డినెన్స్‌లను వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాల తీర్మానం
న్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన రైతు వ్యతిరేక ఆర్డినెన్స్‌లను ప్రతిపక్షాలు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి. వ్యవసాయ మార్కెటింగ్‌ సంస్కరణల పేరుతో ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌లకు వ్యతిరేకంగా ఒక తీర్మానం ప్రవేశపెట్టాలని ప్రతిపక్ష ఎంపీలు యోచిస్తున్నారు. లాక్‌డౌన్‌ కాలంలో ప్రభుత్వం రెండు మార్కెటింగ్‌ రిఫార్మ్‌ ఆర్డినెన్స్‌ను జారీ చేసిన విషయం తెల్సిందే. ఈ ఆర్డినెన్స్‌ల స్థానంలో బిల్లులను ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ బుధవారం మధ్యాహ్నం ఈ బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. వీటిని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలకు చెందిన పార్లమెంటు సభ్యులు లోక్‌సభలో ఒక తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. వ్యవసాయ సంస్కరణల పేరుతో ప్రభు త్వం చేసిన కుట్రలో భాగమే ఈ ఆర్డినెన్స్‌లని, ఇప్పుడు వీటికి చట్టరూపం తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతున్నదని, దాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు కాంగ్రెస్‌పార్టీ, తృణమూల్‌ కాంగ్రెస్‌, శివసేన, సిపిఐ, సిపిఐ(ఎం), ఆర్‌ఎస్‌పి ఎంపీలు ప్రకటించారు. జూన్‌ 5న రాష్ట్రపతి ఆమోదముద్రవేసిన “ఫార్మర్స్‌ ప్రొడ్యూస్‌ ట్రేడ్‌ అండ్‌ కామర్స్‌ (ప్రొమోషన్‌ అండ్‌ ఫెసిలిటేషన్‌) ఆర్డినెన్స్‌ 2020”ను సభ తిరస్కరించాలని కోరుతూ ప్రతిపక్ష ఎంపీలు తీర్మానం ప్రవేశపెడుతున్నట్లు కాంగ్రెస్‌కు చెందిన ఓ ఎంపీ తెలిపారు. రైతులకు స్వేచ్ఛావాణిజ్యం కల్పించడమే ఈ ఆర్డినెన్స్‌ ఉద్దేశమని ప్రభుత్వం చెపుతూ వస్తున్న విషయం విదితమే. నిజానికి ఈ ఆర్డినెన్స్‌ల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఇది పూర్తిగా కార్పొరేట్‌లకు లాభాలను చేకూర్చే విధంగా వున్నాయని, వ్యవసాయంపై కార్పొరేట్‌ గుత్తాధిపత్యాన్ని పెంచడానికే ఈ ఆర్డినెన్స్‌లను ప్రభుత్వం జారీ చేసిందని ప్రతిపక్ష ఎంపీలు ఆరోపించారు. అలాగే ఫార్మర్స్‌ (ఎంపవర్‌మెంట్‌ అండ్‌ ప్రొటెక్షన్‌) అగ్రిమెంట్‌ ఆన్‌ ప్రైస్‌ అస్యూరెన్స్‌ అండ్‌ ఫార్మ్‌ సర్వీసెస్‌ ఆర్డినెన్స్‌ 2020ని వ్యతిరేకిస్తూ మరో తీర్మానాన్ని కూడా ప్రతిపక్ష ఎంపీలు ప్రవేశపెట్టడానికి రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే పార్లమెంటు వెలుపల రైతులు ఈ రెండు బిల్లులను వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టారు. పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ సోమవారం నాడు ప్రధాని మోడీకి ఒక లేఖ కూడా రాశారు.

DO YOU LIKE THIS ARTICLE?