నెహ్రూ రచనల వెబ్‌సైట్‌

భారత ప్రథమ ప్రధానమంత్రి పండిత జవహర్‌లాల్‌ నెహ్రూ 129వ జయంతి సందర్భంగా ‘ది జవహర్‌లాల్‌ నెహ్రూ మెమోరియల్‌ ఫండ్‌'(జెఎన్‌ఎంఎఫ్‌) నెహ్రూ ఎంపిక చేసిన రచనలపై వెబ్‌సైట్‌ ప్రారంభించింది. ఆ సైట్‌ పేరు nehru selected works.com; ఆయన కృషిని ప్రపంచవ్యాప్తంగా సులభంగా లభ్యం చేసేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. ఇంతవరకు ప్రచురించబడిన నెహ్రూ సెలెక్టెడ్‌ వర్క్‌ 76 సంపుటాలను డిజిటైజ్‌ చేశారు. మరో 10 సంపుటాలు వచ్చే ఆరుమాసాల్లో ప్రచురితమవుతాయి. దీంతో, 1964లో ఆయన మరణించేంత వరకు సిరీస్‌ పూర్తి అవుతాయి. నెహ్రూ ఉపన్యాసాలు, రచనలు, ప్రసంగాలు వగైరా ఈ సంపుటాల్లో ఉన్నాయి. జెఎన్‌ఎంఎఫ్‌కు కాంగ్రెస్‌ నాయకురాలు సోనియాగాంధీ ఛైర్మన్‌. 1964 లో ఈ సంస్థ ఏర్పడింది. పట్టణ, గృహవసతి వ్యవహారాల మంత్రిత్వశాఖ ఇటీవల, తీన్‌ మూర్తి కాంప్లెక్స్‌ నుంచి బయటకు వెళ్లాలని ఈ సంస్థను కోరింది. ఢిల్లీ హైకోర్టు ఆ నోటీసు అమలును నిలుపుచేసింది. జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రాధాన్యతను తగ్గించేందుకు గట్టి ప్రయత్నం చేస్తున్న నరేంద్రమోడీ ప్రభుత్వం, తీన్‌మూర్తి కాంప్లెక్స్‌లో ఇతర ప్రధానమంత్రుల మ్యూజియంల ఏర్పాటును తలపెట్టటం రాజకీయ వివాదమైంది. నెహ్రూ జన్మదినాన్ని (నవంబర్‌ 14) ప్రభుత్వం అధికారికంగా బాలల దినోత్సవంగా జరిపేది. మోడీ పాలనలో అది రద్దయింది. నెహ్రూ జీవిత ప్రధాన విలువలైన స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, లౌకికత, సోషలిజం భావాలకు పునరంకితం కావటమే ఆయనకు మనమిచ్చే గౌరవమని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పేర్కొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?