ఆర్టిసి కార్మికుల ఆత్మహత్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్హెచ్ఆర్సి నోటీసులు
ప్రజాపక్షం/హైదరాబాద్: ఆర్టిసి సమ్మె, ఉద్యోగుల ఆత్మహత్యలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సి) నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ చేసిన ఫిర్యాదుపై ఎన్హెచ్ఆర్సి స్పందించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వివరణ కోరుతూ మంగళవారం నాడు నోటీసు జారీ చేసింది. వచ్చే నెల 28వ తేదీలోగా వివరణ ఇవ్వాలని, లేకపోతే మానవహక్కుల పరిరక్షణ చట్టంలోని 13వ సెక్షన్ కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఆర్టిసి సమ్మె పట్ల ప్రభుత్వ వైఖరి, 48వేలకు పైగా ఉద్యోగులను డిస్మిస్ అయినట్లేనని సిఎం ప్రకటన, శ్రీనివాస్‌రెడ్డి,తదితరుల ఆత్మహత్య, పలువురి మరణాలన్నీ మానవహక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని గత నెల 18వ తేదీన ఎన్హెచ్ఆర్సి చైర్మన్‌కు నారాయణ ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందిస్తూ సమగ్ర నివేదకను సమర్పించాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని మానవహక్కుల సంఘం ఆదేశించింది. ఈ విషయాన్ని నారాయణ బుధవారం ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.