ఆర్‌టిసి కార్మికులు ఫామ్‌హౌస్‌ పాలేరులు కాదు

9న కార్యచరణ ప్రకటిస్తాం
ఆర్‌టిసి జెఎసి నేతల ప్రకటన
గన్‌పార్క్‌ వద్ద జెఎసి నేతల అరెస్టు, ఉద్రిక్తత
మూడో రోజుకు చేరిన ఆర్‌టిసి సమ్మె

ప్రజాపక్షం/హైదరాబాద్‌: ఆర్‌టిసిపై సిఎ కెసిఆర్‌ ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఆర్‌టిసి కార్మికులు కెసిఆర్‌ ఫామ్‌హౌస్‌లో పనిచేసే పాలేరులు కాదని జెఎసి నేతలు కె.రాజిరెడ్డి, ఇ.అశ్వద్ధామరెడ్డి అన్నారు. ప్రభుత్వంలో ఆర్‌టిసిని విలీనం చేయాలనే డిమాండ్‌తో నిరవధిక సమ్మెకు దిగిన ఆర్‌టిసి జెఎసి తమ భవిష్యత్తు పోరాట కార్యాచరణను మంగళవారం ప్రకటిస్తామని వెల్లడించింది. ఆర్‌టిసి సమ్మెపై సిఎం కెసిఆర్‌ చేసిన ప్రకటనకు నిరసనగా ఇందిరాపార్క్‌ వద్ద సోమవారం ఆర్‌టిసి కార్మికులు జరపతలపెట్టిన నిరాహార దీక్షలకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు జెఎసి నేతలు తెలిపారు. కాగా ఉద్యమంలో భాగంగా తెలంగాణ అమరవీరు ల స్థూపం వద్ద నివాళులు అర్పించేందుకు సోమవారం ఉదయం గన్‌పార్క్‌కు వచ్చిన ఆర్‌టిసి జెఎసి నేతలను పోలీసులు అడ్డుకుని బలవంతంగా అరెస్టు చేశారు. జెఎసి కన్వీనర్‌ అశ్వద్ధామరెడ్డిని మహంకాళి పోలీస్‌ స్టేషన్‌కు తరలించగా, జెఎసి కో కన్వీనర్‌ రాజిరెడ్డిని సైఫాబాద్‌ పోలీసు సేష్టన్‌కు తరలించారు. ఉద్యోగ సంఘాల నేతలు ఆర్‌టిసి యూనియన్‌ కార్యాలయానికి రాకుండా పోలీసులను భారీగా మోహరించారు. అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్‌ వద్ద నివాళులర్పించేందుకు ఆర్‌టిసి కార్మికులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో అక్కడ కొద్ది సేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. గన్‌పార్క్‌ వద్దకు తరలివస్తున్న ఆర్‌టిసి కార్మికులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. పోలీసు స్టేషన్లలో ఉన్న జెఎసి నేతలను టిడిపి రాష్ట్ర అధ్యక్షులు ఎల్‌.రమణ, పొలిట్‌ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్‌రెడ్డితో పాటు పలు రాజకీయ పార్టీల నేతలు పరామర్శించి ఆర్‌టిసి పోరాటానికి మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా జెఎసి నేతలు కె.రాజిరెడ్డి, ఇ.అశ్వద్ధామరెడ్డి మీడియాతో మాట్లాడారు. సమ్మె చేస్తున్న వా రందరిని ఉద్యోగాల నుంచి డిస్మిస్‌ చేశామని సిఎం ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. సమ్మె చేస్తున్న వారిలో నలుగురిని కూడా డిస్మిస్‌ చేసే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు ఆధైర్యపడకుండా సమ్మెకు పూర్తి మద్దతు ఇస్తున్నారని దీంతో సమ్మె విజయవంతంగా సాగుతుందని తెలిపారు. ప్రభుత్వంలో ఆర్‌టిసిని విలీనం చేయాల్సిందేనని వా రు మరోసారి ప్రభుత్వానికి స్పష్టం చేశారు. తమ సమ్మె న్యాయబద్ధమేనని, న్యాయనిపుణులు చెప్పారని తెలిపారు. సమ్మెపై సిఎం చేస్తున్న ప్రకటనకు భయపడేది లేదని మరోమారు స్పష్టం చేశారు. ఉద్యమాలతో ముఖ్యమంత్రి అయిన కెసిఆర్‌ ఉద్యమాలను అణచి వేసే సిఎంగా చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఆర్‌టిసి విధానాలను పోల్చి సిఎం మాట్లాడాలని సూచించారు. తెలుగు రాష్ట్రాలతో పోల్చకుండా ఇతర రాష్ట్రాలతో పోల్చడం సరికాన్నారు. ఆర్‌టిసిలో నిరవధిక సమ్మె కొనసాగుతుందన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?