ఆరు రోజుల్లో 1.34 లక్షల కేసులు

భారత్‌లో కొత్తగా మరో 22,252 మందికి కరోనా
తాజాగా మహమ్మారి బారిన పడి 467 మంది మృతి
7,19,665కి చేరిన బాధితులు,20,160కి పెరిగిన మృతులు
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి భారత్‌ను అతలాకుతలం చేస్తుంది. కొవిడ్‌ విజృంభణ మన దేశంలో ఇప్పట్లో ఆగేట్టు కనబడటం లేదు. అన్‌లాక్‌ మార్గదర్శకాలు అమల్లోకి వచ్చినప్పటి నుంచి కొవిడ్‌ కేసుల సంఖ్యగా భారీగా పెరుగు తూ వస్తోంది. కరోనా పాజిటివ్‌ కేసులు 7 లక్ష ల మార్క్‌ను దాటగా, మరణాల సంఖ్య 20 వేలు దాటిన విషయం తెలిసిందే. గత ఐదు రోజుల క్రితమే కేసుల సంఖ్య ఆరు లక్షల మార్క్‌ను దాటగా తాజాగా ఏడు లక్షల మార్క్‌ ను దాటేసింది. దేశంలోకి కరోనా ప్రవేశించిన తరువాత 110 రోజుల్లో లక్ష కేసులు రాగా, కేవలం 49 రోజుల్లోనే ఏడు లక్షల మార్క్‌ను దాటడం వైరస్‌ తీవ్రతకు అద్దం పడుతోంది. కాగా, సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం నాటికి గడిచిన 24 గంటల్లో కొత్తగా 22,252 మంది కరోనా వైరస్‌ బారిన పడినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. నిత్యం 20 వేలకు పైగా కొత్త కేసులు రావడం వరుసగా ఇది ఐదవరోజు. దేశంలో ఇప్పటి వరకు 7,19,665 మంది మహమ్మారి బారిన పడగా, తాజాగా మరో 467 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 20,160కు చేరింది. ప్రస్తుతం 2,59,557 యాక్టివ్‌ కేసులు ఉండగా, మహమ్మారి నుంచి మొత్తం 4,39,947 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 61.13గా ఉన్నట్లు మంత్రిత్వశాఖకు చెందిన ఒక అధికారి చెప్పారు. కాగా, వైరస్‌ దేశంలోకి ప్రవేశించిన నాటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 1,02,11,092 నమూనాలను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధన మండలి (ఐసిఎంఆర్‌) తెలిపింది. ఈనెల 6న ఒక్క రోజే 2,41,430 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా, దేశంలో జులై నెల ప్రారంభం నుంచి కేసుల సంఖ్య మరింత పెరుగుతోంది. జులై 1 నాటికి దేశంలో 5,85,493 కరోనా కేసులు నమోదుకాగా ఈ ఆరు రోజుల్లోనే లక్షా 34వేల కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా ఈ ఆరురోజుల్లోనే దేశంలో 2760 మంది కరోనా రోగులు మృత్యువాతపడ్డారు.
దేశ రాజధానిలో లక్ష దాటిన కేసులు
మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందున్నప్పటికీ తాజాగా కొత్త కేసులు తగ్గాయి. మహారాష్ట్రలోగత కొంత కాలంగా నిత్యం 6 వేలకు పైగా కొత్త కేసులు నమోదైన విషయం తెలిసిందే. 24 గంటల్లోనే కొత్తగా 5,368 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా ఒక్కరోజులోనే రాష్ట్రంలో మరో 204 మంది కొవిడ్‌ రోగులు మృతిచెందారు. కరోనా కేసుల సంఖ్య 2,11,987కి చేరగా, వీరిలో ఇప్పటి వరకు 9,026 మంది ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులోనూ కొత్త కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా దాదాపు నిత్యం ఐదువేల మంది కరోనా బారిన పడగా, తాజాగా కేసుసల సంఖ్య కాస్త తగ్గింది. గడిచిన 24 గంటల్లో 3,827 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య 1,14,978కి చేరింది. కొత్తగా 61 మంది మృతి చెందగా, రాష్ట్రంలో ఇప్పటివరకు 1,571 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దేశ రాజధాని ఢిల్లీలో తాజాగా కరోనా కేసుల సంఖ్య లక్ష దాటింది. రాష్ట్రంలో 24 గంటల్లో 1,379 మందికి పాజిటివ్‌ రాగా, మొత్తం కేసుల సంఖ్య 1,00,823కు చేరింది. తాజాగా మరో 48 మంది కరోనా కాటుకు బలి కాగా, మొత్తం 3,115 మంది ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్‌లో కొత్తగా 17 మంది మరణించగా, 735 మంది మహమ్మారి బారిన పడ్డారు. మొత్తం మృతుల సంఖ్య 36.772గా ఉండగా. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,960 మంది మరణించారు. ఉత్తరప్రదేశ్‌లో మరో 929 మంది వైరస్‌ బారిన పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 28,636కు చేరింది. కొత్తగా 24 మంది మరణించగా, మృతుల సంఖ్య 809కి చేరింది. తెలంగాణలో కొత్తగా 1879 మందికి వైరస్‌ సోకగా మొత్తం 313 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 27,612కు చేరింది. కర్నాటకలోనూ కొత్తగా 1843 మందికి పాజిటివ్‌ రాగా, 29 మంది మృతి చెందారు. దీంతో కేసుల సంఖ్య 25,317గా ఉండగా ఇప్పటి వరకు 401 మంది బలయ్యారు. కాగా, పశ్చిమ బెంగాల్‌లో 779 మంది, మధ్యప్రదేశ్‌లో 617 మంది, రాజస్థాన్‌లో 461, ఆంధ్రప్రదేశ్‌లో 252 మంది మరణించారు. కేసుల విషయానికొస్తే.. ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 28,636 మంది, పశ్చిమ బెంగాల్‌లో 22,987, రాజస్థాన్‌లో 20,688, ఆంధ్రప్రదేశ్‌లో 21,197 మంది మహమ్మారి బారిన పడ్డారు. ఇక హర్యానా, మధ్యప్రదేశ్‌, బీహార్‌లోనూ కేసుల సంఖ్య పది నుంచి 15 వేల మధ్య కేసులు నమోదయ్యాయి.

DO YOU LIKE THIS ARTICLE?