సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్
ఐదేళ్లయినా పూర్తికాకపోవడం సిగ్గుచేటు
సాగునీటి ప్రాజెక్టులకు నిధులు ఇవ్వండి
యాదాద్రి జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను సందర్శించిన సిపిఐ ప్రతినిధి బృందం
ప్రజాపక్షం / యాదాద్రి ప్రతినిధి బస్వాపూర్ రిజర్వాయర్ పనులకు నిధుల కొరత లేకుండా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రత్యేక దృష్టి సారించి ఆరు నెలల్లో ప్రాజెక్టును పూర్తి చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. రెండు సంవత్సరాల్లో పూర్తి చేయాల్సిన బస్వాపూర్ ప్రాజెక్టు పనులు ఐదేళ్లుగా నత్తనడకన సాగడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నారు. బునాదిగాని కాలువ పనులకు నెల రోజుల్లో నిధులు విడుదల చేయకుంటే ఆందోళన చేస్తామని ఆయన సర్కార్‌ను హెచ్చరించారు. సాగునీటి ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని బునాదిగాని కాలువ, బస్వాపురం రిజర్వాయర్, గందమల్ల చెరువులను చాడ వెంకట్‌రెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.శ్రీనివాస్‌రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములుతో కూడిన ప్రతినిధి బృందం పరిశీలించింది. అనంతరం చాడ వెంకట్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రభు త్వం భూముల ధరలు పెంచినట్టుగానే ప్రాజెక్టు నిర్వాసితులకు సైతం మార్కెట్ ధర ప్రకారం లేదా పెంచిన భూముల ధరలకు అనుగుణంగా పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిధులు ఇవ్వకపోవడం వల్లనే బస్వాపూర్ రిజర్వాయర్ పనులు నత్తనడకన సాగుతున్నాయని, పనులు వేగవంతం కావడానికి తక్షణమే పెండింగ్‌లో ఉన్న బిల్లులను, భూసేకరణకు కావాల్సిన నిధులు ఒకేసారి విడుదల చేయాలన్నారు. ప్రాజెక్టు పనులతో పాటు ఏకకాలంలో కెనాల్ తవ్వకాలు, నిర్మాణాలను వేగవంతం చేయాలని కోరారు. కెనాల్ నిర్మాణం కాకుండా ప్రాజెక్టు నిర్మించుకున్నా ప్రయోజనం ఉండదన్న విషయాన్ని సర్కార్ గ్రహించాలని సూచించారు. నిర్వాసితుల పునరావాసం విషయంలో కూడా ప్రభుత్వం తాత్సారం చేయడం తగదని, ఆర్అండ్ఆర్ ప్యాకెజీ ప్రజల అభీష్టానికి అనుగుణంగా ఉండాలన్నారు. నవాబుల కాలం నుంచి పట్టాలు లేనప్పటికీ కబ్జాలో ఉండి సాగు చేసుకుంటున్న రైతులకు పరిహారం ఇవ్వకుండా స్థానికంగా లేని పట్టాదారులకు పరిహారం ఇవ్వడం పేదలను కొట్టి పెద్దలకు పెట్టినట్టుగా సర్కార్ తీరు ఉందని చాడ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిన్ తిమ్మపురం, బస్వాపురం, లప్పనాయక్తండ, రాళ్లజనగాం, జంగంపల్లి గ్రామాల్లోని ప్రభుత్వ భూములతో పాటు నవాబుల భూముల్లో సాగు చేస్తున్న రైతుల వివరాలను తెలుసుకోవడం కోసం ‘ఎంజాయ్మెంట్ సర్వే’ నిర్వహించాలన్నారు. ఆర్డిఓ స్థాయి అధికారి నిర్వహించిన ఈ సర్వేలో కబ్జాలో ఉన్న రైతులకు పరిహారం ఇవ్వాలని చట్టాలు చెబుతున్నాయన్నారు. గతంలో ఆనేక చోట్ల ఎంజాయ్మెంట్ సర్వే చేసి కబ్జాలో ఉన్న రైతులకు పరిహారం ఇచ్చారని, అదే విధానాన్ని బస్వాపూర్ నిర్వాసితులకు వర్తింపచేయాలని ఆయన సిఎం కెసిఆర్‌కు కోరారు. బస్వాపూర్ సర్వే నెంబర్ 229లో 90 మంది రైతులు 110 ఎకరాల్లో సాగు చేసుకుంటున్నారని, వీరికి పట్టాలు లేవన్న కారణంతో పరిహారం ఇచ్చేందుకు నిరాకరించడం తగదన్నారు. హైకోర్టు సైతం వీరికి మద్దతుగా స్టేటస్కో ఇచ్చిందని, రైతుల వైపు న్యాయం ఉన్నదని కోర్టులు గ్రహించినప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం విచారకరమన్నారు.
‘బునాదిగాని’ పనుల పూర్తికి రూ.100 కోట్లు ఇవ్వాలి
ఆసంపూర్తిగా మిగిలిపోయిన బునాదిగాని కాలువ నిర్మాణం కోసం సిఎం కెసిఆర్ నెల రోజుల్లో రూ.100 కోట్లు విడుదల చేయాలని, లేటన్లయితే సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని చాడ వెంకట్‌రెడ్డి ప్రభుత్వాన్ని చాడ వెంకట్‌రెడ్డి హెచ్చరించారు. ఆత్మకూర్ మండలం సిద్ధపురంలో కుంటకట్ట పనుల పూడికతీత (మిషన్ కాకతీయ పథకం) పనులు ప్రారంభోత్సవానికి వచ్చిన అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీశ్‌రావు ఆరు నెలల్లో బునాదిగాని కాలువను పూర్తి చేసి సాగు నీరు అందిస్తామని ఇచ్చన హామీ ఐదేళ్లుగా నెరవేర్చకపోవడం విచారకరమన్నారు. ఏడు మండలాలు, 50 గ్రామాల్లో 20వేల ఎకరాలకు సాగు నీరందించే బునాదిగాని కాలువ నిర్మాణానికి నిధులు ఇవ్వకుండా టిఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ వస్తే నీళ్లు వస్తాయని చెప్పిన సిఎం కెసిఆర్… అధికారంలోకి వచ్చి ఏడేళ్లు అవుతున్నా సాగు నీరు ఇవ్వడంలో విఫలమయ్యారని ఆయన విమర్శించారు. మొత్తం 98 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ కాలువ పనులు 55 కిలోమీటర్లు పూర్తి అయ్యాయని, మిగతా 43 కిలోమీటర్లు పూర్తి కావడానికి 146 ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉండగా కెసిఆర్ నిధులు ఇవ్వకపోవడంతో నిలిచిపోయిందన్నారు. పాత అలైన్మెంట్ కాకుండా కొత్త అలైన్మెంట్ ప్రకారం కాలువలు తవ్వడం వల్ల ప్రజాధనం దుర్వినియోగం కావడంతో పాటు రైతుల నుంచి కొత్త సమస్యలు ఎదురై కాలువ పనులు ముందుకు సాగవన్నారు. పాత అలైన్మెంట్ ప్రకారమే కాలువలను విస్తరించాలని అధికారులను కోరారు.
భూసేకరణ జరగలేదని ఇంజనీరింగ్ అధికారుల వెల్లడి
ఆత్మకూర్ మండలం కామునిగూడెంలో అర్ధాంతరంగా ఆపివేసిన బునాదిగాని కాలువ పనులను సిపిఐ ప్రతినిధి బృందం పరిశీలించింది. మొత్తం 98.64 కిలోమీటర్ల పొడవున నిర్మించే ఈ కాలువ ఇప్పటి వరకు 55 కిలోమీటర్లు మేర పూర్తి చేశామని మిగత 43 కిలోమీటర్ల మేరకు తవ్వాల్సిన కాలువ పనులకు భూసేకరణ జరగలేదని ఇంజనీరింగ్ అధికారులు చాడ వెంకట్‌రెడ్డికి వివరించారు. వలిగొండ, భువనగిరి, ఆత్మకూర్, అడ్డగూడూర్, బీబీనగర్ మండలాల్లో సుమారు 146 ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉందని అధికారులు చెప్పారు. ప్రస్తుతం 26.75 కోట్ల మేర పనులు పూర్తి చేశామని అధికారులు ఆయనకు తెలిపారు. మిగత పనులు ఆగిపోవడానికి గల కారణాలను అధికారులను నుంచి తెలుసుకున్నారు. మోత్కూర్ వెళ్లే దారిలో రోడ్డుపైన నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం కాకముందే శిథిలమవ్వడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా కాంట్రాక్టర్ ఇష్టారీతిగా నిర్మిస్తే దాని వల్ల కలిగే నష్టం వల్ల రైతులు భవిష్యత్తులో ఇబ్బంది పడాల్సి వస్తుందని తక్షణమే కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకొని బ్రిడ్జి నాణ్యత లోపాలను సవరించాలని ఇంజనీరింగ్ అధికారులను కోరారు.
ఆగస్టు నాటికి బస్వాపూర్లోకి నీరు
భువనగిరి మండలం బస్వాపూర్ (నృసింహసాగర్) ప్రాజెక్టు పనులు 66 శాతం పూర్తి చేశామని ఇంజనీరింగ్ అధికారులు సిపిఐ ప్రతినిధి బృందానికి వివరించారు. ప్రస్తుతం భూమి నుంచి ట్యాంక్‌బండ్‌ను 60 మీటర్ల ఎత్తులో నిర్మిస్తున్నట్టు చెప్పారు. 48 మీటర్లు పూర్తి చేశామని మరో 12 మీటర్ల ఎత్తు పెంచాల్సి ఉందన్నారు. 13.735 కిలోమీటర్ల పొడవున నిర్మించాల్సిన కట్టను 7కిలోమీటర్లు పూర్తి చేశామన్నారు. 0-3 కిమీ పరిధిలో 110 ఎకరాలపై నిర్వాసితులు హైకోర్టు నుంచి స్టేటస్కో తెచ్చినందున ఆపనులు ప్రారంభం కాలేదన్నారు. ప్రస్తుతం 1 టిఎంసి నీటి సామర్ధ్యాన్ని నింపే విధంగా రిజర్వాయర్ పనులు పూర్తి అయ్యాయన్నారు. ఆగస్టు చివరి నాటికి 1.5 టిఎంసి నీరును ఈ రిజర్వాయర్‌లో స్టోరేజీ చేయనున్నట్టు వివరించారు. బిఎన్ తిమ్మపురం ముంపు గ్రామానికి చెందిన నిర్వాసితులకు భువనగిరి పట్టణం హుస్సేనాబాద్‌లో, లప్పనాయక్ తండాకు చెందిన నిర్వాసితులకు దాతరుపల్లిలో ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద పునరావసం ఏర్పాటు కోసం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ యాదాద్రి భువనగిరి జిల్లా సహయ కార్యదర్శులు యానాల దామోదర్‌రెడ్డి, బొలగాని సత్యనారాయణ, ఎఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు శ్రీమాన్ తదితరులు పాల్గొన్నారు.