తిండిలేక అల్లాడుతున్న ప్రజలు
ఈ నెలాఖరు వరకే నిల్వలు
భవిష్యత్తుపై భయాందోళనలు
కాబూల్ : ఆఫ్ఘస్థాన్‌లో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. గత నెల రెండో వారంలో తాలిబన్లు అధికార పగ్గాలను చేపట్టడం, దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘని దేశాన్ని విడిచి పారిపోవడం వంటి పరిణామాలు తీవ్ర సంక్షోభాన్ని సృష్టించాయి. అమెరికా బలగాల ఉపసంహరణ పూర్తికావడంతో పూర్తి స్వేచ్ఛా స్వాతంత్య్రాల ను సంపాదించినట్టు ప్రకటించిన తాలిబన్లు ఇంకా ప్రజా సమస్యలపై దృష్టి కేంద్రీకరించలేదు. అస్తవ్యస్తమైన పానలా వ్యవస్థ కొనసాగుతున్నది. ప్రజలు అభద్రతాభావంతో రోజులు గడుపుతున్నారు. భద్రతాపరమైన ఆంశాలు ఒకవైపు వేధిస్తుండగా, ఆహార సమస్య మరోవైపు ఆఫ్ఘన్‌ను పట్టిపీడిస్తున్నది. సరైన తిండిలేక ప్రజలు అల్లాడుతున్నారు. ఈ నెలాఖరు వరకే ఆహార నిల్వలు ఉన్నాయని అఫ్గాన్ హ్యుమానిటేరియన్ కోఆర్డినేటర్, స్పెషల్ డిప్యూటీ రిప్రెజెంటెటివ్ రమీజ్ అలక్బరొవ్ చేసిన ప్రకటన భవిష్యత్తుపై భయాందోళనలను రేపుతున్నది. దృశ్య మాధ్యమంగా మీడియాతో మాట్లాడు తూ ఆయన తెలిపిన వివరాల ప్రకారం దేశం లో సుమారు ఆరు లక్షల మంది తమతమ స్వస్థలాలను విడిచిపెట్టారు. వీరంతా ప్రత్యేక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. దేశంలోని చిన్నారుల్లో సగానికిపైగా పౌష్టికాహార లోపం తో బాధ పడుతున్నారు. సుమారు 1.8 కోట్ల మంది ప్రజలకు ఒకపూట తింటే రెండో పూట ఆహారం అందుతుందా? లేదా? అనేది ప్రశ్నార్ధకంగా మారింది. కనీసం 200 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం ఉంటేనేగానీ పరిస్థితి మెరుగుపడదు. దేశ జనాభాలో మూడో వంతు ప్రజలు పస్తులతో కాలం వెళ్లదీస్తున్నారు. ఈనెలాఖరు వరకూ ప్రస్తుతం ఉన్న ఆహార నిల్వలతో నెట్టుకురావచ్చు. ఆతర్వాత పరిస్థితిని ఊహించడం కూడా కష్టంగా ఉంది. ప్రపంచ ఆహార భద్రతా కార్యక్రమం క్రింద ఐక్య రాజ్యసమితి నుంచి అందే సాయంపైనే అఫ్గానిస్థాన్ ఎన్నో ఏళ్లుగా ఆధారపడుతూ వస్తుంది. ప్రస్తుతం దేశాలో నెలకొన్న పరిస్థితుల కారణంగా సాయం అందించే వారి సంఖ్య తగ్గపోతున్నదని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటానియో గటర్స్ తెలిపారు. ఇటీవల కాలంలో 80,000 మంది ప్రజలకు రిలీఫ్ ప్యాకేజీలు అందించామని ఆయన ప్రకటించారు. అదే విధంగా 1.25 మెట్రిక్ టన్నుల అత్యవసర మందులను కూడా అఫ్గాన్‌కు పంపినట్టు చెప్పారు. పాకిస్తాన్, అఫ్గాన్ సరిహద్దు వెంట 600 మెట్రిక్ టన్నుల ఆహార సరఫరా జరిగిందన్నారు. అయితే, ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగాల్సి ఉందన్నారు. అఫ్గాన్‌లో నెలకొన్న దుర్భర దారిద్య్ర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సాయం అందించాల్సిందిగా తాము సభ్య దేశాలను కోరినట్టు ఆయన తెలిపారు. 1.3 బిలియన్ డాలర్ల మేర సాయం అవసరంకాగా, కేవలం 400 మిలియన్ డాలర్లు మాత్రమే ఇప్పటి వరకూ అందినట్టు చెప్పారు. గటర్స్ ప్రకటన రాబోయే ఆహార సంక్షోభానికి అద్దం పడుతున్నది. ప్రమాద ఘంటికలను మోగిస్తున్నది. ఇప్పటికే ఆకలికేకలతో హోరెత్తిపోతున్న అఫ్గాన్‌లో ఆకలి చావులు కూడా చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తున్నది. తాలిబన్లు ఎంత త్వరగా పరిస్థితిని చక్కదిద్దితే అంత మంచిది. కానీ, వారు అంత త్వరగా స్పందిస్తారా అన్నది అనుమానంగానే కనిపిస్తున్నది.