‘ఆన్‌లైన్‌’ మోసగాళ్లకు నిరుద్యోగులే టార్గెట్‌

ముగ్గురు ‘ట్రేడ్‌’మోసగాళ్ల అరెస్ట్‌
నమ్మి నగదు బదిలీ చేయొద్దు : సైబర్‌ పోలీసులు
ప్రజాపక్షం/హైదరాబాద్‌ ప్రతి అవకాశాన్ని సైబర్‌ దొంగలు తమకు అనుకూలంగా మల్చుకుంటున్నారు. ప్రజల అవసరాలు, వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుంటూ ‘స్మార్ట్‌’గా మోసాలకు పాల్పడుతున్నారు. ప్రధానంగా నిరుద్యోగులనే సైబర్‌ నేరగాళ్లు టార్గెట్‌ చేస్తున్నారు. ఏదో ఒక రూపంలో వారికి ఉద్యోగ ఆశలు, లేదా ‘ఆన్‌లైన్‌ ఆదాయం’ పేరుతో లక్షల సంపాదన అం టూ మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల సిఎం ఒఎస్‌డి పిఎ అంటూ ఒకరు మోసం చేయగా, తాజాగా ‘ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌’ పేరుతో మగ్గురు సైబర్‌ నేరగాళ్లు కోటీ రూపాయలకు పైగా మోసం చేశారు. ఈ కేసులో మరి కొంత మంది బాధితులు ఉంటారని పోలీసులు బావిస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన బాదితులు కూడా ఉన్నట్టు తెలిసింది. ఆదివారం వారిని అరెస్ట్‌ చేశారు. హైదరాబాద్‌కు చెందిన ఒక మహిళకు ‘ఫేస్‌బుక్‌’ ద్వారా సాక్షి మెహత పేరుతో పరిచయం అయింది. సాక్షి మెహత షేర్‌ ట్రేడింగ్‌ కన్సల్‌టెంట్‌గా పరిచయం చేసుకుంది. న్యూఢిల్లీలోని వసంత్‌కుంజ్‌లో ‘సెంట్రల్‌ ట్రేడ్‌ రిసర్చ్‌’ ఆఫీస్‌ ఉన్నదని నమ్మబలికింది. సదరు బాధిత మహిళకు ఫోన్‌ చేసి తమ కంపెనీలో ‘డి-మ్యాట్‌’ ఖాతాను తెరిస్తే భారీగా లాభాలు ఆర్జించవచ్చని బాధితురాలిని నమ్మించింది. దీంతో బాధితురాలు తన బ్యాంక్‌ ఖాతా నుంచి రూ. 5 లక్షల ‘సెంట్రల్‌ ట్రేడ్‌ రిసర్చ్‌’కు బదిలీ చేసింది. ఆ తర్వాత సాక్షి మెహత ట్రేడింగ్‌ వ్యాపారంలో రూ. 88 లక్షల ఆదాయం వచ్చింది స్పష్టం చేసింది. ఈ ఆదాయాన్ని తీసుకోవాలంటే తమ కంపెనీ నిబంధనల ప్రకారం కొంత మొత్తాన్ని చెల్లించాలని సూచించింది. అలా బాధితురాలు నుంచి సుమారు రూ. 1.2 కోటీ వరకు వసూలు చేశారు. ఆ తర్వాత ‘సెంట్రల్‌ ట్రేడ్‌ రిసర్చ్‌’ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. ఆ తర్వాత బాధితులు తాను మోసపోయానని గుర్తించింది. దీంతో మార్చి 1న హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించింది. సిసిఎస్‌ ఎసిపి కెవిఎం.ప్రసాద్‌ నేతృత్వంలోని ఇన్‌స్పెక్టర్‌ కె.హరిభుషన్‌రావు, ఎస్‌ఐలు ఎం.కృష్ణ బృందం ఈ కేసు నమోదు చేసుకున్న సైబర్‌ పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టింది. ఈ కేసుకు సంబంధించి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన తృన్‌ ప్రజాపతి, సందీప్‌ బన్‌సోడే, కెసర్‌బాగ్‌ చౌకిలోని బబ్లు చౌహన్‌లను అదుపులోనికి తీసుకుని విచారించారు. ఇలా అనేక మందిని మోసం చేసినట్టు వారు అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన వారిని కూడా మోసం చేసినట్టు ఒప్పుకున్నారు. ఆ ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. వారి నుంచి డెబిట్‌,క్రెడిట్‌ కార్డ్‌, మూడు మొబైల్‌పోన్లను స్వాధీనం చేసుకున్నారు.
నగదు చెల్లింపులొద్దు
సోషల్‌మీడియా వేదికగా గుర్తుతెలియని వ్యక్తులను నమ్మవద్దని హైదరాబాద్‌ పోలీసులు సూచించారు. వారికి డబ్బలును బదిలీ చేయడం, ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ లాంటివి చేయవద్దని తెలిపారు. డబ్బులు చెల్లించే ముందుగానే అన్ని నిర్ధారించుకోవాలని సూచించారు.

DO YOU LIKE THIS ARTICLE?