ఆదేశాలు జారీచేసినా.. మళ్లీ అదే తంతు
వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు అక్షింతలు
ప్రజాపక్షం/హైదరాబాద్ ధరణి పోర్టల్‌లో ఆధార్, కులం, ఫోన్ నెంబర్ వంటి వ్యక్తిగత వివరాల్ని నమోదు చేసే సాఫ్ట్వేర్ మాన్యువల్‌ను మార్పు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ విధంగా చేసే వరకూ వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ల బుకింగ్ కూడా నిలిపివేయాలని మధ్యంతర ఆదేశాలిచ్చింది. ఆధార్ ఇతర వ్యక్తిగత వివరాలను నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ న్యాయవాదులు సాకేత్, గోపాల్‌శర్మ ఇతరులు వేసిన పిల్స్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం గురువారం విచారించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఆధార్ నమోదు చేయబోమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హామీని లిఖితపూరకంగా ఇచ్చారని అడ్వకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్ చెప్పారు. ఆధార్ లేకుండా ధరణి మాన్యువల్‌ను సవరిస్తామని చెప్పారు. ఐచ్చికంగా ఇస్తేనే ఆధార్ నమోదు చేస్తున్నామని, బలవంతం ఏమీ లేదన్నారు. దీనిపై స్పందించిన హైకోర్టు గత హామీకి విరుద్ధంగా ఐచ్చికంగా తీసుకోవడాన్ని ఆక్షేపించింది. కోర్టుకు ఇచ్చిన హామీ అమలు చేయకపోతే అందుకు విరుద్ధంగా చేస్తే ఎదురయ్యే పరిణామాలు ఏమీటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదని వ్యాఖ్యానించింది. ఆధార్‌కు ప్రత్నామ్నాయంగా ఇతర గుర్తింపు కార్డులతో రిజిస్ట్రేషన్లు ఎందుకు చేయడం లేదంది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు ఆధార్ నెంబర్, కులం, ఇతర వివరాల నమోదు చేయమన్న హామీని ఎందుకు ఉల్లంఘించారని ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. స్వచ్చందంగా ఇస్తేనే నమోదు చేస్తున్నామని తెలివిగా జవాబు చెబితే కుదరదని హెచ్చరించింది. హామీ మేరకు చేయాల్సిందేనని, ఆధార్, కులం ఇతర వ్యక్తిగత వివరాల నమోదు చేసే ధరణిలో మాన్యువల్‌ను సవరించాలని చెప్పింది. అంత వరకూ రిజిస్ట్రేషన్లకు స్లాట్లను బుకింగ్ చేయరాదని మధ్యంతర ఆదేశాలిచ్చింది. కోర ్టంటే తెలిగ్గా తీసుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. హామీకి వ్యతిరేకంగా చేసినందుకు క్షమించమంటే సరిపోదని చెప్పింది. హామీ అమలు చేయకుండా ఐచ్చికంగా ఇచ్చిన వాళ్ల ఆధార్ నెంబర్ ఇతర వివరాలు నమోదు చేస్తున్నామని చెప్పడం ఎంతమాత్రం సమర్ధనీయం కాదని వ్యాఖ్యానించింది. ఈ పిల్స్‌పై విచారణ ఈ నెల 28కి వాయిదా వేసింది. స్లాట్ బుకింగ్ మాన్యువల్ 29 పేజీలతో వినియోగదారులకు గందరగోళంగా చేశారని, ఆధార్ ఉంటేనే స్లాట్ బుక్ అవుతోందని న్యాయవాది ప్రకాశ్‌రెడ్డి చెప్పారు. రిజిస్ట్రేషన్లకు పీటీఐఎన్ అవసరం లేకపోయినా అక్రమ లేఔట్లకు పీటీఏఎన్ ఇవ్వడం లేదని, లేఔట్లు వేసి అమ్మేసుకుపోయినోళ్లను వదిలేసి ప్లాట్లను కొన్నవాళ్లను ప్రభుత్వం వేధిస్తోందన్నారు. ట్రైబుల్ ఏరియాలో ల్యాండ్స్‌ను ధరణిలో చేర్చే అధికారం ఉందని ప్రభుత్వం మరో రిట్లో చెప్పింది. దీనిపై తమ అభ్యంతరాలు చెప్పడానికి సమయం కావాలని వీరమల్లు మరొకరు వేసిన పిల్స్ తరఫు లాయర్ కోరగా అందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. వ్యవసాయ ఆస్తులకు ఆధార్ నెంబర్ తీసుకోవడాన్ని సవాల్ చేసిన పిల్‌పై విచారణను కూడా హైకోర్టు వచ్చే సోమవారానికి వాయిదా పడింది.
ఆధార్ అడగొద్దు
RELATED ARTICLES