గుడిసెకు నిప్పంటుకుని పేలిన సిలెండర్!
ముగ్గురు మృత ఏడుగురికి గాయాలు
మృతులకు రూ. 10 లక్షలు, క్షతగాత్రులకు రూ. 2 లక్షలు ఎక్స్‌గ్రేషియా
సిఎం కెసిఆర్ దిగ్భ్రాంతి
ప్రజాపక్షం/ ఖమ్మం భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) ఆత్మీయ సమ్మేళ నం సందర్భంగా నాయకులకు స్వాగతం పలుకుతూ కాల్చిన బాణాసంచా తీవ్ర విషాదాన్ని నింపింది. నిప్పంటుకుని గుడిసె దగ్ధమై ఘటనలో ముగ్గురు మృతిచెందగా మరొకరు మృత్యువుతో పోరాడుతున్నారు. ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కాళ్లు, చేతులు తెగిపడి భయానక పరిస్థితి నెలకొంది. ఎటు చూసినా మాంసపు ముద్దలు, కాళ్లు తెగిపడిన క్షతగాత్రులు, బంధువుల రోదనలతో చీమలపాడు దద్దరిల్లింది. వివరాల్లోకి వెళితే… ఖమ్మంజిల్లా కారేపల్లి మండలం చీమలపాడు గ్రామంలో బుధవారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించ తలపెట్టారు. ఖమ్మం పార్లమెంటు సభ్యులు నామ నాగేశ్వరరావు, వైరా శాసన సభ్యులు లావుడ్యా రాములు నాయక్, రైతుబంధు జిల్లా అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. గ్రామ సమీపంలోకి రాగానే నాయకులకు స్వాగతం పలుకుతూ కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. నిప్పురవ్వలు రాములుకు చెందిన పూరింటిపై పడ్డాయి. అప్పటికే ప్రదర్శన గుడిసెను దాటి ముందుకు వెళ్లింది. లేకుంటే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండేది. ప్రదర్శన దాటిపోయిన కొద్ది నిమిషాలకు పూరిల్లు పైపడిన నిప్పు రాజుకుని మంటలు చెలరేగాయి. మంటలను ఆర్పేందుకు కొందరు ప్రయత్నించారు. అయితే పూరింట్లో ఉన్న గ్యాస్ సిలిండర్‌కు నిప్పు అంటు కుని ఒక్కసారిగా సిలిండర్ పేలి దాదాపు 30 మీటర్ల దూరం దూసుకు వచ్చింది. ఈ ప్రాంతం లో ఉన్న అనేక మంది కాళ్లు తెగిపోయాయి. ఈ ఘటనలో స్టేషన్ చీమలపాడుకు చెందిన బానోత్ రమేష్ (38) మృతి చెందాడు. ఇతనికి ఓ కుమారుడు, ఓ కుమార్తె, భార్య ఉన్నారు. అజ్మీర మంగు అలియాస్ మంగ్యా (39) మృతి చెందాడు. ఇతనికి ఇద్దరు కుమారులు, భార్య ఉన్నారు. ధర్మసోత్ లక్ష్మణ్ (50) మృతి చెందాడు. ఇతనికి భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఇదిలా వుండగా,మహారాష్ట్రకు చెందిన వలస కూలీ సందీప్‌కు రెండు కాళ్లు తెగిపోయాయి. టేకులపల్లి మండలం తడికలపూడికి చెందిన తేజావత్ భాస్కర్, జర్నలిస్టు అంగోత్ కుమార్ కాళ్లు నుజ్జు నుజ్జు కావడంతో అతనికి కాళ్లు తొలగించారు. నాగేశ్వరరావు, తేళ్ల శ్రీనివాసరావు అనే మరో ఇద్దరు జర్నలిస్టులకు తీవ్ర గాయాలయ్యాయి. నాగటి వెంకన్న, గిరిబాబు కూడా ఈ ఘటనలో గాయపడ్డారు. పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న దాసా నవీన్‌కు పేలిన సిలిండర్ సూటిగా తగలడంతో కాలుకు తీవ్రగాయమైంది. కాలు తీస్తే తప్ప బతకడం కష్టమని వైద్యులు అంటున్నారు.
రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా…
చీమలపాడు ఘటనలో మృతిచెందిన వారికి రూ. 10 లక్షలు, గాయపడిన వారికి రెండు లక్షల చొప్పున ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందిస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ప్రకటించారు. ఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి కేసిఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్కుమార్తోను, ఎంపి నామ నాగేశ్వరరావుతోను ఆయన ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్బంగా మంత్రి అజయ్‌కుమార్ మాట్లాడుతూ మృతిచెందిన, గాయపడిన వారి కుటుంబాలకు బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఇది అత్యంత దురదృష్టకర ఘటన అని అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఖమ్మం పార్లమెంటు సభ్యులు నామ నాగేశ్వరరావు నామ ముత్తయ్య ట్రస్టు నుంచి మృతి చెందిన కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల ఆర్థిక సాయం ప్రకటించారు. ఎంఎల్ఎ రాములు నాయక్ గాయపడిన వారికి లక్ష రూపాయలు, మృతిచెందిన వారికి రెండు లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. వీరిద్దరు బాధిత కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని వారు ప్రకటించారు.
ఆసుపత్రిలో క్షతగాత్రులకు పరామర్శ…
చీమలపాడు ఘటనలో గాయపడి ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని బిఆర్ఎస్, సిపిఐ, సిపిఎం, టిడిపి, కాంగ్రెస్ నేతలు పరామర్శించారు. ఎంపి నామ నాగేశ్వరరావు, డిసిసిబి ఛైర్మన్ కూరాకుల నాగభూషణం, ఎంఎల్‌సి తాతా మధు, ఎంఎల్ఎ రాములు నాయక్, సత్తుపల్లి శాసన సభ్యులు సండ్ర వెంకటవీరయ్య, మాజీ శాసన సభ్యురాలు బానోత్ చంద్రావతి, సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ తదితరులు పరామర్శించారు.
కాసాని జ్ఞానేశ్వర్ సంతాపం
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో చోటు చేసుకున్న సంఘటనపై టిటిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వ్యక్తులకు ప్రభుత్వ ఖర్చుతో వారు కోలుకునే వరకు వైద్య సహాయం అందించాలన్నారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.50 లక్షలు నష్టపరిహారం అందించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గాయపడిన వారికి రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని, బాధితులైన కుటుంబంలోని వారికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కాసాని కోరారు.