తెలంగాణ రాష్ర్టంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా భావిస్తూ, వివిధ పార్టీలు ఎడా పెడా హామీలు కోటలు దాటుతున్నాయి. పార్టీలు ఒకరిని మించి ఒకరు హామీలల్లో పోటీ పడుచున్నారు. భారీ హామీలతో జనాన్ని ఆకర్షించి ఓట్లను తమ ఖాతా ల్లో వేయించుకోవాలని ఉవ్విళ్లూరుచున్నారు. మేని ఫెస్టోల వంటకాలల్లో తలమునకలైండ్రు మనోళ్లు. అమలులో మా లెక్కలు మాకున్నాయని ఒక్కరు, అది అయ్యేపని కాదని మరొక్కరు ప్రజల ఓట్లకై హామీల వల విసురుతున్నారు. ప్రజల కనీస అవస రాలను పట్టించుకోని పార్టీలు నేడు ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటామంటున్నాయి. మీకు పాలేరులం, సేవకులం అంటూ రోడ్డుపై భజనలు చేస్తుండిరి. తెలంగాణ రాష్ర్టం కోసం ఆరు తరాలుగా ప్రజలు వారి ధన, మానప్రాణాలు లెక్క చేయకుండా చేసిన త్యాగాలనుండి స్ఫూర్తి పొందండి. రాజకీయాల్లో విలువలకు కట్టుబడి నిస్వార్థంగా ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సి ఉందని గమనించండి. తెలంగాణ రాష్ర్టం సమ్మిళిత అభివృద్ధిని సాధించాలె. విలువలకు నైతికతకు ప్రాణం పోయాలె. పాలనలో మానవీయ కోణం జోడించాలె. సమసమాజ స్థాపనే ధ్యేయంగా ప్రజా పక్షాన నిలిచే మేనిఫేస్టో (విధానాల)తో ప్రజా రంజక పాలనకు, నాయకులు కట్టుబడాలే, ప్రజలు అలాంటివారికే పట్టం కట్టాలె.
ప్రజా అవసరాలను పట్టించుకోని విధానాల మూలంగా ఓటింగ్ శాతం క్రమేణా తగ్గిపోయి 4050 శాతం ఓట్లతో ఎన్నికల్లో ఫలితాలు నిర్ధేశిం చి పాలకులై అధికార పీఠాన్ని చేపడుతున్న దాఖలాలు చూస్తుంటిమి. ఈ విధానం ప్రజలకు, ప్రజాస్వామ్యానికి క్షేమదాయకంకాదు. పార్టీ (నాయకు)ల విపరీత ధోరణుల మూలంగా ఓటు బ్యాంకు పద్ధతుల వల్ల మా ఓట్లన్నీ ఫలానా వారికే అనే అప్రజాస్వామ్య విధానాలు ఒక వైపైతే, మరో వైపు ఏళ్ళకేళ్లుగా ఓపిక పట్టినా కనీసం రోడ్లు వేయక, కనీస అవసరాలు తీర్చకపోవడం జరుగు తుంది. దయచేసి ఏ పార్టీ(నాయకు)లు ఓటు (ప్రచారం) కోసం మా గ్రామానికి అడుగుపెట్ట వద్దు అని ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం గుబిడి వాసులు బ్యానర్లు కట్టారు. పై రెండు అంశాలను పరిశీలిస్తే క్షేత్రస్థాయిలో ఏం జరుగు తుంది? వీటికి బాధ్యు లెవరు? ప్రజలా ! పాలకులా ! మనం ఎక్కడున్నాం, రేపు ఏం జరగబోతుంది… దీనికి ఏ ఒక్కరినో బాధ్యులను చేయడం కన్నా సమిష్టి బాధ్యతగా తీసుకొని, రాజ కీయాల్లో విలువలు నెల కొల్పాల్సి ఉందని గమ నించండి. అది నేటినుండే, మన నుండే మొదలు పెడదాం… ఎన్నికల వేళ పార్టీ(నాయకు)లు రాష్ర్ట ఖజానాను ప్రజల అవసరాలను పరిగణనలోకి తీసుకొని మేనిఫేస్టోలు, విధానాలు వెలువరించండి. వాటిపై ప్రజా క్షేత్రంలో చర్చలు జరిగేలా చూడాలి. వాటి సారం ప్రజలకు బోధపడాలి. వారి కనీస అవసరాలు అందులో చేర్చబడాలి. రాజ్యాంగాన్ని గౌరవిస్తూ రాజ్యాంగ బద్ధంగా రాగద్వేషాలు లేకుండా పాలన సాగించబడాలి. అప్పుడు మాత్రమే రాజకీయాల్లో విలువలు, ఎన్నికలపై విశ్వాసం పెరుగుతుంది. ఎన్నికల వేళ తిట్లదండ కాలు, బూతు పురాణాలతో ప్రజల కళ్ళకు గంతలు కట్టడం మానాలి. ప్రజలు తమ ఓటు ద్వారా రాజ్యాంగ బద్ధంగా ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన ను ఐదేళ్ళు చేయమని అందిస్తే, అకారణంగా మధ్యంతర(ముందస్తు) ఎన్నికలకు వెళ్లడం ప్రజల పై ఆర్థిక భారం మోపడం కాదా! ప్రజలిచ్చిన అధికారాన్ని తక్కువ చేయడం కాదా ! పూర్తికాలం బాధ్యతలు నిర్వహించాలి. అప్పుడు మాత్రమే ప్రజలను గౌరవించినవారు అవుతారు. పార్టీ ఏదై నా, విధానం ఏదైనా అంతిమంగా ప్రజలే మనకు శిరోధార్యం. వారి క్షేమమే పాలకుల పార్టీల అంతిమ లక్ష్యంగా ఉండాలి. ఏకపక్ష నిర్ణయాల వలన అన్ని పక్షాల ప్రజల స్వేచ్ఛకు భంగం కల్గించి నట్లే కదా ! పాలకులు అంటే ? ప్రజల సేవకులు మాత్రమేనని మరువరాదు. అధికారం చలాయిం చడం కాదు ? వారికై వారు ఏర్పరుచుకున్న గార్డియన్లు మీరని పాలకులు గమనించండి. ప్రజలను గౌరవించడంలో నాయకులు విఫలమైతే మిమ్ముల్ని గౌరవించడంలో ప్రజలు కూడా విఫల మౌతారు.
తెలంగాణ రాష్ర్టంలో డిసెంబర్ జరుగుతున్న శాసనసభ ఎన్నికల తేదీలు ఖరారు కావడంతో రాష్ర్టంలో రాజకీయ వేడి గరిష్ఠ స్థాయికి చేరుకుం టున్నది. పలు పార్టీ(నాయకు)లు వారి స్థాయిని మించి అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రచారంలో భాగంగా రాష్ర్టమంతటా సభలు, సమా వేశాల ద్వారా వారి పార్టీ విధానాలు, మేనిఫేస్టోల్లో చేర్చిన వాటిని ప్రజల ముందుంచాల్సి ఉంది. అలా వివిధ పార్టీ మేనిఫేస్టో(విధానా)లను ప్రచార ప్రసార మాధ్యమాల ద్వారా విశ్లేషకులు, రాజకీయ నిపుణులు చర్చలు జరిపి ప్రజా బాహుళ్యంలోకి తేవాల్సి ఉంది. ఇలా ఎన్నికల సంఘం విధించిన నిబంధనలు, గడవులను పరిగణనలోకి తీసుకుని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు వివరించి, చర్చల సారం క్షేత్రస్థాయిలో సామాన్య ఓటరుకు చేర్చాలి. ఓటరు మహాశయుడు వారి ప్రాధాన్యతలకు స్థానం కల్పించిన పార్టీ (నాయకు)లకు పాలనా పగ్గాలను ఓటు ద్వారా అందిస్తాడు. ఇలా ప్రజాస్వామ్య పద్ధతులను పాటించి ఎన్నికల ప్రక్రియ పట్ల అందరు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యతగా భావించాలి. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కల్గించ కూడదు. ఒకరిపై ఒకరు పార్టీ(నాయకు)లు భూతు పురాణాలు, తిట్ల దండకాలు అందుకుని వ్యక్తిగత దూషణల వలన రాజకీయ విలువలను కలుషితం చేయరాదు.
దాదాపు ప్రతి ఎన్నికల వేళ ఓటర్ల జాబితాపై వివాదాలు చెలరేగుతున్నాయి. సుమారు ఇప్పటి వరకు 16 సార్వత్రిక ఎన్నికలు, 350 పైగా అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించిన ఎన్నికల కమిషన్ (ఇ.సి.) చాలా అనుభవం ఉన్నప్పటికీ, ఓటర్ల జాబితా తయారీలో లోపాలను నేటికీ అరికట్టలేక పోతుంది. మనకన్నా చిన్న దేశమైన ఫిన్ జాతీయ జనాభా లిస్టు అధారంగా దానంతట అదే ఏ పౌరుడికి అయినా 18 ఏండ్లు నిండగానే ఓటరుగా నమోదు చేస్తుంది. రాజకీయ ఒత్తిళ్లతో జాబితాలో అర్హులైన వారి ఓట్లు తొలగిపోవడం, నకిలీలు వచ్చి చేరడం లాంటివి ఆపాలి. ప్రజా స్వామ్యంలో ఎన్నికల ప్రక్రియకు ఓటర్లే ప్రధానం కాబట్టి అందరు తమవంతు బాధ్యతలను, సహకారాన్ని విధిగా అందించాల్సి ఉందని గమనిం చండి. ప్రజా జీవితాల్లో వెలుగులు నింపాలని రాజకీయాల్లోకి వచ్చిన పార్టీ(నాయకు)లు విలువలను పాటిస్తూ, విలువైన పౌరులతో కూడిన సమాజాన్ని నిర్మించాలె.
మాట మనిషికి మాత్రమే దక్కిన గొప్పవరం, మనిషికి నిజమైన అలంకారం అతడి మాటతీరే..
* మేదాజీ,వరంగల్