HomeNewsTelanganaఆచరణయోగ్యంగా ఆలోచించాలి

ఆచరణయోగ్యంగా ఆలోచించాలి

ఇండియా కూటమిలో పార్టీలను చీలుస్తున్న బిజెపి
బిఆర్‌ఎస్‌తో బిఎస్‌పి పొత్తు దురదృష్టకరం
తెలంగాణలో మిత్రధర్మంగా ఒక లోక్‌సభ స్థానాన్ని సిపిఐకి కాంగ్రెస్‌పార్టీ కేటాయించాలి
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనేంనేని
ప్రజాపక్షం / హైదరాబాద్‌ బిజెపిని నిలువరించేందుకు మిత్రధర్మంగా కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో ఒక లోక్‌సభ స్థానాన్ని సిపిఐకి కేటాయించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనేంనేని సాంబశివరావు విజ్ఞప్తి చేశారు. తాము పోటీ చేసేందుకు వీలు కలిగిన ఐదు స్థానాల పేర్లను ప్రకటించి, అందులో ఒకటి ఇవ్వాలని ఇప్పటికే కోరిన విషయాన్ని గుర్తు చేశారు. హైదరాబాద్‌ మగ్దూంభవన్‌లో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌ రెడ్డి, కార్యదర్శివర్గ సభ్యులు పల్లా వెంకట్‌ రెడ్డి, పశ్యపద్మ, ఎన్‌.బాలమల్లేశ్‌లతో కలిసి శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే ప్రకటించిన నాలుగు ఎంపి స్థానాల్లో ఒకటి సిపిఐ కోరిన స్థానం ఉన్నదన్నారు. బిజెపి మరింత దూకుడుగా వెళుతుందని, ఇండియా కూటమిలో పార్టీలను చీల్చడమో, లేదా బెదిరించి లొంగదీసుకోవడమో చేస్తున్నదని ఆయన విమర్శించారు. లోక్‌సభ ఎన్నికలలో బిజెపిని నిలువరించేందుకు కాంగ్రెస్‌ పార్టీ కచ్చితంగా ఆచరణయోగ్యంగా ఆలోచించాలని కూనంనేని సూచించారు. అన్ని పార్టీలను కలుపుకున్న చోట కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తోందని, కలుపుకోని చోట దెబ్బతింటున్నదని, ఈ విషయం ఇటీవల ఎన్నికలలో కూడా నిరుపితమైందన్నారు. రాష్ట్రంలో బిఆర్‌ ఎస్‌తో బిఎస్‌పి రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌.ప్రవీణ్‌కుమార్‌ కలవడం దురదృష్టకరమని కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యానించారు. నిన్న, మొన్నటి వరకు బిఆర్‌ఎస్‌ను వ్యతిరేకించిన బిఎస్‌పి వైఖరిలో ఇంతలోనే ఎందుకు అంత మార్పు వచ్చిందోనని ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆకునూరి మురళి బిఎస్‌పి వైఖరికి వ్యతిరేకంగా స్పందించారని గుర్తు చేశారు. గత శాసనసభ ఎన్నికలకు ఇప్పటికీ మారిన వైఖరిపై బహుజనులకు, రాష్ట్ర ప్రజలకు బిఎస్‌పి సమాధానం చెప్పాలని అన్నారు.
కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ముద్దాయిగా చేసేందుకు బిఆర్‌ఎస్‌ ప్రయత్నం
‘కాళేశ్వరం’ విషయంలో ప్రజల్లో అనుమానాలు సృష్టించే రీతిలో బిఆర్‌ఎస్‌ పార్టీ నేతలు ప్రకటనలు చేస్తున్నారని కూనంనేని సాంబశివరావు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ముద్దాయిగా చేయాలనే ధోరణిలో వారి ప్రకటనలు ఉంటున్నాయని, వారి ప్రతి మాట రాష్ట్రానికి చెడు చేస్తుందని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన బిఆర్‌ఎస్‌ నేతలు ఏమి చెప్పారో ఎవరికీ స్పష్టత లేదని, మేడిగడ్డ వద్ద పిల్లర్‌లకు స్పష్టంగా పగుల్లు కనిపిస్తున్నాయని, అయితే బిఆర్‌ఎస్‌ నేతలు వాటిని వెంటనే మరమ్మతు చేసి నీళ్లు నింపాలని అంటున్నారని అన్నారు. ఒకవేళ అలా చేస్తే మరోసారి ఇదే సమస్య తలెత్తితే, నష్టం జరిగితే బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కుంగిపోయిన పిల్లర్‌లకు సంబంధించి నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డిఎస్‌ఎ) నాలుగు నెలలు కాకుండా త్వరగా నివేదిక ఇవ్వాలని కూనంనేని సాంబశివరావు డిమాండ్‌ చేశారు. తక్షణమే నివేదిక ఇవ్వకుండా ఏదో ఒక రకంగా ఆలస్యం చేసి దానిని కట్టిన గత బిఆర్‌ఎస్‌ ప్రభుత్వంతో పాటు, పిల్లర్‌ల కుంగుబాటుపై ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా ఆలస్యం చేసిందని బద్నాం చేసే ఉద్దేశ్యం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి ఉన్నట్లుగా అనిపిస్తోందన్నారు. రాష్ట్రంలో నీటి ఎద్దడి సమస్య వచ్చే సూచనలు కన్పిస్తున్నాయని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పారని, దానిని ఎదుర్కొనేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి సమస్యలపై చర్చించాలని ఆయన సూచించారు.
పాలమూరు రంగారెడ్డికి ప్రధాని జాతీయ హోదా ఇవ్వాలి
కేవలం ఎన్నికల ముందు మాత్రమే ప్రధాని మోడీ రాష్ట్రానికి వచ్చి పోతున్నారే తప్ప తెలంగాణకు అవసరమైన పనులు, హామీలు అమలు చేయడంలేదని కూనంనేని సాంబశివరావు విమర్శించారు. రాష్ట్రంలో పలు కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ప్రధాని మోడీ, తెలంగాణకు అవసరమైన వాటిపై మాత్రం స్పందించలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు దెబ్బతిన్నదని, పాలమూరు రంగారెడ్డికి గతంలో బిజెపి మాటిచ్చినట్లు జాతీయ హోదా ఇస్తారో లేదో ప్రధాని పర్యటనలో చెప్పాల్సిందన్నారు. అలాగే రాష్ట్రానికి వివిధ రూపాల్లో రావాల్సిన నిధుల బకాయిలు, ప్రోత్సాహకాలపై ఏమి మాట్లాడకపోవడం విచాకరమన్నారు.
గుడిసెలకు పట్టాలు ఇవ్వాలి
రాష్ట్రంలో అనేక ఏళ్లుగా ప్రభుత్వ భూముల్లో నిరుపేదలు వేసుకున్న గుడిసెలు, నిర్మాణాలకు పట్టాలు ఇవ్వాలని, పక్కా గృహాల నిర్మాణానికి రూ.5 లక్షల గృహ నిర్మాణ పథకం నిధులు ఇవాలని చాడ వెంకట్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే పేదల జాగాలకు సంబంధించి ఆన్‌లైన్‌ దరఖాస్తులు పూర్తయ్యాయని, సామాజిక, ఆర్థిక సర్వే పూర్తయిందన్నారు. శాసనసభ ఎన్నికలలో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్‌, సిపిఐల మధ్య మిత్రధర్మం కొనసాగాలని, లోక్‌సభ ఎన్నికల్లో ఒక స్థానాన్ని కేటాయించాలని అన్నారు. అలాగైతే ఓట్ల మార్పిడిలో ఇబ్బందులు జరగకుండా, ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో ఉంటుందని సూచించారు. గతంలో తాము పాలమూరు రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టుల సందర్శనకు వెళ్ళామని, తాము చేసిన ఒక్క సూచనను కూడా నాటి బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలుచేయలేదని విమర్శించారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments